Heeraben Modi: అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన మోదీ తల్లి

ABN , First Publish Date - 2022-12-28T14:22:11+05:30 IST

ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ ఆస్వస్థత కారణంగా అహ్మదాబాద్‌లోని యూఎన్ మెహతా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో..

Heeraben Modi: అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన మోదీ తల్లి

అహ్మదాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ (Heeraben Modi) ఆస్వస్థత కారణంగా అహ్మదాబాద్‌లోని యూఎన్ మెహతా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో బుధవారంనాడు చేరారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అయితే ఇతర సమాచారం ఏదీ వెల్లడించ లేదు. ఇటీవలే 100వ పడిలోకి అడుగుపెట్టిన హీరాబెన్ ఆసుపత్రిలో చేరగానే బీజేపీ గుజరాత్ ఎమ్మెల్యేలు దర్శబెన్ వాఘేలా, కౌషిక్ జైన్ తదితరులు ఆసుపత్రికి వెళ్లి ఆమె ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచు తన తల్లితో ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకుంటూ ఉంటారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల ఆయన హీరాబెన్‌ను నేరుగా కలుసుకుని ఆమె ఆశీస్సులు అందుకున్నారు. తల్లితో కలిసి టీ తాగుతూ ఉభయులు మాట్లాడుకుంటున్న ఫోటోలు సైతం సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించాయి. గత జూన్‌లో హీరాబెన్ 99వ పుట్టినరోజుకు కూడా మోదీ హాజరయ్యారు. నూరవ వసంతంలోకి అడుగుపెడుతున్న తన తల్లి గురించి 'మదర్' అనే టైటిల్‌తో మోదీ ఒక ఎమోషనల్ బ్లాగ్ కూడా రాశారు. ప్రధాన మంత్రి సోదరుడు ప్రహ్లాద్ మోదీ, ఆయన కుటుంబ సభ్యులు కర్ణాటకలోని మైసూరులో మంగళవారంనాడు కారు ప్రమాదంలో గాయపడిన కొద్ది గంటలకే హీరాబెన్ ఆసుపత్రిలో చేరడం వారి ఆత్మీయులను ఆందోళనకు గురిచేసింది.

Updated Date - 2022-12-28T18:20:37+05:30 IST