Border row: మోదీజీ..ఇది మంచి రాజకీయనేత లక్షణం కాదు..!
ABN , First Publish Date - 2022-12-18T19:07:42+05:30 IST
రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి మధ్యవర్తిత్వం చేస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటు మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దు వివాదాన్ని మాత్రం విస్మరిస్తున్నారని...
న్యూఢిల్లీ: రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి మధ్యవర్తిత్వం చేస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటు మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దు వివాదాన్ని మాత్రం విస్మరిస్తున్నారని శివసేన (UBT) నేత సంజయ్ రౌత్ (Sanjay Raut) అన్నారు. ఇది మంచి రాజకీయ నాయకుడి లక్షణం కాదని పార్టీ పత్రిక 'సామ్నా' సంపాదకీయంలో ఆదివారం వ్యాసం రాశారు.
మహారాష్ట్ర-కర్ణాటక మధ్య సరిహద్దుల వివాదం మానవత్వం కోసం జరుగుతున్న పోరాటంగా చూడాలని, ప్రజలు-రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పోరాటంగా చూడరాదని రౌత్ అన్నారు. కనీసం హోం మంత్రి అమిత్‌షానైనా ఈ సమస్య పరిష్కారానికి చొరవచూపడం మంచిదైందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తటస్థ వైఖరిని తీసుకుంటోందా అనేదే ఇప్పుడు ప్రశ్నార్ధకమవుతోందన్నారు. ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు పరిష్కరించకుంటే, న్యాయం కోసం ఎవరిని అశ్రయించాలని ఆయన ప్రశ్నించారు.
భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు సమయంలో బెళగావి, ఆ చుట్టుపక్కల మరాఠా మాట్లాడే గ్రామాలను అక్కడి ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా కర్ణాటకలో కలిపేశారని రౌత్ అన్నారు. అక్కడి ప్రజల పోరాటాన్ని బలవంతంగా అణిచివేయలేరని చెప్పారు. సరిహద్దు సమస్య పరిష్కారానికి పార్లమెంటు ఒక పరిష్కారం సూచించాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
కర్ణాటక ముఖ్యమంత్రి ఎస్ఎం బొమ్మై మహారాష్ట్రకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రకటనలు చేయడానికి బదులు బెళగవిలోని మరాఠా మాట్లడే ప్రజల నేతలు, సంస్థలతో చర్చలు జరపాలని రౌత్ సూచించారు. మహారాష్ట్ర ప్రాంతాల విషయంలో బొమ్మై గట్టిగా వాదిస్తుంటే మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే వాదన మాత్రం బలహీనంగా ఉందనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తోందని అన్నారు. ఈ అంశంపై ఇద్దరు సీఎంలతో అమిత్‌షా జరిపిన సమావేశంలో యథాతథ పరిస్థితి కొనసాగించాలని నిర్ణయించారని రౌత్ చెప్పారు.