Pakistan PM condoles: మోదీకి పాక్ ప్రధాని ఓదార్పు
ABN , First Publish Date - 2022-12-30T14:05:23+05:30 IST
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాతృమూర్తి హీరోబెన్ మోదీమృతికి పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సంతాపం..
ఇస్లామాబాద్: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాతృమూర్తి హీరోబెన్ మోదీ (Heeraben Modi) మృతికి పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) సంతాపం(Condolence) తెలిపారు. ''కన్నతల్లిని కోల్పోవడం కంటే పెద్ద నష్టం మరొకటి ఉండదు. తల్లిని కోల్పోయి దుఃఖంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీకి నా సంతాపం తెలియజేసున్నాను'' అని ఆయన ట్వీట్ చేశారు. గాంధీనగర్‌లోని శ్మశానవాటికలో హీరోబెన్‌కు మోదీ శుక్రవారంనాడు అంత్యక్రియలు చేశారు. చితికి నిప్పంటించి, చేతులు జోడించి అంతిమ నివాళులర్పించారు. మోదీ సోదరుడు సోమాభాయ్, ఇతర కుటుంబ సభ్యులు ఈ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
జపాన్, నేపాల్ ప్రధానుల సంతాపం
భారత ప్రధాన మంత్రి తల్లి మృతికి జపాన్ ప్రధాని ఫుమియో కిషిడ ఒక ట్వీట్‌లో సంతాపం తెలిపారు. ''తల్లిగారిని కోల్పోయిన మీకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తు్న్నాను'' అని కిషడ ఆ సందేశంలో పేర్కొన్నారు. నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ 'ప్రచండ' సైతం తల్లిని కోల్పోయిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి, ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. అమ్మ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. నేపాల్ మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవుబ సైతం ఒక ట్వీట్‌లో మీరాబెన్ మృతికి సంతాపం తెలిపారు. ఆమె ఆత్మకు మోక్షం సిద్ధించాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. శ్రీలంక మాజీ ప్రధాని మహేంద్ర రాజపక్స సైతం తల్లిని కోల్పోయిన భారత ప్రధాని మోదీకి సంతాపం తెలియజేశారు. తల్లిని కోల్పోవడం తీరని లోటని, మోదీ, ఆయన కుటుంబ సభ్యులు ఈ దుఃఖం నుంచి కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. భారత్‌లో రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ ఒక సంతాపం సందేశంలో ప్రధాని నరేంద్ర మోదీకి, ఆయన ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు.