Narendra Modi: సరైన సమయంలో సరైన ఎత్తుగడ
ABN , First Publish Date - 2022-11-16T17:29:23+05:30 IST
జి20 సమావేశాల్లో (Indonesia G20 Summit) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) , చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ (Chinese President Xi Jinping) మాట్లాడుకోవడం..
బాలి: ఇండొనేషియా బాలిలో జరుగుతోన్న జి20 సమావేశాల్లో (Indonesia G20 Summit) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) , చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ (Chinese President Xi Jinping) మాట్లాడుకోవడం మీడియాతో పాటు నేతలందరి దృష్టినీ ఆకర్షించింది. ఇండొనేషియా అధ్యక్షుడు ఇచ్చిన డిన్నర్ సమయంలో మోదీ, జిన్‌పింగ్ మాట్లాడుకున్నారు. షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. కుశల ప్రశ్నలు వేసుకున్నారు.
2020 జూన్ 15న గల్వాన్ ఘటనలో కల్నల్ సంతోష్‌బాబు సహా 20 మంది భారత సైనికులను చైనా ఆర్మీ పొట్టనపెట్టుకున్న తర్వాత మోదీ చైనాతో వ్యాపార, వాణిజ్య సంబంధాలను దాదాపు నిలిపివేశారు. భారత్‌లో పాపులర్‌గా ఉన్న చైనా యాప్‌లను నిషేధించడం ద్వారా మోదీ తమ నిరసన తెలియజేశారు. మోదీ నిరసనతో బిత్తరపోయిన చైనా చర్చల ద్వారా వివాదాన్ని పరిష్కరించుకునే యత్నాలు ముమ్మరం చేసింది. ఇప్పటికే అనేకమార్లు రెండు దేశాల సైన్యాధికారుల మధ్య చర్చలు జరిగాయి. వివాదం ఏర్పడిన ప్రాంతం నుంచి రెండు దేశాల సైన్యాలు వెనక్కు మళ్లాయి.
గల్వాన్ ఘటన జరిగిన దాదాపు రెండేళ్ల తర్వాత ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఉజ్బెకిస్థాన్ సమర్కండ్‌లో జరిగిన షాంఘై సహకార సంఘం (Shanghai Cooperation Organisation) సమావేశాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ హాజరయ్యారు. కానీ పరస్పరం మాట్లాడుకోలేదు. జిన్‌పింగ్‌తో మోదీ కనీసం కరచాలనం కూడా చేయలేదు. గల్వాన్ ఘటనకు నిరసనగానే మోదీ జిన్‌పింగ్‌తో మాట్లాడలేదు. చైనా అధ్యక్షుడితో మోదీ మాట్లాడకపోవడం దుమారం రేపింది. దౌత్యపరంగా నిరసన వ్యక్తం చేయడం ద్వారా నాడు ఇంటా బయటా మోదీ సరైన సంకేతాలు పంపినట్లే అయిందని పరిశీలకులు చెబుతున్నారు.
మళ్లీ ఇప్పుడు ఇండొనేషియా బాలి వేదికగా జరిగిన జీ20 సమావేశాల్లో మోదీ, జిన్‌పింగ్ మాట్లాడుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. జిన్‌పింగ్‌తో మోదీ మాట్లాడటం వెనుక ఓ మర్మముంది. సమావేశాల ముగింపు సమావేశంలో జీ 20 కూటమి అధ్యక్షత బాధ్యతలను భారత్‌కు అప్పగించారు. వచ్చే ఏడాది భారత్ అధ్యక్షతన భారత్‌లోనే జీ20 దేశాల సమావేశాలు జరగనున్నాయి. ఈ తరుణంలో 20 కూటమి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించక ముందే మోదీ జిన్‌పింగ్‌తో మాటలు కలిపారు. భారత్ అధ్యక్షతన జరగబోయే సమావేశాలకు ఇబ్బందులు ఎదురుకావొద్దనే ఉద్దేశంతో మోదీ వ్యూహాత్మకంగా వ్యవహరించి జిన్‌పింగ్‌కు షేక్‌హ్యాండిచ్చారు. గల్వాన్ ఘటన నేపథ్యంలో రెండేళ్ల పాటు చైనా అధినాయకత్వంతో మాట్లాడకపోవడం, వాణిజ్య కార్యక్రమాలను దాదాపు నిలిపివేయడం ద్వారా మోదీ దౌత్యపరంగా జిన్‌పింగ్‌పై ఒత్తిడి పెంచి గుణపాఠం నేర్పారని పరిశీలకులు చెబుతున్నారు. అదే సమయంలో భారత్‌లో కూడా తనపై వ్యతిరేకత రాకుండా మోదీ చూసుకున్నారు. మళ్లీ ఇప్పుడు సరైన సమయంలో సరైన వేదికపై జిన్‌పింగ్‌తో మాట్లాడటం ద్వారా మోదీ సరైన సంకేతాలు పంపారని పరిశీలకులు చెబుతున్నారు. జీ20 కూటమిలో అమెరికా, ఆస్రేలియా, కెనడా, సౌదీ అరేబియా, రష్యా, దక్షిణాఫ్రికా, టర్కీ, అర్జెంటైనా, బ్రెజిల్, మెక్సికో, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, బ్రిటన్, చైనా, ఇండొనేషియా, జపాన్, దక్షిణకొరియా, భారత్ ఉన్నాయి. పర్యావరణం, ఆర్ధిక రంగం సహా అనేక అంశాల్లో ప్రపంచవ్యాప్తంగా కీలక మార్పులు సంభవిస్తోన్న తరుణంలో శక్తిమంతమైన జీ20 కూటమి అధ్యక్షత బాధ్యతలు భారత్‌కు లభించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.