Bhagwant Mann: కీలక నిర్ణయం తీసుకున్న పంజాబ్ సీఎం

ABN , First Publish Date - 2022-11-13T20:07:34+05:30 IST

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ (Bhagwant Mann) కీలక నిర్ణయం తీసుకున్నారు.

Bhagwant Mann: కీలక నిర్ణయం తీసుకున్న పంజాబ్ సీఎం
Bhagwant Mann

చండీగడ్: పంజాబ్‌(Punjab)లో తుపాకుల వినియోగంతో హింస (Gun centred violence) పెరిగిపోవడంతో ముఖ్యమంత్రి భగవంత్ మాన్ (Bhagwant Mann) కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా గన్ లైసన్స్‌లు ఇవ్వరాదని నిర్ణయించారు. జిల్లా కలెక్టర్ వ్యక్తిగతంగా పరిశీలించి సరే అనుకుంటేనే కొత్తగా గన్ లైసన్స్‌లివ్వాలని నిర్ణయించారు. ఇప్పటికే ఇచ్చిన లైసన్స్‌లను రాబోయే మూడు నెలల్లో సమీక్షించాలని కూడా నిర్ణయించారు. తుపాకులను బహిరంగంగా ప్రదర్శించరాదని నిబంధన విధించారు. వేడుకల్లో తుపాకులు కాల్చడాన్ని కూడా శిక్షార్హం చేశారు. అవసరమనిపించినప్పుడల్లా తనిఖీలు చేస్తారు.

పంజాబ్‌లో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) సంచలన విజయం సాధించి భగవంత్ మాన్ అధికార పగ్గాలు చేపట్టిన కొద్ది రోజులకే వీఐపీలకు భద్రత తొలగించి కలకలం రేపింది. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్న ఒక్కరోజు వ్యవధిలోనే కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు, సింగర్ సిద్ధూ మూసేవాలాను కొందరు దుండగులు కాల్చి చంపారు. గ్యాంగ్‌స్టర్లు ఎందరో ఈ ఘటనకు లింక్ అయి ఉండటంతో ప్రభుత్వం లోతుగా దర్యాప్తు జరిపించింది. కొందరు గ్యాంగ్‌స్టర్లను ఎన్‌కౌంటర్లలో కాల్చి చంపింది. ప్రముఖులకు భద్రత తొలగిస్తూ మాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తాయి. అంతేకాదు పొరుగునే ఉన్న పాకిస్థాన్ నుంచి పెద్ద ఎత్తున తుపాకులను, అత్యంత అధునాతన ఆయుధాలను, డ్రగ్స్‌ను స్మగ్లర్లు పంజాబ్‌లోకి అక్రమంగా తరలిస్తున్నారు. డ్రోన్‌ల ద్వారా కూడా పాకిస్థాన్ నుంచి పంజాబ్‌లోకి అక్రమంగా ఆయుధాలు పెద్దఎత్తున తరలివస్తుండటంతో ఆప్ ప్రభుత్వం అప్రమత్తమైంది. దీనికి తోడు ఖలిస్థాన్ ఉగ్రవాదం వేళ్లూనుకుంటుండటంతో మాన్ సర్కారు గన్ లైసన్స్‌లపై తాజా నిర్ణయాలు తీసుకుంది. హింసను అదుపుచేసేందుకు తీసుకుంటోన్న చర్యల్లో భాగంగా కొత్త లైసన్స్‌లను జారీ చేయరాదని నిర్ణయించింది.

Updated Date - 2022-11-13T20:07:36+05:30 IST