PM Narendra Modi: ఈశాన్యంలో అశాంతి, అవినీతికి రెడ్‌కార్డ్...
ABN , First Publish Date - 2022-12-18T15:54:26+05:30 IST
ఈశాన్య భారతదేశంలో అభివృద్ధి లేమి, అవినీతి, అశాంతి, రాజకీయ వివక్ష వంటి అన్ని అవరోధాలకు బీజేపీ ప్రభుత్వం రెడ్‌కార్డ్ చూపించిందని
షిల్లాంగ్: ఈశాన్య భారతదేశం(Northeast India)లో అభివృద్ధి లేమి, అవినీతి, అశాంతి, రాజకీయ వివక్ష వంటి అన్ని అవరోధాలకు బీజేపీ ప్రభుత్వం రెడ్‌కార్డ్ (Red Card) చూపించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. షిల్లాంగ్ (Shillong)లోని ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో ఆదివారంనాడు జరిగిన నార్త్ ఈస్ట్రన్ కౌన్సిల్ (NEC) గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్‌లో ప్రధానమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాపరిభాషలో మాట్లాడుతూ, పుట్‌బాల్ ఆటలో క్రీడాస్ఫూర్తికి భిన్నంగా ఎవరైనా ఆడితే అతనికి 'రెడ్‌కార్డ్' (Red card) చూపించి, బయటకు పంపేస్తారని, అదే విధంగా ఈశాన్య రాష్ట్రాల్లో గత 8 ఏళ్లలో అశాంతి, అభివృద్ధి లేమి, అవినీతి వంటి అవరోధాలకు రెడ్ కార్డ్ ఇచ్చి చెల్లుచీటీ చెప్పామని అన్నారు. ఈశాన్యంలో క్రీడల అభివృద్ధిపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందని, దేశంలోనే తొలి జాతీయ క్రీడా యూనివర్శిటీ, 90 ప్రధాన క్రీడా ప్రాజెక్టులు ఈ ప్రాంతంలో రాబోతున్నాయని చెప్పారు.
వరల్డ్ కప్ ఫైనల్ రోజే..
ఖతర్‌లో ఫిఫా ఫుట్‌బాల్ వరల్డ్ కప్ ఫైనల్ జరుగుతున్న రోజే షిల్లాంగ్‌లోని ఫుట్‌బాల్ మైదానంలో క్రీడాభిమానుల మధ్య షిల్లాంగ్‌లో తాను ఉండటం యాదృచ్ఛికమని, అక్కడ ఫుట్‌బాల్ కాంపటీషన్ జరుగుతుంటే, ఇక్కడ మనం అభివృద్ధి కాంపటీషన్‌లో ఉన్నామని అన్నారు. ఖతార్‌లో పాల్గొంటున్న విదేశీ క్రీడాబృందాలకు ఇక్కడ మనం ఛీర్స్ చెబుతున్నామని, అలాంటి గ్లోబల్ క్రీడా ఈవెంట్స్‌కు భారత్ ఆతిథ్యమిచ్చి, త్రివర్ణ పతాకం రెపరెపల మధ్య మన సొంత టీమ్‌కు ఛీర్స్ చెప్పే రోజు ఎంతో దూరం లేదని తాను చెప్పదలచుకున్నానని అన్నారు.
ఈశాన్య రాష్ట్రాలకు వాయుమార్గ అనుసంధానం పెంచామని, 2014 ముందు కేవలం ఈశాన్యంలో వారంలో 900 విమానాలు మాత్రమే అందుబాటులో ఉండేవని, ఇప్పుడు 1,900 విమానాలు తిరుగుతున్నాయని ప్రధాని అన్నారు. మెరుగైన ఎయిర్ కనెక్టివిటీ వల్ల క్రిషి ఉడాన్ యోజన ద్వారా రైతులకు మేలు జరుగుతోందన్నారు. జాతీయ, అంతర్జాతీయ మార్గాల్లో తమ వ్యవసాయ ఉత్పత్తులను రవాణా చేసేందుకు 2020లో ప్రారంభించిన కృషి ఉడాన్ యోజన పథకం ఎంతగానో ఉపకరిస్తోందన్నారు.
టెలికాం కనెక్టివిటీ...
ఈశాన్యంలో ఆరు వేల మొబైల్ టవర్లు ఏర్పాటు చేశామని, ఇందుకోసం ప్రభుత్వం రూ.5,000 వ్యయం చేసిందని ప్రధాని చెప్పారు. 150 ఏకలవ్వ స్కూల్ మోడల్స్ రాబోతున్నాయని, ఈశాన్య రాష్ట్రాల్లో పర్బత్ మేళ స్కీమ్, పీఎం డివైన్ ప్రాజెక్టు వంటి పథకాలపై దృష్టి సారించనున్నామని అన్నారు. కేంద్రంలోని గత ప్రభుత్వాలు విభజన ఈశాన్య విధానాన్ని అవలంభచగా, తాము డివైన్ అప్రోచ్‌తో వెళ్తున్నామని చెప్పారు. ఈశాన్య ప్రాంతాల్లో విభేదాలను పరిష్కరించి శాంతి నెలకొనే దిశగా తాము కృషి సాగిస్తున్నామని తెలిపారు. ఈశాన్యం చివరి 'మైలు' కాదని, 'మెయిన్ పిల్లర్' అని అన్నారు. సరిహద్దు ప్రాంతాలను అభివృద్ధి చేస్తే శత్రుదేశానికి ప్రయోజనం చేకూరుతుందని గత ప్రభుత్వం ఆలోచించేదని, తాము మాత్రం సరిహద్దు ప్రాంతాలను కంచుకోటల్లా మార్చేందుకు పట్టుదలతో ఉన్నామని చెప్పారు. సరిహద్దు గ్రామాలకు మెరుగైన రోడ్ల అనుసంధానం కోసం పనిచేస్తున్నామని తెలిపారు.
వాటికన్ సిటీ జర్నీపై...
గత ఏడాది వాటికల్ సిటీ వెళ్లిన విషయాన్ని ప్రధాని ప్రస్తావిస్తూ, గత ఏడాది తాను వాటికన్ సిటీ వెళ్లి పోప్‌ను కలిసానని, ఆయనను ఇండియాకు ఆహ్వానించానని చెప్పారు. ఈ సమావేశం ప్రభావం తనపై ఎంతో ఉందని చెప్పారు. శాంతి, అభివృద్ధి రాజకీయాల వైపు తమ ప్రభుత్వం ప్రయాణం సాగిస్తోందని, ఇందువల్ల గిరిజన కమ్యూనిటీకి ఎక్కువ ప్రయోజనాలు చేకూరుతాయని అన్నారు.
కాగా, దీనికి ముందు నార్త్ ఈస్ట్ కౌన్సిల్ (ఎన్ఈసీ) గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్‌లో భాగంగా షిల్లాంగ్‌లో జరిగిన కార్యక్రమంలో రూ.2,450కోట్లు విలువ చేసే పలు ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి అమిత్‌షా, 8 ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు పాల్గొన్నారు.