MP Sanjay Raut : మోదీ, షాలను కలుస్తా

ABN , First Publish Date - 2022-11-11T03:51:34+05:30 IST

ఎప్పుడూ బీజేపీ నేతలపై విరుచుకుపడే శివసేన ఎంపీ సంజయ్‌రౌత్‌ స్వరంలో మార్పు వచ్చింది! దాదాపు మూడు నెలలుగా జైల్లో ఉన్న ఆయన బెయిలుపై విడుదలైన మర్నాడే బీజేపీ నేత,

MP Sanjay Raut : మోదీ, షాలను కలుస్తా

బెయిల్‌పై విడుదలైన శివసేన ఎంపీ స్వరంలో మార్పు

ఫడణవీస్‌వి మంచి నిర్ణయాలు అంటూ కితాబు

దర్యాప్తు సంస్థల దుర్వినియోగం: ఉద్ధవ్‌

టీఆర్‌ఎస్‌, టీఎంసీ, ఆప్‌లను టార్గెట్‌ చేస్తోంది

మోదీ సర్కారుపై మాజీ సీఎం ధ్వజం

ముంబై, నవంబరు 10: ఎప్పుడూ బీజేపీ నేతలపై విరుచుకుపడే శివసేన ఎంపీ సంజయ్‌రౌత్‌ స్వరంలో మార్పు వచ్చింది! దాదాపు మూడు నెలలుగా జైల్లో ఉన్న ఆయన బెయిలుపై విడుదలైన మర్నాడే బీజేపీ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీ్‌సపై ప్రశంసల జల్లుకురిపించారు. ఆయన చాలా మంచి నిర్ణయాలు తీసుకున్నారని కొనియాడారు. గడిచిన 100 రోజులుగా తాను ఎదుర్కొన్న సమస్యల గురించి తెలిపేందుకు త్వరలోనే ఫడణవీ్‌సను, ప్రధాని మోదీ, కేంద్రహోం మంత్రి అమిత్‌ షాను కలుసుకుంటానని ప్రకటించారు. పాత్రా చాల్‌ పునరుద్ధరణ ప్రాజెక్టులో అవినీతికి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఆగస్టు 1న రౌత్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచీ ముంబైలోని ఆర్థర్‌రోడ్‌ జైల్లోనే ఉండి.. బుధవారం విడుదలైన రౌత్‌ గురువారం మీడియాతో మాట్లాడారు.

‘‘డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ తీసుకున్న నిర్ణయాలను నేను స్వాగతిస్తాను. ఆయన్ను త్వరలోనే కలుస్తాను’’ అన్నారు. రాజకీయ నాయకుల మధ్య ఉన్న వైరాలు పోవాలన్న ఫడణవీస్‌ వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తానని స్పష్టం చేశారు. శివసేన రెబెల్‌, ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండేను కూడా కలుస్తారా? అని మీడియా ప్రశ్నించగా.. చాలావరకూ మంచి నిర్ణయాలు తీసుకున్నది, వాటిని ప్రకటించింది ఫడణవీస్‌ అని, ఆయనతో తనకు పని కూడా ఉంది కాబట్టి ఆయన్నే కలుస్తానని సమాధానమిచ్చారు. ‘‘నా అరెస్టే రాజకీయపరమైనది. ఈ తరహా ప్రతీకార రాజకీయాలను దేశం మునుపెన్నడూ చూడలేదు. సావర్కర్‌, తిలక్‌లాగా నేను ఏకాంతవాస శిక్షను అనుభవించాను. అక్కడ నా సమయాన్ని మంచి ప్రయోజనాలకు ఉపయోగించుకున్నాను. ఈ సమయంలో నా పార్టీ, నేను, నా కుటుంబం ఎన్నింటినో భరించాం. మేం చాలా బాధలుపడ్డాం. జీవితంలో, రాజకీయాల్లో ఇలాంటివి జరుగుతుంటాయి’’ అని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీని, అమిత్‌షాను కలుస్తానన్న ఆయన.. తాను వారిని కలుస్తానంటే దాని అర్థం తన వైఖరిలో మార్పు వచ్చిందని కాదని పేర్కొన్నారు.

కాగా.. గురువారం ఆయన శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రేను, ఎన్సీపీ చీఫ్‌ శరద్‌పవార్‌ను కలుసుకున్నారు. ఉద్ధవ్‌ ఠాక్రే, పార్టీ తనకు, తన కుటుంబానికి అండగా ఉంటాయన్న నమ్మకం తనకుందని.. పార్టీ కోసం మరో 10 సార్లు జైలుకు వెళ్లడానికైనా సిద్ధమని వ్యాఖ్యానించారు. రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్రను తాను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఇక, రౌత్‌ తనను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఉద్ధవ్‌ ఠాక్రే.. దర్యాప్తు సంస్థలు కేంద్ర ప్రభుత్వ పెంపుడు జంతువుల్లా వ్యవహరిస్తున్నాయని ధ్వజమెత్తారు. ఆయన్ను మరోసారి తప్పుడు కేసులో ఇరికించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని.. ఆప్‌, టీఆర్‌ఎస్‌, జేఎంఎం, టీఎంసీ వంటి పార్టీలను టార్గెట్‌ చేస్తున్నారని అన్నారు. ఈ పార్టీలన్నీ ఏకమైతే ఏం జరుగుతుందో కేంద్ర పాలకులకు తెలియదని నిప్పులు చెరిగారు. ‘‘రోజులన్నీ ఒకలా ఉండవు, పరిస్థితులు మారుతాయి’’ అని హెచ్చరించారు.

Updated Date - 2022-11-11T03:51:35+05:30 IST