Rajiv Gandhi assassination case : దోషుల విడుదలపై సుప్రీం సంచలన ఆదేశాలు
ABN , First Publish Date - 2022-11-11T13:54:03+05:30 IST
మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) హత్య కేసులో అందరు దోషులను
న్యూఢిల్లీ : మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) హత్య కేసులో అందరు దోషులను విడుదల చేయాలని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. 2022 మే 18న ఏజీ పెరరివలన్‌ను విడుదల చేస్తూ తీర్పు చెప్పడానికి అనుసరించిన విధానం మిగిలిన దోషుల విషయంలో కూడా వెల్లడైందని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ బీవీ నాగరత్న ధర్మాసనం ఈ ఆదేశాలిచ్చింది. ఈ కేసులో ఆరుగురు దోషులు జీవిత ఖైదును అనుభవిస్తున్న సంగతి తెలిసిందే.
సుప్రీంకోర్టు సంచలన తీర్పుతో రాజీవ్ గాంధీ హత్య కేసు(rajiv gandhi assassination case)లో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఎస్ నళిని, జయకుమార్, ఆర్‌పీ రవిచంద్రన్, రాబర్ట్ పయస్, సుధేంద్ర రాజా, శ్రీధరన్‌లకు జైలు జీవితం నుంచి విముక్తి లభించింది. వీరంతా జైలులో మంచి నడవడికతో ప్రవర్తించారని, అంతేకాకుండా వేర్వేరు డిగ్రీలు సాధించారని అత్యున్నత న్యాయస్థానం గుర్తించింది.
ఈ దోషులను జైలు నుంచి విడుదల చేయాలని 2018 సెప్టెంబరు 9న తమిళనాడు రాష్ట్ర మంత్రివర్గం సిఫారసు చేసిందని, తమకు శిక్ష తగ్గించాలని ఆ రాష్ట్ర గవర్నర్‌కు దోషులు విజ్ఞప్తి చేశారని సుప్రీంకోర్టు గుర్తించింది. మంత్రివర్గ అభిప్రాయానికి గవర్నర్ కట్టుబడి ఉండవలసి ఉంటుందని పేర్కొంది.
నళిని ప్రస్తుతం పెరోల్‌పై ఉన్నారు. ఆమె పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు తోసిపుచ్చింది. అనంతరం ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 30 సంవత్సరాలకు పైగా జైలు శిక్ష అనుభవించిన ఏజీ పెరరివలన్‌ను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో నళిని ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.