Tiger Is Back: రౌత్‌కు బెయిలుపై ట్విటర్‌లో మెమెల వెల్లువ
ABN , First Publish Date - 2022-11-09T19:15:34+05:30 IST
ముంబై: పత్రాచాల్ ఏరియా పునరాభివృద్ధికి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో సుమారు మూడున్నర నెలల పాటు జైలులో ఉన్న శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) ఎంపీ సంజయ్ రౌత్‌కు ఎట్టకేలకు పీఎంఎల్ఏ కోర్టు ..
ముంబై: పత్రాచాల్ ఏరియా పునరాభివృద్ధికి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో సుమారు మూడున్నర నెలల పాటు జైలులో ఉన్న శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) ఎంపీ సంజయ్ రౌత్‌కు ఎట్టకేలకు పీఎంఎల్ఏ కోర్టు బెయిలు ఇవ్వడంతో థాకరే వర్గంలో పండుగ వాతావరణం నెలకొంది. రాజకీయ నేతలతో పాటు శివసైనికుల నుంచి స్పందనలు వెల్లువెత్తుతున్నాయి. శివసేన నేత భాస్కర్ జాధవ్ (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) నేత మీడియా ముందు తన సంతోషం పంచుకున్నారు. ''ఇవాళ మా కళ్లల్లో ఆనందబాష్పాలు కనిపిస్తు్న్నాయి. మా నేత సంజయ్ రౌత్ బెయిలుపై బయటకు వస్తుండటం చాలా సంతోషంగా ఉంది'' అని అన్నారు.
సంజయ్ రౌత్ 102 రోజుల తర్వాత బెయిలుపై వస్తుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా శివసైనికుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. స్వీట్లు పంచుకుంటూ, బాణసంచా కాలుస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. ఇంటివరూ ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్‌సీపీ నేతలు, కాంగ్రెస్ నేతలు సైతం రౌత్‌కు స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు. సంజయ్ రౌత్ బెయిలుతో బయటకు రావడాన్ని స్వాగతిస్తూ ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి. 'టైగర్ ఈజ్ బ్యాక్' అంటూ నినాదాలు, మెమెలు వచ్చిపడుతున్నాయి.
పోరాటం కొనసాగిస్తా...
కోర్టు బెయిలు మంజూరు చేయగానే సంజయ్ రౌత్ కోర్టు ఆవరణలో తొలిసారి స్పందించారు. చాలా సంతోషంగా ఉందని అన్నారు. తనకు బెయిల్ మంజూరు చేసిన కోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు. న్యాయదేవతపై తనకు నమ్మకం ఉందన్నారు. తన పోరాటం తిరిగి సాగిస్తానని చెప్పారు.