Twitter : ఎలన్ మస్క్‌ను భరించలేక రాజీనామా చేసేస్తున్న ఉద్యోగులు

ABN , First Publish Date - 2022-11-18T11:51:43+05:30 IST

సోషల్ నెట్‌వర్కింగ్ మాధ్యమం నూతన యజమాని ఎలన్ మస్క్ (Elon Musk) జారీ చేసిన హెచ్చరికతో ఆ కంపెనీ

Twitter : ఎలన్ మస్క్‌ను భరించలేక రాజీనామా చేసేస్తున్న ఉద్యోగులు
Twitter

న్యూఢిల్లీ : సోషల్ నెట్‌వర్కింగ్ మాధ్యమం నూతన యజమాని ఎలన్ మస్క్ (Elon Musk) జారీ చేసిన హెచ్చరికతో ఆ కంపెనీ ఉద్యోగులు రాజీనామాల బాట పడుతున్నారు. అత్యధిక శ్రద్ధతో, నిబద్ధతతో సుదీర్ఘ సమయం పని చేయాలని, లేదంటే, బయటికి పోవాలని ఆయన హెచ్చరించడంతో గురువారం వందలాది మంది ఉద్యోగులు రాజీనామాలు సమర్పించారు.

ట్విటర్‌ (Twitter)ను విజయవంతం చేయడానికి ఉద్యోగులు మితిమీరిన హార్డ్‌కోర్‌గా పని చేయాలని మస్క్ ఇటీవల చెప్పారు. బ్రేక్‌త్రూ ట్విటర్ 2.0ను నిర్మించడానికి కలిసి వస్తారా? లేదా? అనే అంశాన్ని నిర్ణయించుకోవడానికి 36 గంటల గడువు ఇచ్చారు. కలిసి రావడం ఇష్టం లేనివారు మూడు నెలల జీతంతో ఇంటికి పోవాలని చెప్పారు.

దీంతో చాలా మంది ఉద్యోగులు మూడు నెలల జీతంతో ఇంటికి పోవడానికే మొగ్గు చూపుతున్నారు. అమెరికన్ మీడియా కథనాల ప్రకారం వందలాది మంది ఉద్యోగులు రాజీనామా చేశారు. మరికొందరు కూడా ఇదే బాట పట్టబోతున్నారు. వందలాది మంది ఉద్యోగులు గురువారం ట్విటర్ స్లాక్ (Slack)లో శాల్యూట్ ఇమోజీలు, ఫేర్‌వెల్ మెసేజ్‌లు పెట్టారని తెలుస్తోంది. మస్క్ జారీ చేసిన అల్టిమేటమ్‌ను తోసిపుచ్చుతున్నామని చెప్పారని తెలుస్తోంది. ఓ ఉద్యోగి అమెరికన్ మీడియాతో మాట్లాడుతూ, దాదాపు 360 మంది ఉద్యోగులు వాలంటరీ లేఆఫ్ పేరుతో ఓ చానల్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

సోమవారం వరకు కార్యాలయాలను మూసేస్తామని, బ్యాడ్జ్ యాక్సెస్‌ను కట్ చేస్తామని ట్విటర్ తన ఉద్యోగులకు తెలిపిందని విశ్వసనీయ వర్గాలు అమెరికన్ మీడియాకు చెప్పాయి. గురువారం సాయంత్రం ట్విటర్ సెక్యూరిటీ సిబ్బంది ఆ కంపెనీలోని ఉద్యోగులను బయటకు పంపేస్తున్నారని తెలిపాయి.

ట్విటర్ యాజమాన్యాన్ని చేపట్టిన వెంటనే ఎలన్ మస్క్ సగం మంది ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. మొత్తం 7,500 మంది ఉద్యోగుల్లో సగం మంది బాధితులుగా మిగిలారు. గురువారం సాయంత్రానికి ఈ కంపెనీలో దాదాపు 2,900 మంది మాత్రమే మిగిలినట్లు తెలుస్తోంది.

Updated Date - 2022-11-18T11:51:49+05:30 IST