Covid-19 : ఆక్సిజన్ నిల్వలపై రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం

ABN , First Publish Date - 2022-12-24T16:51:03+05:30 IST

చైనా తదితర దేశాల్లో కోవిడ్-19 మహమ్మారి మరోసారి సవాల్ విసురుతుండటంతో కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలను

Covid-19 : ఆక్సిజన్ నిల్వలపై రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం
Medical Oxygen

న్యూఢిల్లీ : చైనా తదితర దేశాల్లో కోవిడ్-19 మహమ్మారి మరోసారి సవాల్ విసురుతుండటంతో కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలను ముమ్మరం చేసింది. ఇన్ఫెక్షన్లు పెరగకుండా నిరోధించేందుకు నిరంతర నిఘా పెట్టింది. అత్యవసర పరిస్థితుల్లో దీటుగా వ్యవహరించేందుకు సన్నాహాలు చేస్తోంది. మెడికల్ ఆక్సిజన్‌ను అందుబాటులో ఉంచుకోవాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది. కోవిడ్ నిరోధక మార్గదర్శకాలను ప్రతి ఒక్కరూ పాటించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi), కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ప్రజలను కోరారు. క్రిస్టమస్, నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, టీకాలు వేయించుకోవాలని కోరారు.

కోవిడ్-19 (Covid-19) వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం సూచనలను జారీ చేసింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల్లో 2 శాతం మంది నుంచి రాండమ్ శాంప్లింగ్ తీసుకుని పరీక్షలు చేయాలని తెలిపింది. ఈ నిబంధన శనివారం నుంచి అమల్లోకి వచ్చింది. ఆరోగ్య కేంద్రాలు కోవిడ్-19 విషయంలో ఏ విధంగా సన్నద్ధంగా ఉన్నాయో తెలుసుకునేందుకు డిసెంబరు 27న దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ నిర్వహిస్తారు.

చైనాలో తాజా పరిస్థితికి కారణం ఒమిక్రాన్ బీఏ.5 సబ్‌లైనేజ్ బీఎఫ్.7 అని తెలుస్తోంది. అయితే నిపుణులు చెప్తున్నదాని ప్రకారం మన దేశంలో కోవిడ్ పరిస్థితి మరమ్మతు చేయడానికి వీలు కానంతటి స్థాయిలో ఉండబోదని తెలుస్తోంది. మన దేశంలో బీఎఫ్.7 కేసులు నాలుగు నమోదయ్యాయి. అయితే ఇవి గతానికి చెందినవి. వీరంతా కోలుకున్నారు.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించిన వివరాల ప్రకారం, మన దేశంలో రోజువారీ కోవిడ్-19 కేసుల సంఖ్య ప్రతి వారం తగ్గుతోంది. అయితే శనివారం ఉదయం 8 గంటలకు విడుదల చేసిన బులెటిన్‌లో తెలిపిన వివరాల ప్రకారం రోజువారీ కేసుల సంఖ్య 201కి పెరిగింది. యాక్టివ్ కేసుల సంఖ్య ప్రస్తుతం 3,397.

కోవిడ్-19 మహమ్మారి మేనేజ్‌మెంట్ కోసం మెడికల్ ఆక్సిజన్‌ (Medical Oxygen) క్రమబద్ధంగా, నిరంతరాయంగా సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం లేఖ రాసింది.

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ (Mansukh Mandaviya) శనివారం ఓ ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, చైనా, జపాన్, దక్షిణ కొరియా, హాంగ్ కాంగ్, థాయ్‌లాండ్ దేశాల నుంచి మన దేశానికి వచ్చేవారికి తప్పనిసరిగా ఆర్‌టీ-పీసీఆర్ టెస్ట్ చేయాలి. ఈ పరీక్షలో కోవిడ్ లక్షణాలు కనిపించినవారిని వెంటనే క్వారంటైన్‌కు పంపిస్తారు. మన దేశానికి వచ్చే విదేశీ ప్రయాణికులు తప్పనిసరిగా కోవిడ్ నెగెటివ్ టెస్ట్ రిపోర్టును కలిగియుండాలని ఆదేశించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోందని జరుగుతున్న ప్రచారం బూటకమని, ప్రజలను తప్పుదోవ పట్టించే వదంతి అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం స్పష్టం చేసింది.

Updated Date - 2022-12-24T17:02:31+05:30 IST