Bharat Jodo Yatra : రాహుల్ గాంధీకి కేంద్రం హెచ్చరిక

ABN , First Publish Date - 2022-12-21T11:27:45+05:30 IST

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra)లో పాల్గొనేవారంతా

Bharat Jodo Yatra : రాహుల్ గాంధీకి కేంద్రం హెచ్చరిక
Bharat Jodo Yatra, Rajastan

న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra)లో పాల్గొనేవారంతా కచ్చితంగా కోవిడ్-19 మహమ్మారి నిరోధక మార్గదర్శకాలను పాటించాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఈ యాత్రలో కోవిడ్ మార్గదర్శకాలు అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీతోపాటు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot)కు కూడా లేఖలు రాసింది. ఒకవేళ ఈ నిబంధనలను పాటించడం సాధ్యం కాదని అనుకుంటే, ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని యాత్రను నిలిపేయాలని తెలిపింది.

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ (Mansukh Mandaviya) రాసిన లేఖలలో ఈ హెచ్చరిక చేశారు. ఈ యాత్రలో పాల్గొనేవారంతా కచ్చితంగా మాస్క్‌లను ధరించాలని, శానిటైజర్లను ఉపయోగించాలని ఈ లేఖలలో పేర్కొన్నారు. కోవిడ్ టీకాలను తీసుకున్నవారు మాత్రమే పాల్గొనాలని తెలిపారు. చైనాలో తాజాగా కోవిడ్ మహమ్మారి ప్రభంజనం రావడంతో ఈ హెచ్చరిక చేశారు. ఇటువంటి పరిస్థితులే జపాన్, దక్షిణ కొరియా, బ్రెజిల్, అమెరికాలలో కూడా కనిపిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. పాజిటివ్ కేసుల హోల్ జీనోమ్ సీక్వెన్సింగ్ (whole genome sequencing) చేయాలని కోరింది. టెస్ట్-ట్రాక్-ట్రీట్-వ్యాక్సినేషన్-కోవిడ్‌ పట్ల వ్యవహరించవలసిన తీరులో ప్రవర్తించడం అనే ఐదు అంచెల విధానాన్ని గతంలో మాదిరిగానే అనుసరిస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

ఇదిలావుండగా, కేంద్రం పంపిన లేఖపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆ పార్టీ నేత అధిర్ రంజన్ చౌదరి స్పందిస్తూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) గుజరాత్ ఎన్నికల ప్రచార సభల్లో కోవిడ్ నిబంధనలను పాటించారా? అని నిలదీశారు. రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్ర మన్‌సుఖ్ మాండవీయకు ఇష్టం లేనట్లుందని, అయితే ప్రజలు మాత్రం ఇష్టపడుతున్నారని, రాహుల్‌తో కలిసి నడుస్తున్నారని తెలిపారు. ప్రజల దృష్టిని మరల్చేందుకు మాండవీయను నియమించారని ఆరోపించారు.

తమిళనాడులో ప్రారంభమైన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం రాజస్థాన్‌లో జరుగుతోంది.

Updated Date - 2022-12-21T11:27:50+05:30 IST