Viral Video: చైనా సైనికులను చితగ్గొట్టిన భారత జవాన్లు
ABN , First Publish Date - 2022-12-14T22:00:35+05:30 IST
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా తాజా దురాక్రమణకు సంబంధించినవిగా ప్రచారంలో ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా(China) తాజా దురాక్రమణకు సంబంధించినవిగా ప్రచారంలో ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డిసెంబరు 9న తెల్లవారుజామున తవాంగ్(Tawang) సెక్టారు యాంగ్‌ట్సె ప్రాంతంలో 3-4 వందల మందికి పైగా చైనా సైనికులు మేకులు కొట్టిన, ఇనుప ముళ్ల కంచెలు చుట్టిన కర్రలను, టీజర్ గన్‌లను తీసుకొని భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చారు. రెండున్నరేళ్ల క్రితం లద్దాఖ్‌లోని గల్వాన్‌లో దాడి చేసిన తరహాలోనే ఇక్కడా సంప్రదాయేతర ఆయుధాలతో దాడికి దిగారు. భారత సైన్యం(Indian Army) ఏర్పాటు చేసిన పోస్టును తొలగించేందుకు ప్రయత్నించారు. అక్కడ పెట్రోలింగ్ చేస్తున్న భారత సైన్యాన్ని వెళ్లిపోవాలని హెచ్చరించారు. కొద్ది సంఖ్యలో ఉన్నా భారత సైన్యం దీటుగా ఎదుర్కొంది. స్వల్ప వ్యవధిలో అదనపు బలగాలను తెప్పించుకొని, ఎదురు దాడికి దిగి, అరగంటలో వాస్తవాధీన రేఖ ఆవలకు తరిమికొట్టింది. ఈ క్రమంలో భారత సైన్యంలో దాదాపు 15 మందికి గాయాలయ్యాయి. ఇద్దరికి ఎముకలు విరిగాయి. చైనా వైపు భారత్ కన్నా ఎక్కువ మందే గాయపడ్డారు ఇరువైపులా ఎవరూ మరణించలేదు.
సముద్ర మట్టానికి 17 వేల అడుగుల ఎత్తున ఈ ఘటన జరిగింది. ఈ ప్రాంతమంతా ప్రస్తుతం మంచుతో నిండిపోయి ఉంది. ఘటన తర్వాత సంఘటన స్థలం నుంచి ఇరుపక్షాల సైన్యాలు వెనక్కి తగ్గాయి. క్షతగాత్రులను చికిత్స కోసం గౌహతి ఆసుపత్రికి తరలించారు. 2001 అక్టోబరులోనూ ఇదేచోట ఇలాంటి చొరబాటు ప్రయత్నమే జరగడంతో తిప్పికొట్టారు. సోషల్ మీడియా(Social Media)లో ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోలు గతంలో తీసినవని కూడా ప్రచారం జరుగుతోంది.