Sanjay Raut: చైనా తరహాలో కర్ణాటకలో అడుగుపెడతాం

ABN , First Publish Date - 2022-12-21T14:09:35+05:30 IST

మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దుల విషయంలో తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో శివసేన నేత సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు...

Sanjay Raut: చైనా తరహాలో కర్ణాటకలో అడుగుపెడతాం

ముంబై: మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దుల విషయంలో తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో శివసేన (Uddhav Balasaheb Tackeray) నేత సంజయ్ రౌత్ (Sanjay Raut) సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలోకి చైనా (China) అడుగుపెట్టిన రీతిలో తాము కూడా కర్ణాటకలోకి ప్రవేశిస్తామంటూ తాజా వివాదానికి తెరలేపారు. ఈ అంశంపై తమకు ఎలాంటి అనుమతి అవసరం లేదని చెప్పారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని తాము అనుకుంటున్నప్పటికీ కర్ణాటక ముఖ్యమంత్రి అగ్గిరాజేస్తున్నారని ఆరోపించారు. మహారాష్ట్రలో బలహీన ప్రభుత్వం ఉండటం వల్లే దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతోందని అన్నారు. దశాబ్దానికి పైగా ఇరు రాష్ట్రాల మధ్య నలుగుతున్న సరిహద్దుల వివాదం ముదిరి సుప్రీంకోర్టుకు సైతం చేరిన నేపథ్యంలో రౌత్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

సరహద్దుల అంశంపై ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటోంది. మహారాష్ట్ర శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లోనూ విపక్షాలు ఈ అంశాన్ని లేవనెత్తాయి. విపక్ష నేత అజిత్ పవార్ ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ, మహారాష్ట్రకు చెందిన లోక్‌సభ సభ్యుడిని బెల్గాంలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారని, అమిత్‌షాతో జరిగిన సమావేశంలో బెల్గాం వెళ్లకుండా ఎవరినీ ఆపరాదనే నిర్ణయం తీసుకున్నప్పటికీ, అక్కడి కలెక్టర్ ఎందుకు ఇలాంటి (ఎంపీని అడ్డుకోవడం) నిర్ణయం తీసుకున్నారని నిలదీశారు. దీనికి ముఖ్యమంత్రి షిండే సమాధానమిస్తూ, రెండు రాష్ట్రాల సరిహద్దు సమస్య విషయంలో తొలిసారి ఈదేశ హోం మంత్రి (అమిత్‌షా) మధ్యవర్తిత్వం చేస్తున్నారని చెప్పారు. ఆయన సమస్యను చాలా సీరియస్‌గా తీసుకున్నారని, సరిహద్దు విషయంలో ఎలాంటి రాజకీయాలకు తావు లేకుండా సరిహద్దు నివాసులను కలుపుకొని ఏకతాటిపై మనమంతా ఉండాలని అన్నారు. కాగా, ప్రభుత్వం ఈ అంశాన్ని పరిశీలిస్తోందని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ వివరణ ఇచ్చారు.

Updated Date - 2022-12-21T15:44:00+05:30 IST