Bharat Jodo Yatra: క్విట్ ఇండియా నాటికి ఆమెకు 12 ఏళ్లు, భారత జోడో నాటికి 93
ABN , First Publish Date - 2022-11-18T15:28:17+05:30 IST
అకోలా: రాహుల్ గాంధీ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో అపురూప ఘట్టం చోటు చేసుకుంది. బ్రిటిష్ ఇండియా పాలనకు వ్యతిరేకంగా..
అకోలా: రాహుల్ గాంధీ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra)లో అపురూప ఘట్టం చోటు చేసుకుంది. బ్రిటిష్ ఇండియా పాలనకు వ్యతిరేకంగా ఉవ్వెత్తున ఎగసిపడిన 1942 క్విట్ ఇండియా (Quit india) ఉద్యమంలో పాల్గొన్న లీలాభాయ్ చితలే (Leelabai Chitale) మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో సాగిన భారత్ జోడో యాత్రలో పాలుపంచుకున్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న సమయంలో చితలే వయస్సు కేవలం 12 ఏళ్లు. భారత్ జోడో యాత్రలో పాల్గొనే సమయానికి ఆమె 93వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ శుక్రవారం ఒక వీడియో మెసేజ్‌లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. అకోలా జిల్లా బాలాపూర్ తహసిల్‌లోని వడేగావ్ వద్ద భారత్ జోడా యాత్రలో లీలాభాయ్ చితలే పాల్గొన్నట్టు తెలిపారు. రాజ్యాంగ పరిరక్షణ అంశంపై భారత్ జోడో యాత్ర దృష్టి పెట్టాలని చితలే కోరినట్టు ఆయన చెప్పారు.
వీడియో సందేశంలో చితలే తన చిన్ననాటి అనుభవాలను పంచుకున్నారు. ''1942 ఆగస్టు 9వ తేదీ నాటికి నా వయస్సు 12 ఏళ్లు. 'విజయమో వీర స్వర్గమో' అంటూ మహాత్మాగాంధీ ఇచ్చిన పిలుపుతో ఒక కాలేజీ సమీపంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా నేను, నా స్నేహితులు నినాదాలు చేస్తుండగా పోలీసులు మమ్మల్ని అదుపులోకి తీసుకున్నారు. అప్పుడు మేమంతా 12 ఏళ్ల ప్రాయం వాళ్లే కావడంతో సాయంత్రానికల్లా విడిచిపెట్టారు. కానీ, నా తండ్రి, సోదరుడు మూడున్నరేళ్ల పాటు జైలులో ఉన్నారు. ఇవాళ చెబుతున్నట్టు కాకుండా ఎంతో కష్టంతోగానీ స్వాతంత్ర్యం మనకు సిద్ధించలేదు. స్వాతంత్ర్య పోరాటంలో సమాజంలోని అన్ని వర్గాల వారు మతాలకు అతీతంగా పోరాడారు. రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు ఇవాళ ఈ ప్రజలు (భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్నవారు) ప్రయత్నిస్తున్నారు'' అని చితలే ఆ వీడియో మెసేజ్‌లో తెలిపారు.