NRI: తీరనున్న దుబాయి ప్రవాసీయుల చిరకాల వాంఛ .. సోమవారం నుంచి..
ABN , First Publish Date - 2022-10-30T19:35:38+05:30 IST
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైత్, ఒమాన్ దేశాలలో ఉంటున్న కోస్తాంధ్ర ప్రవాసీయుల చిరకాల వాంఛ అయిన విజయవాడ విమాన సర్వీసు సోమవారం నుంచి ప్రారంభం కానుంది.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: గల్ఫ్ దేశాలలో ఉంటున్న ప్రవాసాంధ్రుల చిరకాల వాంఛ త్వరలో తీరనుంది. ఇప్పటి వరకు..ప్రయాణికులు విజయవాడ, విశాఖల నుండి హైదరాబాద్ వరకు వచ్చి అక్కడి నుండి దుబాయి విమానం ఎక్కాల్సి వచ్చేది. ఇంటర్నేషనల్ లగేజి, వెయిటింగ్ టైం వగైరా అదనం, ఇక నుండి ఈ సమస్యలన్నీ తీరుతాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైత్, ఒమాన్ దేశాలలో ఉంటున్న కోస్తాంధ్ర ప్రవాసీయుల చిరకాల వాంఛ అయిన విజయవాడ విమాన సర్వీసు సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఒమాన్ నుండి హైదరాబాద్‌కు రద్దు చేసిన విమానాన్ని పునరుద్ధరించి హైదరాబాద్(Hyderabad) మీదుగా విజయవాడకు(Vijayawada) నడుపనున్నారు. అదే విధంగా మరో విమానాన్ని కూడా విజయవాడ మీదుగా కేరళలోని కన్నూరుకు(Kannur) అనుసంధానించారు.
దుబాయి తోపాటూ ఇతర ఏమిరేట్లలో పని చేస్తున్న ప్రవాసాంధ్రుల సౌకర్యార్థం ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్(Air Indian Express) విమాన సర్వీసు (ఐఎక్స్ 976) ప్రతి సోమ, శనివారాలు ఉదయం 11 గంటల నుండి షార్జా విమానశ్రాయం నుండి బయలుదేరి భారతీయ కాలమానం 4:25కు విజయవాడకు చేరుకుంటుందని ఎయిర్ ఇండియా గల్ఫ్ విభాగం మేనేజర్ పర్మిందర్ పాల్ సింగ్ వెల్లడించారు. విజయవాడ నుండి సాయంత్రం 6: 35కు బయలుదేరి యు.ఏ.ఇ కాలమానం రాత్రి 9:05కు షార్జాకు చేరుకుంటుందని ఆయన వివరించారు.
అదే విధంగా, కువైత్ నుండి ప్రతి బుధ, ఆదివారాలు విమానం (ఐఎక్స్ 894) కువైత్ కాలమానం ప్రకారం ఉదయం 9:05 బయలుదేరి సాయంత్రం నాలుగున్నర గంటలకు విజయవాడకు చేరుకుంటుందని పర్మిందర్ పాల్ సింగ్ చెప్పారు. ఒమాన్ రాజధాని మస్కట్ నుండి విజయవాడకు ఐఎక్ 0444 విమానం ప్రతి గురువారం అర్ధరాత్రి 2:50కు బయలుదేరి హైదరాబాద్ మీదుగా విజయవాడకు చేరుకుంటుందని, మరో విమానం మస్కట్ నుండి ప్రతి మంగళవారం ఉదయం 11:05కు బయలుదేరి విజయవాడకు వెళ్ళి అక్కడి నుండి కేరళలోని కన్నూర్‌కు వెళ్తుందని ఎయిర్ ఇండియా ఉన్నతాధికారి చెప్పారు. ఆశించిన విధంగా ప్రయాణికుల సంఖ్య లేకపోవడంతో మస్కట్ – హైదరాబాద్ విమానాన్ని రెండు వేర్వేరు నగరాలయిన హైదరాబాద్, కన్నూర్‌ల మీదుగా అనుసంధానం చేసినట్లు తెలుస్తోంది.
విజయవాడకు విమాన సర్వీసులను ప్రారంభించడం పట్ల దుబాయిలోని ప్రవాసాంధ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నుండి దుబాయి వెళ్ళడం సమస్య కాకున్నా విజయవాడ నుండి హైదరాబాద్‌కు ప్రయాణించడం కష్టతరంగా ఉండేదని దుబాయిలోని తెలుగుదేశం పార్టీ నాయకుడు, సామాజిక కార్యకర్త అయిన ఖాదర్ బాషా వివరించారు. లగేజి, వెయిటింగ్ సమస్య అదనంగా ఉండేదని ఆయన అన్నారు. ద్వైపాక్షిక ఒప్పందంలో భారతదేశం పక్షాన సీట్ల లోటు కారణంగా ఎమిరేట్స్ లేదా ఇతర విదేశీ ఎయిర్ లైన్సులకు విజయవాడ లేదా ఇతర నగరాలలో విమాన సర్వీసులను నడపడానికి కేంద్రం అనుమతించడం లేదు. దీంతో ప్రస్తుతానికి ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ సేవలు మాత్రమే కొనసాగుతున్నాయి.