NRI: అమెరికా ప్రభుత్వంలో భారత సంతతి వ్యక్తికి కీలక బాధ్యతలు..
ABN , First Publish Date - 2022-12-30T19:30:26+05:30 IST
అమెరికాలో మరో భారత సంతతి వ్యక్తికి ప్రభుత్వంలో కీలక బాధ్యతలు దక్కాయి.
ఎన్నారై డెస్క్: అమెరికాలో మరో భారత సంతతి వ్యక్తికి(Indian American) ప్రభుత్వంలో కీలక బాధ్యతలు దక్కాయి. నేషనల్ స్పేస్ కౌన్సిల్‌కు(National Space Council) సలహాలిచ్చే అడ్వైసరీ బృందంలో సభ్యుడిగా రాజీవ్ బద్యాల్(Rajeev Badyal) ఎంపికయ్యారు. బద్యాల్ ప్రస్తుతం అమెజాన్ సంస్థలోని ప్రాజెక్టు కూపియర్‌కు(Kupier) నేతృత్వం వహిస్తున్నారు. ఇంటర్నెట్ కనెక్టివిటీ లేని ప్రాంతాలకు ఈ సౌకర్యం కల్పించేందుకు అమెజాన్ సంస్థ కూపియర్ ప్రాజెక్టు ప్రారంభించింది. ఇందులో భాగంగా కొన్ని ఉపగ్రహాలను భూమికి దగ్గరగా ఉన్న కక్ష్యలో ప్రవేశపెడతారు.
అడ్వైసరీ బృందంలో పనిచేసేందుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్(Kamala Harris) ఎంపిక చేసిన 30 మందిలో బద్యాల్ కూడా ఒకరు. అంతరిక్ష రంగంలో అమెరికా ప్రయోజనాలను కాపాడుకోవడంలో బైడెన్ ప్రభుత్వానికి బద్వాల్ తగు సూచనలు సలహాలు ఇవ్వనున్నారు. అంతరిక్ష రంగానికి సంబంధించి అమెరికా అనుసరించాల్సిన విధానాలు, వ్యూహాలు, చట్టాలు, అంతర్జాతీయ ఒప్పందాలతో పాటూ పౌర, వాణిజ్య, భద్రతా అంశాలపై నేషనల్ స్పేస్ కౌన్సిల్‌కు అడ్వైసరీ బృందం సలహాలు ఇస్తుంది. అంతరిక్ష రంగంలోని పలు సంస్థలకు నేషనల్ స్పేస్ కౌన్సిల్ ప్రతినిధిగా వ్యవహరిస్తోంది. దీనికి అమెరికా ఉపాధ్యక్షురాలు నేతృత్వం వహిస్తున్నారు.