Golden Visa: ఆ ఒక్క నిబంధన మార్పుతో.. యూఏఈ 'గోల్డెన్ వీసా'కు భారీ డిమాండ్

ABN , First Publish Date - 2022-11-22T09:12:56+05:30 IST

లాంగ్‌టర్మ్ రెసిడెన్సీ నిమిత్తం నైపుణ్యం కలిగిన విదేశీయుల కోసం యూఏఈ ప్రభుత్వం జారీ చేస్తున్న గోల్డెన్ వీసాలకు (Golden Visas) డిమాండ్ పెరుగుతోంది.

Golden Visa: ఆ ఒక్క నిబంధన మార్పుతో.. యూఏఈ 'గోల్డెన్ వీసా'కు భారీ డిమాండ్

అబుదాబి: లాంగ్‌టర్మ్ రెసిడెన్సీ నిమిత్తం నైపుణ్యం కలిగిన విదేశీయుల కోసం యూఏఈ ప్రభుత్వం జారీ చేస్తున్న గోల్డెన్ వీసాలకు (Golden Visas) డిమాండ్ పెరుగుతోంది. దీనికి ప్రధాన కారణం నెలవారీ జీతం నిబంధనల్లో మార్పులు చేయడమే. ఇంతకుముందు దరఖాస్తుదారుడి కనీస నెలవారీ జీతం 50వేల దిర్హమ్స్ (రూ.11.12లక్షలు) ఉండాలనే నిబంధన ఉండేది. ఇప్పుడు ఈ పరిమితిని 30వేల దిర్హమ్స్‌కు (రూ. 6.67లక్షలు) తగ్గించారు. అక్టోబర్‌లో దుబాయ్‌లోని అరేబియన్ బిజినెస్ సెంటర్‌లో (అమెర్ సెంటర్, షేక్ జాయెద్ రోడ్) ఈ పథకాన్ని ప్రారంభించినప్పటి నుంచి ప్రతిరోజూ దాదాపు 30 నుంచి 40 గోల్డెన్ వీసాలు జారీ చేస్తున్నట్లు సెంటర్‌లోని ఆపరేషన్స్ మేనేజర్ ఫిరోసే ఖాన్ తెలిపారు. తమకు వచ్చే దరఖాస్తుల్లో చాలా వరకు నిపుణులు, వ్యాపారవేత్తలకు సంబంధించినవి ఉంటున్నాయని ఆయన పేర్కొన్నారు.

ఇక ఈ ఏడాది ఇప్పటివరకు 12వేల కంటే ఎక్కువ దీర్ఘకాలిక రెసిడెన్సీ వీసాలను జారీ చేసినట్లు వెల్లడించారు. 5, 10 ఏళ్ల కాలపరిమితితో ఈ గోల్డెన్ వీసాలు జారీ చేయడం జరుగుతోంది. కాగా, గోల్డెన్ వీసా పథకంలో భాగంగా ఎక్కువ మంది నైపుణ్యం కలిగిన నిపుణులు దీర్ఘకాలిక రెసిడెన్సీని పొందవచ్చు. వైద్యం, ఇంజనీరింగ్, సమాచార సాంకేతికత, వ్యాపారం, పరిపాలన, విద్య, సంస్కృతి, సామాజిక శాస్త్రాలు తదితర విభాగాల్లో నిపుణులు గోల్డెన్ వీసాకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (GDRFA) కేవలం దుబాయ్ పరిధిలోనే 2019 నుంచి 2022 వరకు జారీ అయిన గోల్డెన్ వీసాల వివరాలను వెల్లడించింది. ఈ మూడేళ్లలో సుమారు 1,51,666 గోల్డెన్ వీసాలు మంజూరు అయ్యాయని జీడీఆర్ఎఫ్ఏ తెలిపింది.

అలాగే 2022 ఏడాదికి సంబంధించి ఇప్పటివరకు 1,55,42,384 ఎంట్రీ, రెసిడెన్సీ పర్మిట్లను (Residency Permits) జారీ చేసినట్లు తెలియజేసింది. 2020-21తో పోలిస్తే ఈ ఏడాది 43శాతం మేర విదేశీ ఉద్యోగుల సంఖ్య పెరిగిందని జీడీఆర్ఎఫ్ఏ తన వార్షిక నివేదికలో పేర్కొంది. ఇకపోతే యూఏఈలోని దరఖాస్తుదారుల కోసం వీసా ధర 2,800 నుంచి 3,800 దిర్హమ్స్ (రూ.62వేలు నుంచి రూ. 84వేలు) మధ్య ఉంటుంది. ఇక గోల్డెన్ వీసా అనేక ప్రయోజనాలు అందిస్తోంది. 6 నెలలకు పైగా యూఏఈ (UAE) వెలుపల ఉన్నా రెసిడెన్సీ చెల్లుబాటుపై ఎలాంటి ప్రభావం ఉండదు. అలాగే వీసాదారులు దీర్ఘకాలిక రెసిడెన్సీపై పేరెంట్స్‌కు స్పాన్సర్లుగా ఉండొచ్చు. దీంతోపాటు వయస్సు పరిమితులు లేకుండా పిల్లలకు స్పాన్సర్ చేసే వెసులుబాటు ఉంటుంది. అలాగే వీసా హోల్డర్లు స్పాన్సర్ చేయగల సహాయక సిబ్బంది సంఖ్యపై కూడా పరిమితి ఉండదు.

Updated Date - 2022-11-22T09:12:58+05:30 IST