New Zealand: సెలవులపై యజమాని ఇండియాకు.. భారత వ్యక్తి డైరీ ఫామ్‌లో ఉండగా జరిగిందో ఘోరం..
ABN , First Publish Date - 2022-11-25T12:13:18+05:30 IST
న్యూజిలాండ్‌లో దారుణం జరిగింది. భారత సంతతికి (Indian origin) చెందిన వ్యక్తి ఒకరు తాను పనిచేసే డైరీ ఫామ్‌లోనే (Dairy) దారుణ హత్యకు గురయ్యాడు.
ఆక్లాండ్: న్యూజిలాండ్‌లో దారుణం జరిగింది. భారత సంతతికి (Indian origin) చెందిన వ్యక్తి ఒకరు తాను పనిచేసే డైరీ ఫామ్‌లోనే (Dairy) దారుణ హత్యకు గురయ్యాడు. సెంట్రల్ ఆక్లాండ్‌కు సమీపంలోని సాండ్రింగ్‌హామ్‌లోని రోజ్ కాటేజ్ సూపరెట్టెలో బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. యజమాని సెలవుల నిమిత్తం భారత్‌కు (India) రావడంతో స్టోర్ ఉద్యోగిగా పని చేస్తున్న భారత వ్యక్తినే డైరీని నడుపుతున్నట్లుగా సమాచారం.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి 8:05 గంటల (న్యూజిలాండ్ కాలమానం ప్రకారం) సమయంలో ఓ దుండగుడు భారత సంతతి వ్యక్తి ఉన్న డైరీలోకి ప్రవేశించాడు. అనంతరం తనతో పాటు తెచ్చుకున్న కత్తితో బెదిరించి క్యాష్ రిజిస్టర్ తీసుకున్నాడు. ఆ తర్వాత భారత వ్యక్తిని కత్తితో తీవ్రంగా గాయపరిచి అక్కడి నుంచి పారిపోయాడు. ఇక దుండగుడి దాడిలో తీవ్రంగా గాయపడిన భారత వ్యక్తిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు డిటెక్టివ్ ఇన్స్‌పెక్టర్ స్కాట్ బార్డ్ వెల్లడించారు. ఈ సందర్భంగా అనుమానితుడి ఫొటోను పోలీసులు విడుదల చేశారు. ఎవరైనా నిందితుడిని గుర్తిస్తే తమకు సమాచారం అందించాలని స్థానికులను కోరారు.
ఈ ఘటనను దేశ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ తీవ్రంగా ఖండించారు. ఇదిలాఉంటే.. ఈ ప్రాంతంలో భద్రతా చర్యలపై స్థానికులు పెదవి విరుస్తున్నారు. ఈ ఏరియాలో కమ్యూనిటీ కానిస్టేబుళ్లు లేరని చెబుతున్నారు. గతంలో స్థానిక వ్యాపారులు సొంతంగా డబ్బులు జమచేసి రాత్రిపూట సెక్యూరిటీ గార్డును నియమించుకోవాలని భావించారు. కానీ, నిధుల కొరత కారణంగా ఇది కార్యరూపం దాల్చలేదు. సెక్యురిటీ లేకపోవడంతో ఈ ప్రాంతంలో తరచూ ఇలాంటి ఘటనలే చోటు చేసుకుంటున్నాయని స్థానికులు వాపోతున్నారు.