Indian Origin: పనిమనిషిపై వేధింపులు.. 64 ఏళ్ల భారతీయ బామ్మను దోషిగా తేల్చిన సింగపూర్ కోర్టు
ABN , First Publish Date - 2022-11-24T13:09:35+05:30 IST
ఇంట్లో పనిమనిషిని తీవ్ర వేధింపులకు గురిచేసి ఆమె మరణానికి కారణమైనందుకు 64 ఏళ్ల భారతీయ బామ్మను (Indian origin grandmother) సింగపూర్ కోర్టు (Singapore Court) తాజాగా దోషిగా తేల్చింది.
సింగపూర్ సిటీ: ఇంట్లో పనిమనిషిని తీవ్ర వేధింపులకు గురిచేసి ఆమె మరణానికి కారణమైనందుకు 64 ఏళ్ల భారతీయ బామ్మను (Indian origin grandmother) సింగపూర్ కోర్టు (Singapore Court) తాజాగా దోషిగా తేల్చింది. ఆమెపై 48 ఆరోపణలు నమోదయ్యాయి. దీంతో ఒక్కొ ఆరోపణకు రెండేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని సమాచారం. అలాగే 5వేల సింగపూర్ డాలర్ల (సుమారు రూ.3లక్షలు) జరిమానా కూడా ఉంటుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రేమ ఎస్ నారాయణసామీ అనే 64 ఏళ్ల భారతీయ వృద్ధురాలు తన కూతురు, అల్లుడితో కలిసి సింగపూర్‌లో నివాసం ఉండేది. వారి ఇంట్లో నేపాల్‌కు చెందిన పియాంగ్ ఎంగై డాన్ (23) అనే ఓ యువతి పనిమనిషిగా చేసేది. 2015, మే నెలలో ఆమె వారి వద్ద పనికి కుదిరింది. అప్పటి నుంచి చిన్న చిన్న విషయాలకు కూడా ఆమెపై ప్రేమ చేయి చేసుకోవడం చేసేది. కొన్ని రో జులకు ఆ హింస మరింత పెరిగింది. రోజుల తరబడి భోజనం పెట్టకపోవడం, తీవ్రంగా కొట్టడం, వేడి నీళ్లు శరీరంపై పోయడం ఇలా వికృత చేష్టలకు పాల్పడేది ప్రేమ.
అలా 14 నెలల పాటు పియాంగ్‌ను తీవ్రంగా హింసించింది. దాంతో 2016, జూలై 26న ఆమె చనిపోయింది. ప్రేమ కుటుంబ వద్ద పనికి చేరినప్పుడు పియాంగ్ 39 కిలోల బరువు ఉంటే.. ఆమె చనిపోయేనాటికి కేవలం 23 కిలోల బరువు మాత్రమే ఉందట. అంతలా ఆమెను హింసించింది ప్రేమ. పనిమనిషిపై ప్రేమ ఆకృత్యాలన్ని వారి ఇంట్లో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ కేసులో మొదట ప్రేమ కూతురు గాయత్రిని 2021లో సింగపూర్ కోర్టు 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది. తాజాగా ఈ కేసులో పియాంగ్ మృతికి అసలు కారకురాలైన ప్రేమను కూడా దోషిగా తేల్చింది. ఆమెపై 48 ఆరోపణలు మోపింది. దీంతో ఒక్కొ ఆరోపణకు రెండేళ్ల చొప్పున సుమారు 96 ఏళ్ల జైలుశిక్షతో పాటు రూ. 3లక్షల వరకు జరిమానా పడే అవకాశం ఉందని న్యాయనిపుణులు చెబుతున్నారు.