Indian Expats: ఇంగ్లండ్ ప్రవాసుల్లో అత్యధికులు భారతీయులే
ABN , First Publish Date - 2022-11-09T07:18:54+05:30 IST
విదేశాల్లో జన్మించి, ఇంగ్లండ్-వేల్స్ ప్రాంతంలో నివసిస్తున్న ప్రతి ఆరుగురిలో ఒకరు భారతీయులేనని యూకే ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్(ఓఎన్‌ఎ్‌స) కార్యాలయం వెల్లడించింది.
2, 3 స్థానాల్లో పోలాండ్, పాకిస్థాన్ పౌరులు
యూకే ఓఎన్‌ఎస్ వెల్లడి
ఇంగ్లండ్-వేల్స్‌లో అత్యధిక ప్రవాసులు భారతీయులే
లండన్, నవంబరు 8: విదేశాల్లో జన్మించి, ఇంగ్లండ్-వేల్స్ ప్రాంతంలో నివసిస్తున్న ప్రతి ఆరుగురిలో ఒకరు భారతీయులేనని యూకే ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్(ఓఎన్‌ఎ్‌స) కార్యాలయం వెల్లడించింది. 2021 జనాభా లెక్కల ప్రకారం.. ఈ ప్రాంత ప్రజల్లో 1.5 శాతం మంది వారే ఉన్నారని పేర్కొంది. మొత్తం 9.2 లక్షల మంది భారత్‌లో జన్మించిన వారు ఉండగా.. తర్వాతి స్థానంలో 7.43 లక్షలతో పోలాండ్ దేశస్థులు ఉన్నారని స్పష్టం చేసింది. ‘‘2011తో పోలిస్తే ఈ పదేళ్లలో దేశానికి వెలుపల జన్మించిన వారి సంఖ్య 25 లక్షలు దాటింది. వీరిలో ఎక్కువశాతం మంది భారతీయులే. భారత్ తర్వాతి స్థానాల్లో పోలాండ్, పాకిస్థాన్(6.24 లక్షలు) ఉన్నాయి.
2011 నాటికి యూకేకు వలస వస్తున్న వారి జాబితాలో అమెరికా, జమైకా దేశాల పౌరులు తొలి పదిస్థానాల్లో ఉండగా.. ఇప్పుడు ఆ దేశాలు ఈ జాబితాలో లేవు. రొమానియా 4వ స్థానంలో, ఐర్లాండ్ 5వ స్థానాల్లో ఉన్నాయి. బంగ్లాదేశ్ 7వ స్థానంలో ఉంది. దేశంలో నివసిస్తున్న వారిలో అత్యధికంగా విదేశీ పాస్‌పోర్టులు కలిగిన వారిలో పోలాండ్ దేశస్థులు (1.3 శాతం). రోమానియా(0.9 శాతం), భారతీయులు(0.6 శాతం) ఉన్నారు. వీరంతా ఎక్కువగా లండన్‌లోనే నివసిస్తున్నారు. లండన్‌లోని ప్రతి 10మందిలో నలుగురు దేశానికి వెలుపల జన్మించినవారే ఉన్నారు. 2011 జనాభా లెక్కలతో పోలిస్తే.. రొమానియా పౌరుల సంఖ్య ఏకంగా 576శాతం మేర పెరిగింది.