Kuwait: ఇద్దరు ప్రవాసులను ఉరి తీయాలని నిర్ణయించిన కువైత్.. ఇంతకీ వారు చేసిన నేరం ఏంటంటే..

ABN , First Publish Date - 2022-12-06T12:22:57+05:30 IST

గల్ఫ్ దేశాల్లో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయనే విషయం తెలిసిందే. ఏమాత్రం తేడా వచ్చిన ఉరిశిక్ష ఖాయం.

Kuwait: ఇద్దరు ప్రవాసులను ఉరి తీయాలని నిర్ణయించిన కువైత్.. ఇంతకీ వారు చేసిన నేరం ఏంటంటే..

కువైత్ సిటీ: గల్ఫ్ దేశాల్లో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయనే విషయం తెలిసిందే. ఏమాత్రం తేడా వచ్చిన ఉరిశిక్ష ఖాయం. ఇదే కోవలో తాజాగా కువైత్ కాసేషన్ కోర్టులోని క్రిమినల్ విభాగం ఇద్దరు ప్రవాసులకు ఉరిశిక్ష విధించింది. వారిలో ఒకరు సుడాన్ పౌరుడు కాగా, మరోకరు ఈజిప్టియన్. సుడాన్ దేశస్థుడు తన మాజీ భార్యను హత్య చేస్తే.. ఈజిప్ట్ వ్యక్తి కూడా భార్యను చంపిన కేసులోనే నిందితుడు. దీంతో వీరిద్దరిని ఉరితీయాలని న్యాయస్థానం తీర్పునిచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సుడాన్‌కు చెందిన వ్యక్తి సాల్మియాలోని మైదాన్ హవల్లీ ప్రాంతంలో నివాసం ఉండేది. ఇదే ప్రాంతంలో అతడి మాజీ భార్య మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని ఉంటోంది. తనకు విడాకులిచ్చి మరో వ్యక్తిని పెళ్లాడడం, తాను ఉంటున్న ప్రాంతంలోనే అతడితో కలిసి ఉండడం చూసి సుడాన్ వ్యక్తికి ఈర్ష్యాను కలిగించింది. ఆమెపై కోపంతో రగిలిపోయాడు.

ఎలాగైన ఆమెను అంతమొందించాలని అనుకున్నాడు. అవకాశం కోసం ఎదురుచూస్తున్న అతడికి ఒకరోజు ఆమె ఇంట్లో ఒంటరిగా కనిపించింది. దాంతో ఆమెపై కత్తితో దాడి చేశాడు. ఆమె చనిపోయిందని నిర్ణయించుకున్న తర్వాత వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు. ఇలాగే ఈజిప్ట్ వ్యక్తి కూడా తన భార్యతో ఘర్షణ కారణంగా ఆమెను దారుణంగా చంపేశాడు. అనంతరం ఇంట్లోనే ఆమె మృతదేహాన్ని ఉంచేసి.. 16ఏళ్ల కొడుకు, 17ఏళ్ల కూతురితో కలిసి కువైత్ వదిలి స్వదేశానికి పారిపోయాడు. అతడి ఇంటి పక్కన ఉండే మరో వ్యక్తి ఈ విషయాన్ని అంతర్గత మంత్రిత్వశాఖకు తెలియజేశాడు. ఇలా తమ భార్యలను అతి కిరాతకంగా హతమార్చిన ఈ ఇద్దరు ప్రవాసులను కువైత్ కోర్టు ఉరి తీయాలని తాజాగా తీర్పును వెల్లడించింది. ఇదిలాఉంటే.. కువైత్ అధికారులు గత నెల 16వ తేదీన ఏడుగురు ఖైదీలకు ఒకేసారి మరణశిక్షను అమలు చేసిన విషయం తెలిసిందే. వీరిలో కువైత్‌కు చెందిన ముగ్గురు పురుషులు, ఒక మహిళ, ఒక సిరియన్‌, ఒక పాకిస్థానీ, ఒక ఇథియోపియన్‌ మహిళ ఉన్నారు.

Updated Date - 2022-12-06T12:22:59+05:30 IST