UAE: కరెన్సీ నోటులో డ్రగ్స్.. దుబాయ్‌లో ఆసియా వ్యక్తికి దేశ బహిష్కరణ!

ABN , First Publish Date - 2022-11-05T07:37:39+05:30 IST

మాదక ద్రవ్యాలను (Drugs) అక్రమంగా తరలించే క్రమంలో కేటుగాళ్లు ఈసారి ఏకంగా కరెన్సీ నోటునే ఎంచుకున్నారు. అధికారులకు అనుమానం రాకుండా కరెన్సీ నోటు ద్వారా డ్రగ్స్‌ను దేశంలోకి తీసుకువచ్చారు.

UAE: కరెన్సీ నోటులో డ్రగ్స్.. దుబాయ్‌లో ఆసియా వ్యక్తికి దేశ బహిష్కరణ!

అబుదాబి: మాదక ద్రవ్యాలను (Drugs) అక్రమంగా తరలించే క్రమంలో కేటుగాళ్లు ఈసారి ఏకంగా కరెన్సీ నోటునే ఎంచుకున్నారు. అధికారులకు అనుమానం రాకుండా కరెన్సీ నోటు ద్వారా డ్రగ్స్‌ను దేశంలోకి తీసుకువచ్చారు. అలా తీసుకువచ్చిన డ్రగ్స్‌ను వినియోగించి చివరకు అధికారులకు పట్టుబడ్డారు. దుబాయ్‌లోని (Dubai) రాస్ అల్ ఖోర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 10 దిర్హమ్ కరెన్సీ నోటులోని రెండు మడతల్లో మత్తుపదార్థాలను దాచి వినియోగిస్తున్న ఓ ఆసియా వ్యక్తితో పాటు అప్పటికే డ్రగ్స్ మత్తులో ఉన్న మరో ఇద్దరిని దుబాయ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాదక ద్రవ్యాలు వినియోగిస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన ఆ ముగ్గురిని న్యాయస్థానానికి రిఫర్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో దుబాయ్ క్రిమినల్ కోర్టు ఆసియా వ్యక్తిని ఐదేళ్ల జైలు శిక్షతో పాటు 50వేల దిర్హమ్స్ (రూ.11లక్షలు) జరిమానా విధించింది. అంతేగాక శిక్షకాలం పూర్తైన వెంటనే దేశం నుంచి బహిష్కరించాలని ఆదేశించింది.

ఈ ఏడాది జూన్‌లో ఈ ఘటన జరగగా.. తాజాగా కోర్టు నిందితుడికి శిక్షను ఖరారు చేసింది. దుబాయ్ పోలీస్ విభాగానికి చెందిన యాంటీ నార్కోటిక్స్ బృందం రాస్ అల్ ఖోర్ ప్రాంతంలో విశ్వసనీయ సమాచారం ప్రకారం చేసిన దాడిలో ముగ్గురు నిందితులు ఇలా రెడ్ హ్యాండెడ్‌గా దొరికారు. ఆసియా వ్యక్తితో పాటు మరో ఇద్దరు మత్తులో ఉండడంతో వారిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేశారు. ఆ సమయంలో ఆసియా వ్యక్తి వద్ద ఉన్న 10 దిర్హమ్ నోటులో రెండు ప్యాకేట్ల డ్రగ్స్ దొరికింది. దాంతో మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్న అధికారులు నిందితులను పోలీసులకు అప్పగించారు. తాజాగా దుబాయ్ క్రిమినల్ కోర్టులో ఈ కేసు విచారణకు వచ్చింది. దాంతో న్యాయస్థానం ఆసియా వ్యక్తికి 5ఏళ్ల జైలు, 50వేల దిర్హమ్ల ఫైన్ విధించింది. అలాగే శిక్షకాలం పూర్తైన వెంటనే దేశం నుంచి బహిష్కరించాలని అధికారులను ఆదేశించింది.

Updated Date - 2022-11-05T07:38:57+05:30 IST