Kuwait: అనూహ్య పరిణామం.. క్లినిక్స్‌కు వెళ్లడం మానేసిన సగానికి పైగా ప్రవాసులు.. కారణమిదే..

ABN , First Publish Date - 2022-12-22T09:35:11+05:30 IST

గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) గడిచిన కొంతకాలంగా ప్రవాసులను (Expats) పొమ్మనలేక పొగబెడుతోంది.

Kuwait: అనూహ్య పరిణామం.. క్లినిక్స్‌కు వెళ్లడం మానేసిన సగానికి పైగా ప్రవాసులు.. కారణమిదే..

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) గడిచిన కొంతకాలంగా ప్రవాసులను (Expats) పొమ్మనలేక పొగబెడుతోంది. అన్ని విధాలుగా వలసదారులను ఇబ్బందులకు గురి చేస్తోంది. వర్క్ పర్మిట్ల (Work Permits) జారీ నుంచి రోజువారీ అవసరాలు తీర్చుకునే విషయాల వరకు ప్రతిదాంట్లో ప్రవాసులకు కఠిన షరతులు విధిస్తోంది. ఇదే కోవలో మూడు రోజుల క్రితం ఆ దేశ ఆరోగ్యమంత్రిత్వ శాఖ (Health Ministry) ప్రవాసులకు ప్రభుత్వ క్లినిక్స్, హాస్పిటల్స్‌లో ఇచ్చే మెడిసిన్స్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల గడిచిన 48 గంటల్లో అక్కడి ప్రభుత్వ క్లినిక్స్, ఆస్పత్రులకు వెళ్లే ప్రవాసుల సంఖ్య దాదాపు 60 శాతం మేర తగ్గిపోయింది.

హెల్త్ సెక్టార్ అధికారిక సమచారం ప్రకారం అక్కడి కొన్ని పబ్లిక్ క్లినిక్స్‌లో (Public Clinics) ఇంతకుముందు రోజుకీ కనీసం 1,200 మంది వరకు పేషెంట్స్ (Patients) వచ్చేవారట. ప్రస్తుతం అది 50శాతానికి పైగా తగ్గిపోయింది. ఇప్పుడు డైలీ కేవలం 400 మంది వరకు మాత్రమే వస్తున్నారట. అందులోనూ 100 మంది వరకు కేవలం మెడికల్ టెస్టుల కోసమే వచ్చి, మెడిసిన్స్ మాత్రం తీసుకోవడం లేదట. అయితే, డయాబెటీస్ క్లినిక్‌లకు సందర్శకుల సంఖ్యలో మాత్రం గణనీయమైన మార్పు ఏమీ లేదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ప్రమాద విభాగాల్లోని సందర్శకుల సంఖ్య కూడా అంతగా ప్రభావితం కాలేదని వెల్లడించాయి.

Updated Date - 2022-12-22T10:23:32+05:30 IST