TANA: 'తానా' సభలకు 48 కోట్ల విరాళాలు.. 45 ఏళ్ల తానా చరిత్రలో ఇదే అత్యధికం
ABN , First Publish Date - 2022-11-08T13:00:15+05:30 IST
తానా (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) విరాళాల సేకరణలో సరికొత్త రికార్డు సృష్టించింది.
విరాళాల సేకరణలో సరికొత్త రికార్డు
అమరావతి, నవంబర్ 7 (ఆంధ్రజ్యోతి): తానా (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) విరాళాల సేకరణలో సరికొత్త రికార్డు సృష్టించింది. వచ్చే ఏడాది జరగనున్న తానా 23వ మహాసభల కోసం రూ. 48 కోట్ల విరాళాలు సేకరించింది. కొవిడ్ మహమ్మారి కారణంగా 2021లో జరగాల్సిన మహాసభలు వాయిదాపడగా.. దాదాపు నాలుగేళ్ల తరవ్ాత 2023లో నిర్వహించనున్నారు. వచ్చ ఏడాది జూలై 7 నుంచి 9 వరకు జరిగే ఈ మహాసబలకు ఫిలడెల్ఫియా నగరం వేదిక కానుంది. కాగా, ఈ నెల 5న పెన్సిల్వేనియాలో ఈ మహాసభల సన్నాహక కార్యక్రమాన్ని నిర్వహించగా అద్భుతమైన స్పందన లభించింది. తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, కన్వీనర్ పొట్లూరి రవి ఆధ్వర్యంలో నిర్వహించిన విరాళాల సేకరణ విందులో 800 మందికిపైగా తెలుగు ప్రజలు పాల్గొని రికార్డు స్థాయిలో విరాళాలు ప్రకటించారు. దీంతో 6 మిలియన్ డాలర్లు పోగయ్యాయి. గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో విరాళాలు రాలేదని తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి తెలిపారు.
ఈ సందర్భంగా తానా సభ్యులు, వలంటీర్లు, దాతలను సంఘం అభివృద్ధికి వారు చేసిన కృషిని కొనియాడారు. విరాళాలు అందించిన ప్రతిఒక్కరినీ పేరుపేరున అభినందించారు. వచ్చే ఏడాది నిర్వహించనున్న మహాసభల ప్రాముఖ్యతను వివరించారు. కన్వీనర్ పొట్లూరి రవి మాట్లాడుతూ.. దాదాపు నాలుగేళ్ల తర్వాత మహాసభలు నిర్వహిస్తుండడంతో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నామని, అంజయ్య చౌదరి నేతృత్వంలో పదహారు నెలలుగా కష్టపడుతున్నామని చెప్పారు. విరాళాల సేకరణ కార్యక్రమ నిర్వహణకు సహకరించిన పీపుల్స్ మీడియా అధినేత విశ్వప్రసాద్, డెక్కన్ స్పైస్ గోవర్ధన్, జగదీశ్ యలమంచిలి, వలంటీర్లు ఆయన కృతజ్యతలు తెలిపారు.