Hyderabad Book Festival: భానుమతీ రామకృష్ణ అత్తగారు ఎవర్ గ్రీన్..!

ABN , First Publish Date - 2022-12-25T12:31:25+05:30 IST

అత్తగారితనాన్ని పెత్తనాన్ని కోడలి మీద రుద్దుతున్నట్టు మొరటుగానూ ఉండదు.

Hyderabad Book Festival: భానుమతీ రామకృష్ణ అత్తగారు ఎవర్ గ్రీన్..!
Hyderabad Book Fair

ఎన్నో కళలను తనలో నింపుకున్న భానుమతీ రామకృష్ణ నటి, గాయని, రచయిత్రి, నిర్మాత, దర్శకురాలు, అంతేనా.. ఇంకా అయిపోలేదు. సంగీత దర్శకురాలు, స్టుడియో అధినేత, చిత్రకారిణి, జ్యోతిష్య శాస్త్రవేత్త ఇంతమందిని తనలో ఇముడ్చుకున్న విలక్షణమైన వ్యక్తి భానుమతి. అంతేకాదు తనుకు ప్రవేశమున్న రంగాలలో ఆమెకంటూ ప్రత్యేకమైన ప్రతిభ కూడా ఉంది. హైదరాబాద్ పుస్తకాల ఉత్సవం సందర్భంగా... బహుముఖప్రజ్ఞాశాలి డాక్టర్ భానుమతిగారిలోని రచయిత్రిని ఒకసారి గుర్తు చేసుకుందాం..

ఇక రచయిత్రిగా ఆమె రాసిన అత్తగారి కథలు అప్పటి తెలుగు లోగిళ్లలోకు ముఖ్యంగా అత్తాకోడళ్ళకు మరింత దగ్గరైంది. ఆమె శైలిలోని వ్యంగ్యం కథలలోని స్వచ్ఛత అత్తగారి పాత్రను అందరికీ చేరువచేసింది. భానుమతీ రామకృష్ణ సృష్టించిన “అత్తగారు” కల్పిత పాత్రంటే నమ్మలేని పాఠకులు ఎందరో,  సినిమాల్లో అత్తగారు అనగానే సూర్యకాంతం గుర్తొచ్చినట్టు, సాహిత్యంలో అత్తగారు అనగానే మొదట గుర్తొచ్చేది భానుమతి అత్తగారే. బోసి నోట్లో కోరల్లా కనిపించే రెండు పళ్ళు, కేశాల్లేని తలని కప్పుతూ తెల్లని ముల్లు చీర, కొంచం అమాయకత్వం, కొంచం గడసరితనం వెరసి కొత్తదనాన్ని చిత్రంగా చూసే ఆమె తీరు, పాతకాలంనాటి జ్ఞాపకాలను నెమరేసుకుంటూ ఉబలాటపడటం మన తెలుగింటి అత్తగార్లకు ఎక్కడా తీసిపోని తెలుగుదనపు మూర్తే భానుమతి అత్తగారు..! ఈకథల పుస్తకం ఆంధ్ర దేశంలో అపూర్వమైన ఆదరణను సొంతం చేసుకోవడంతో పాటు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డును కూడా తన ఖాతాలో వేసుకుంది.

ఈ అత్తగారి పాత్ర భానుమతీ రామకృష్ణ యధాలాపంగా సృష్టించినా.., అత్తగారి కి ఎంతటి పాఠకాధరణ లభించిందంటే తర్వాతి కాలంలో ఆవిడ రాసిన కథలన్నింటిలోనూ ప్రధాన పాత్ర అత్తగారే అయింది. ఓ సందర్భంలో భానుమతి రామకృష్ణ స్వయంగా చెప్పుకొచ్చింది.. నేను సృష్టించిన అత్తగారి పాత్ర ఎవరో కాదు మా ఇంట్లో మా అత్తగారే అనుకుంటారు చాలామంది.. కానీ అత్తగారి పాత్ర కోసం మా అత్తగారిలోని కొన్ని లక్షణాలను మాత్రమే తీసుకుని వాడుకున్నాను అన్నారు.

నటిగానే కాదు రచయిత్రిగా ఆమె పాఠకుల మనసుల్లో మల్లెలు పూయించింది. ఊయలలూగించింది. వయసు మీద పడినా భానుమతి స్వభావంలో రాతలో, మాటలో ఎక్కడా తేడా కనిపించనీయలేదు ఆమె. ఇక రచయిత్రిగా భానుమతి ప్రయాణం మొదలైంది మాత్రం “వరవిక్రయం” సినిమాలో నచించేటప్పుడు పరిచయమైన మల్లాది విశ్వనాథ కవిరాజు గారి దగ్గర కథలు రాయడమూ, చంధోబద్ధంగా పద్యాలు రాయడమూ నేర్చుకోవడంతో ప్రారంభమైంది.  ఆమె మొదటి కథ “మరచెంబు” ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైంది. ఆ కథను చూసిన కవిరాజుగారు హాస్యం చక్కగా రాస్తున్నారు, రచనలో హాస్యాన్ని పండించడం చాలా కష్టమైన పని” అని మెచ్చుకున్నారట. భానుమతిగారు కూడా రచనా వ్యాసంగం అంటేనే ఎక్కువ మక్కువ చూపేవారు.

ఆవకాయ పెట్టడంలో ఓనమాలు తెలియక పోయినా నిమ్మకాయ పచ్చడి చేసినట్టే ఐదువేల మామిడికాయలతో ఆవకాయ పెట్టేయాలనే అత్తగారి ప్రయత్నమే ఈ అత్తగారి సంకలనంలో మొదటి కథ అత్తగారూ_ ఆవకాయ. రైతు మీద అజమాయిషీ అంతా చూపించి మామిడి కాయలు తెప్పించి అత్తగారు చివరికి ఆవకాయ పెట్టారా లేదా అనేదే కథలోని లాజిక్కు. ఈ ఒక్క కథతోనే మన ఊహకు అందని తనదైన లక్షణాలతో అత్తగారిని స్పష్టంగా చూపించడానికి ప్రయత్నించారు భానుమతి. ఇక్కడ అత్తగారిని గడుసుగా చూపించడంలో మరో చేయి బాపూ బొమ్మది.

ఆవును పెంచుకోవాలని అత్తగారు పడ్డ తాపత్రయం అత్తగారు_ ఆవు కథలో చదివి కడుపుబ్బా నవ్వుకోవాల్సిందే., ఇంకొన్ని కథల్లో అత్తా_ తోడకోడలీయం, అత్తగారూ_ అరటికాయ పొడి, అత్తగారూ_ జపాన్ యాత్ర కథలు చదువుతున్నంత సేపూ పెదాలమీదకు వస్తున్న నవ్వుని మునిపంటితో ఆపడం ఎంత కష్టం అవుతుందంటే మాటలలో చెప్పనలవి కాదు.. ఈ కథలను చదివి అనుభవించాల్సిందే.

 

Untitled-15.jpg

రచనలో హాస్యాన్ని పండించడం అనే ఈ ప్రావిణ్యాన్ని భానుమతి అలవోకగా సొంతం చేసుకున్నారు.  తన రచనలలో బలవంతంగా హాస్యాన్ని చొప్పించినట్టు ఎక్కడా కనిపించదు. మామూలు జీవితాల్లో గడుసుదనం, చలాకీదనంతోపాటు, ఆరిందాతనాన్ని కట్టబెట్టిన అత్తగారు అత్తగారితనాన్ని పెత్తనాన్ని కోడలి మీద రుద్దుతున్నట్టు మొరటుగానూ ఉండదు. ఆమె పంథాలో కథను చెప్పినా అత్తగారి గడుసుదనం అందరినీ ఆకట్టుకుందంటే దానికి ఆరోగ్యకరమైన హాస్యం పూర్తిస్థాయిలో తోడుకావడమే ప్రధాన కారణం.

ఆ తరువాతి కాలంలో రచనలు చేసిన రచయిత్రులకు భానుమతీరామకృష్ణ  సున్నిత రచనా శైలి ఓ ఆరోగ్యకరమైన బాటను వేసిందనే చెప్పాలి. అలవోకగా కథ జరిగే తీరును ఆమె పాఠకులకు పరిచయం చేసింది. ఇంకా భానుమతి కలం నుంచి జాలువారిన రచనల్లో “రంభా చక్రపాణీయం” రచనను చదివిన చక్రపాణిగారు  “నీ గమనింపును చూస్తుంటే భయంగా ఉంది” అన్నారట.  భానుమతి తన స్వీయ చరిత్ర “నాలోనేను” రచనకుగాను కేంద్ర ప్రభుత్వ స్వర్ణకమలం లభించడం మరో విశేషం. ఇక్కడ మరో సంగతి చెప్పుకోవాలి భానుమతీ రామకృష్ణతో సాహితీ చర్చలు జరిపేందుకు కొడవటిగంటి కుటుంబరావు, డి.వి.నరసరాజు, చక్రపాణి, దాశరథి లాంటి ప్రముఖులు తరచూ వెళుతూ ఉండే వారంటేనే అర్థం చేసుకోవచ్చు సాహిత్యంలో ఆవిడ‌ స్థాయి యెంతటి గొప్పదో.

_ శ్రీశాంతి మెహెర్.

Updated Date - 2022-12-25T13:00:06+05:30 IST