Hyderabad Book Fair : ఊర్వశి అంటే గాఢమైన, ఊపిరాడనివ్వని అద్భుతం..!
ABN , First Publish Date - 2022-12-28T09:37:27+05:30 IST
ప్రాచీన సాహిత్యాన్ని తర్వాతి తరాలకు ఏదో ఒకరూపంలో అందించాల్సిన బాధ్యత రచయితల మీద ఉంది.
ప్రముఖ తెలుగు కవయిత్రి, రచయిత్రి , కాలమిస్టు. “ఆకులో ఆకునై” కాలమ్ గా ప్రముఖ దినపత్రికలో వచ్చిన వ్యాసాలను అందమైన పుస్తకంగా తీసుకువచ్చారు వీరలక్ష్మీదేవి. "మా ఊళ్లో కురిసిన వాన", "జాజిపూల పందిరి", అన్న పేర్లతో కూడా కాలమ్స్ పుస్తకాలుగా వచ్చాయి. ఇప్పుడు ఊర్వశిని సంస్కృత సాహిత్యం పట్ల ఆసక్తి ఉండి చదువుకోలేని పాఠకుల కోసం తెలుగులో నవలా రూపంలోకి తీసుకొచ్చే మహత్తర ప్రయోగాన్ని చేసారామె.. ఈ పుస్తకం వచ్చేందుకు కారణాలను బుక్ ఫెయిర్ సందర్భంగా ఆంధ్రజ్యోతి వెబ్ వాడ్రేవు వీరలక్ష్మీదేవితో జరిపిన ఆత్మీయ సంభాషణ..
ఇప్పుడు ఈ ఊర్వశి పుస్తకం ఏమిటి?
ఇంతకాలం సంస్కతభాషలో నాటకరూపంలో ఉన్న కాళిదాసు విక్రమోర్వశీయం నాటకాన్ని ఇప్పుడు సరళమైన తెలుగు భాషలో నవలగా తీసుకుని వచ్చాం. ఇది అనల్ప ప్రచురణ కర్తల పుస్తక ప్రచురణ విభాగంలో ఒకటి. కాళిదాసు మూడు సంస్కృత నాటకాలు రాశాడు. వాటిని సంస్కృత సాహిత్యం పట్ల ఆసక్తి ఉండి చదువుకోలేని పాఠకుల కోసం తెలుగులో నవలా రూపంలోకి తీసుకొచ్చే పధకం ఇది. ఇప్పటికే "మాళవికాగ్ని మిత్రం" అనే నాటకాన్ని ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు నవల గా రాశారు. రాణి శివశంకర్ "శాకుంతలం" నాటకాన్ని విశేషమైన చర్చతో కలిపి రాశారు. ఈ రెండూ అనల్ప వారు ఈ మధ్యకాలంలో పాఠకులకు అందించారు. ఇక మిగిలినది "విక్రమోర్వశీయం". దీనిని నేను సరళ వ్యావహారికంలో నవలగా మార్చేను. దీన్ని డిసెంబర్ 22 న విడుదల చేశాం. ప్రస్తుతం ఇది హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో అందుబాటులో ఉంది.
ఈ ఊర్వశి కథ పుట్టుపూర్వోత్తరాలు ఏమిటి?
ఊర్వశి వేద, పురాణ, ఇతిహాస, ప్రబంధ కవుల నుంచి ఆధునిక కవుల దాకా అందరినీ మోహపెట్టింది. అందరూ ఆమె కథను చెప్పుకుంటూనే వచ్చారు. ఊర్వశి కథ మొదట ఋగ్వేదంలో ఉంది. అటుతర్వాత శతపథబ్రాహ్మణంలో, మత్స్యపురాణంలో, విష్ణుపురాణంలో, శ్రీమద్భాగవతంలో, దేవీభాగవతంలో, స్కంధపురాణంలో ఇలా కథాసరిత్సాగరం దాకా చిన్న చిన్న మార్పులతో ఊర్వశీ పురూరవుల ప్రేమ కథ ఉంది. ఇందులో మత్స్యపురాణంలో కథని తీసుకుని నాటకీయమైన చిన్నచిన్న మార్పులు చేస్తూ కాళిదాసు నాటకంగా రాశాడు. తర్వాత విశ్వకవి రవీంద్రుడు, అరవిందుడు, , కృష్ణశాస్త్రి ఊర్వశిని తమ ప్రేయసిగా భావించుకుని కవిత్వం రాశారు. కృష్ణశాస్త్రి" తొలివియోగిని నేనే తొలి ప్రేయసిని నేనే" అని ఆమె గురించే పాడుకున్నారు. హిందీలో రామదారీసిన్హా దినకర్ ఊర్వశి కావ్యం రాసి జ్ఞానపీఠ్ పురస్కారం అందుకున్నారు. చివరకు చలం తన పురూరవ నాటకం ద్వారా ఊర్వశిని తాత్విక కోణంలో వివరించాడు.
చివరిగా ఊర్వశి అంటే ఏమని గ్రహించాలి?
కథల్లో ఊర్వశి దేవకాంత. అప్సరస. పురూరవుడిని వలిచి స్వర్గాన్ని వదిలి అతని కోసం వచ్చింది. కానీ తిరిగి ఆమె స్వర్గానికి వెళ్లక తప్పలేదు. ఊర్వశీ వియోగం గొప్ప ప్రేమికుడైన పురూరవుడిని ఏం చేసింది. ఈ చివరి ప్రశ్నకు జవాబు గా చలం పురూరవ నాటకం మొత్తం నడుస్తుంది. ఊర్వశి అంటే గాఢమైన, ఊపిరాడనివ్వని అద్భుతమూ అపూర్వమూ అయిన అనుభవం. అది దేనివల్లా చెదరకుండా, స్థిరంగా స్థిమితం లోకి తీసుకువెళ్లే సాధన ఎలాగో ఊర్వశి ద్వారా పురూరవుడి కి చెప్పిస్తాడు చలం.
కాళిదాసు ఊర్వశి ఎలా ఉంటుంది?
దేవకాంత ఊర్వశి ఈ నాటకమంతా పారిజాతపూలవాన కురిపించే నందనవన దేవత. తన ప్రేమ కోసం స్వర్గాన్నే వదిలి భూమి మీద ఉండిపోతుంది. తన ప్రియుడు ఎడబాటు సహించలేక కొడుకును కూడా దూరంగా ఆశ్రమంలో ఉంచుతుంది. సాధారణంగా మాతృత్వమనే బలీయమైన సహజాతాన్ని ప్రేమ కోసం జయించిన ఊర్వశి కథ ఇవాళ చర్చ కు పెట్టవలసిన కథే.
భారతీయ సాహిత్యం లో మొదటి ప్రేమలేఖ రాసిన స్త్రీ కూడా కాళిదాసు విక్రమోర్వశీయం నాటకం లోని ఊర్వశే. అది విక్రముడి లేఖకు జవాబు కాదు. మొదటగా తనే రాస్తుంది. తర్వాత రాసిన శాకుంతలం నాటకంలో శకుంతల కూడా ప్రేమలేఖ రాస్తుంది. చరిత్రలో ఇది రెండవ ప్రేమలేఖ కావచ్చు. దాన్నే వి. శాంతారాం తన స్త్రీ సినిమాలో ఎందరికో ప్రాణమైన 'నిర్దయీప్రియతమ్' పాటగా మార్చేరు. ఈ లేఖలు రెండూ చదవాలంటే ఊర్వశి పుస్తకం చదవాల్సిందే.
ఇప్పుడు ఊర్వశి కథ అవసరం ఏమిటి?
గొప్ప ప్రేమ కథలు ఎప్పటికీ అవసరమే. అదికాక మనం మన ప్రాచీన సాహిత్యాన్ని తర్వాతి తరాలకు ఏదో ఒకరూపంలో అందించాల్సిన బాధ్యత రచయితల మీద ఉంది. ముందు ఇలాంటి సరళమైన భాషలో అందితే జిజ్ఞాసువులు సంస్కృత మూలాలు వెతుక్కొని చదువుకోవచ్చు. ఇది అనల్ప వారి ఆశయం.
ఇది నాటకానికి నవలా రూపం. ఇందులో నా స్వంత భావాలు, ఆలోచనలు, మాటలూ కూడా ఎక్కడా రానివ్వలేదు. కాళిదాసు శ్లోకాలు కూడా సరళవచనం లోకి మార్చేను. నాటకాన్ని యధాతధంగా మా మాష్టారు మల్లంపల్లి శరభయ్యగారు అనువాదం చేసి ఉన్నారు. కాళిదాసు తెలుగులో రాసినట్టు ఉంటుంది. సంస్కృతనాటకమే కాకుండా దాన్ని కూడా ఆధారంగా పెట్టుకుని ఈ ఊర్వశి రాసాను. నేను సంస్కృతం చదువుకున్నాను కానీ క్లాస్ లో పాఠం చెప్పలేదు. సంస్కృతం నుంచి నేను ఇంతవరకూ ఏ అనువాదమా చెయ్యలేదు. ఇదే మొదటిది. దీని ప్రశంస అంతా అనల్ప బలరాం గారికే చెందుతుంది. కాళిదాసు మేఘసందేశం కావ్యాన్ని కూడా ఇలా నవలగా తెచ్చే ఆలోచన ఉంది.
- శ్రీశాంతి మెహెర్.