Hyderabad Book Fair : నా జ్ఞాపకాలకు, నా జ్ఞానాన్ని కలిపి యెర్రగబ్బిలాలుగా చేసి.. !
ABN , First Publish Date - 2022-12-28T13:09:39+05:30 IST
నవలలా పూర్తిగా పరిణితి చెందినది అనుకున్న దాకా ప్రయోగాలు చేసి ఇదిగో, ఇప్పటికీ తృప్తి పడ్డాను.
ప్రకాశం జిల్లా మారుమూల గ్రామం కందులూరు నుంచి వచ్చిన ఇండ్ల చంద్రశేఖర్ 'నేను నాన్న బిర్యాని', 'సుమలత కాదు సుహాసిని', 'పచ్చాకు సీజన్', 'దేహ యాత్ర' వంటి మంచి కథలతో విశేషంగా పాఠకుల మెప్పు పొందారు. వృత్తిరీత్యా థియేటర్ ఆర్ట్స్ లెక్చరర్ అయిన ఇండ్ల చంద్రశేఖర్ స్వయంగా రచించి, దర్శకత్వం వహించిన 'మిస్ మీనా' నాటకం తెలుగునాట వందకు పైగా ప్రదర్శనలు జరుపుకొని ప్రేక్షకులను ఆకట్టుకుంది. గతంలో తన కథల సంకలనం 'రంగుల చీకటి' అనే కథా సంకలనాన్ని తెచ్చిన ఇండ్ల చంద్ర శేఖర్ ఇటీవలే 'యెర్ర గబ్బిలాల వేట' అన్న నవలను ప్రచురించారు. మేజికల్ రియలిజం శైలి కథనంతో నడిచే ఈ నవల తన పూర్వీకులను వెతుక్కుంటూ సాగే ఒక యువకుడి ప్రయాణాన్ని వర్ణిస్తూ ఆసక్తికరంగా సాగుతుంది.
1. "యెర్ర గబ్బిలాల వేట" పుస్తకాన్ని పరిచయం చేయండి?
కథగా రాద్దామని ప్రాంభించిన ఈ యెర్రగబ్బిలాల వేట నవలగా మారడంలో, నేను చూసిన, విన్న, చదివిన జీవితం లోంచి వచ్చిన ప్రశ్నలు ప్రధానపాత్ర వహించాయి. అసలు చీకట్లో ఏముంటుంది? అర్ధరాత్రి అడవి మధ్యలో చీకట్లో కూర్చొని కళ్ళు తెరిచి చూస్తే ఏమి కనపడుతుంది? ఈ జీవితం ఇలాగే ఎందుకు వుంది? ఇంకోలా జరిగుంటే ఏమైవుండేది? వీళ్ళు ఇలా ఎందుకు వున్నారు? వీళ్ళ పూర్వీకులు ఏమి చేస్తూ వుండే వాళ్ళు? వాళ్ళ జీవితాలకు మన జీవితాలకు వున్న తేడా ఏంది? వాళ్ళకు కష్టమొస్తే ఎలా స్పందించారు? వాళ్ళకు ఎలాంటి కష్టాలు వచ్చి వుంటాయి?... ఇలాంటి ప్రశ్నలు వేసుకున్న నా నవలలోని పాత్రలు కొన్ని నన్ను దాటి, నా కథను దాటి, నేను నివసిస్తున్న ప్రదేశాన్ని దాటి, వూర్లు, తెగలు, రాజ్యాలు దాటి ఈ యెర్రగబ్బిలాల వేటను ప్రారంభించాయి. వాళ్ళ వెనుక నడుస్తూ, వాళ్ళు నాకిచ్చిన ఆధారాలను, అందించిన అనుబంధాలను, ఆశలను, ఆత్మీయతను, అదృశ్యమవుతున్న ఆనవాళ్లను, అన్యాయానికి గురవుతున్న తెగలను కళ్ళనీళ్లతో చూస్తూ, బ్రతుకు పోరాటాలను అనుభవిస్తూ, వారు నాకిచ్చిన సమాచారాన్ని ఆత్రుతగా అందుకుంటూ అక్షరాలుగా మలచి ఈ నవలను పూర్తి చేశాను.
ఈ నవల, నాలో దాగున్న ఒక నిజాన్నో ఒక భయాన్నో ఒక అవమానాన్నో ఒక అనుమానాన్నో ఒక ప్రయత్నాన్నో కొన్ని పరిస్థితుల్నో నాలో వున్న కళకు, కలలకు జతగట్టి రాయబడ్డ నవల. పాత్రలు ప్రాంతాలు, ఇల్లు ఇలాఖాలు నా సృష్టి. కొత్తదనాన్ని సృష్టించడంలో ఆనందాన్ని అనుభవించాను నవల రాస్తునంతసేపు.
2. మీ రచన వెనుక వున్న కారణాలను, పరిస్థితులను వివరించండి?
ఎపుడో, ఎక్కడో, ఏదో ఒక రోజు ఒక ఆలోచనో, ఒక కలో, విన్న సంగతో, ఒక మనిషి జీవితమో, ఒక ఆచారమో, ఒక గుడ్డినమ్మకమో, గుండెదైర్యమో మెదడులో ఏదో ఒక మూలన గోల చేయకుండా గడ్డకట్టుకపోయి వుంటాయి. నేను రాయేబోయే ప్రతి కథకి అలాంటి గడ్డ కట్టుకపోయిన సంఘటనలన్నీ ఆడిషన్స్ ఇస్తున్నట్టుగా నా ముందుకు వస్తాయి, నన్ను తీసుకో నన్ను తీసుకో అని. ఒకటి రెండు వుపయోగపడతాయి ప్రతి కథకి. మిగిలినవన్నీ మళ్ళీ మూలకెళతాయి. కొన్ని సంఘటనలు, రాస్తున్న కథకు దూరంగా నుంచోని మన వైపే చూస్తూ మనం దాని వైపు కథను తీసుకెళ్ళేలా కవ్విస్తూ వుంటాయి. అనుకున్న కథలో అనుకోకుండా చేరి మార్గం మరల్చి చేరాల్సిన ప్రదేశాన్ని అనుకోని దారి ద్వారా తీసుకెళ్తాయి. ఆ ప్రయాణంలో నేను ఒక్కోసారి కథ రాస్తాను, ఒక్కోసారి కథ నా చేత రాయించబడుతుంది. కథ నన్ను రాస్తుంది. అదిగో అలా నన్ను రాసిన నవల ఈ యెర్రగబ్బిలాల వేట. ఇది కొన్ని సంవత్సరాలు నాతోనే వుండి నాతోనే పెరిగిన కొన్ని ఆలోచనలకు ఆకారం.
ఇంతవరకు నిజజీవితం లో నేను చూసిన, నా చుట్టూ జరిగిన సంఘటనలే నా కథావస్తువులు. కానీ ఈ నవల లోని జీవితం నాకు తెలిసింది కాదు నేను అనుభవించింది కాదు, నేను ఒక పాత్రను సృస్టించవలసి వస్తే మహా అయితే నేను కేవలం మా తాతను మాత్రమే ఆవాహన చేసుకోగలను, ఇంకొంచెం ముందుకు పోతే ఆయన మాటలు వినగలను. ఆయన జీవించిన కాలాన్ని వూహించగలను, దాన్ని రాయగలను. కానీ ఈ నవల మా ముత్తాతల, ఆయనకు ముందు తరాలలోకి దూకడానికి నన్ను ప్రేరేపించింది. కళ్ళు మూసుకొని కలలు కంటూ ఆ తరంలోకి నేను ప్రవేశించాను. అప్పటి మనుషులను వారి మనస్తత్వాలను, ప్రాంతాలను వారి ప్రాంతీయతను, జీవన సౌందర్యాన్ని పీడితుల దౌర్జన్యాన్ని, కలిసున్న కుటుంబాలని కలగాపులగం అవుతున్న తెగలను చూశాను, వాళ్ళతో సంవత్సరం పైగా గడిపాను. అక్కడ కనిపించాయి నాకు యెర్రగబ్బిలాలు. కళ్ళు తెరిచి నా జ్ఞాపకాలకు నా జ్ఞానాన్ని కలిపి యెర్రగబ్బిలాలను బయటకు వదులుతున్నాను.
3. ఇప్పటి వరకూ ఈ పుస్తకం చదివినవారి స్పందన ఎలా ఉంది?
ఈ నవల రాసి ఒకటిన్నర సంవత్సరం దాటింది. రాశాను కదా అని వాటిని వెంటనే పబ్లిషర్ కి పంపలేదు. వాటికి చాలా పరీక్షలు పెట్టాను, ఈ నవల విషయంలో నాకు నేను చాలా పరీక్షలు పెట్టుకున్నాను. నేను చెప్పాలనుకున్న జీవితం నవలలా పూర్తిగా పరిణితి చెందినది అనుకున్న దాకా ప్రయోగాలు చేసి ఇదిగో, ఇప్పటికీ తృప్తి పడ్డాను. కాబట్టి బయటకు వదులుతున్నాను. కొందరు ఈ నవల చదివి కళ్ళు పెద్దవి చేసుకున్నారు, కొందరు కళ్ళు గట్టిగా నొక్కి పట్టి ఆలోచనల్లోకి వెళ్ళిపోయారు. కొందరు కొండంత నమ్మకాన్ని ఇచ్చారు. ఇది నా మొదటి నవల. ఇది హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో అన్వీక్షికి స్టాల్ నెంబర్ 124 లో దొరుకుతుంది. “రంగుల చీకటి” (విశాలాంధ్ర వాళ్ళు పబ్లిష్ చేశారు) తరువాత ఇది రెండవ పుస్తకం. ఇవి రెండు అన్నీ ప్రముఖ పుస్తక కేంద్రాల్లో లభిస్తాయి. అమెజాన్ ద్వారా కూడా ఆర్డర్ చెయ్యవచ్చు, లేదా పుస్తకాల కోసం నేరుగా నన్ను కూడా సంప్రదించవచ్చు.
ఏది ఏమైననప్పటికి నా యెర్రగబ్బిలాలు స్వేచ్ఛగా ఈ సాహితీ లోకంలో ఎగురుతాయో, మహావృక్షాల్లా మొలిచిన నవల్ల మధ్య ఇరుక్కొని పైకి ఎగరలేక కుచించుకుపోతాయో చూడాలని నేను చాలా ఆత్రుతతో వున్నాను.
-శ్రీశాంతి మెహెర్