Hyderabad Book Fair : యువత పుస్తకాలను చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంది..!
ABN , First Publish Date - 2022-12-28T20:49:10+05:30 IST
పుస్తకం మన చేతిలో ఉంటే విశ్వం అంతా మన చేతిలో ఉన్నట్టే..
తెలంగాణ బుక్ ట్రస్ట్ ను సందర్శించిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ గ్రహిత కవి కె.శివరెడ్డి, ప్రజా వాగ్గేయకారుడు జయరాజ్,అరుణోదయ విమలక్క, విజ్జాన దర్శిని రమేష్, అలిశేట్టి ప్రభాకర్ కుమారుడు సంగ్రామ్ కవి యాకుబ్ లు హైకోర్టు న్యాయవాది వనజ పాల్గొన్నారు. తెలంగాణా గవర్నమెంట్ వచ్చాకా బుక్ ఫెయిర్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారని ప్రజా వాగ్గేయకారుడు జయరాజ్ తెలిపారు.
ఆహారం శరీరానికి బలాన్ని ఇస్తే, పుస్తక పఠనం అనేది మెదడుకు బలాన్ని అందిస్తుందన్నారు.. ఏ రోజైతే జ్ఞానం మెదడుకు అందదో ఆరోజున మెదడు పనిచేయడమే ఆగిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పుస్తకాల జ్ఞానాన్ని అందించడంలో తెలంగాణా బుక్ ట్రస్ట్ తమ వంతు కృషిచేస్తుందని తెలిపారు. మోహన్ బాబుతో సహా ఎందరో ఇందుకోసం కృషి చేస్తున్నారు. ఈ బుక్ స్టాల్ లో నేచర్ మీద నేను రాసిన అవని పుస్తకం కూడా ఇక్కడ మీకు లభిస్తుంది.
అరుణోదయ విమలక్క మాట్లాడుతూ హైదరాబాద్ బుక్ ఫెయిర్ పుస్తకాల సందడితో నిండిపోయింది. ఇదో విజ్ఞాన గని అని విమలక్క అన్నారు. పుస్తకం మన చేతిలో ఉంటే విశ్వం అంతా మన చేతిలో ఉన్నట్టే..మన నుంచి దేనినైనా దొంగిలించవచ్చేమో గానీ మనలో ఉన్న విజ్ఞానాన్ని ఎవరూ దొంగించలేరు. ఈ తెలంగాణా బుక్ స్టాల్ లో ఇప్పటివరకూ వచ్చిన తెలంగాణ చరిత్ర, సాహిత్యం, సంస్కృతి మీద పుస్తకాలన్నీ ఇక్కడే పొందుపరచబడ్డాయి. ఫోన్ లోకంలో చిక్కుకుపోకుండా ముఖ్యంగా యువత పుస్తకాలను చదవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.