Hyderabad Book Festival : దుమ్ముకొట్టుకుపోయిన పుస్తకాలు వెతుకుతుంటే...
ABN , First Publish Date - 2022-12-26T15:11:03+05:30 IST
జీవితానుభవాలు చోటుచేసుకోకుండా కవిత్వం సృజన రాణించదు.
దేశరాజు కవిత్వానికి దిగంతాల లోతులు తెలుసు, వేడెక్కి కరిగిపోతున్న వేదన వెంట అతని కవిత్వం పరుగుపెడుతుంది. అతని కథల్లోనూ అదే పదును కనిపిస్తుంది. తనలోని భావ సంఘర్షణ, తనదైన శైలి పాఠకుడిని పుస్తకంలో లీనమయ్యేట్టు చేస్తుంది. బుక్ ఫెయిర్ సందర్భంగా ఆంధ్రజ్యోతి వెబ్ తో దేశరాజు ఆత్మీయ సంభాషణ..
1. సాహిత్యం వేపు ప్రయాణం గురించి చెప్పండి. కవితలు, కథలు కలిపి ఇప్పటి వరకూ ఎన్ని పుస్తకాలు వచ్చాయి?
మాది మామూలు మధ్య తరగతి కుటుంబమే. అమ్మగారి వైపు, నాన్నగారి వైపు బంధువుల్లో చాలామంది కథలు, నవలలు చదివేవారు. రేడియోలో వచ్చే నాటకాలు తప్పకుండా వినేవారు. నాన్నగారి సొంత ఊరు తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం. ఉద్యోగరీత్యా శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువకాలం పనిచేశారు. నేను ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు శ్రీకాకుళంలోనే చదువుకున్నా. అక్కడి సామాజిక, సాహిత్య వాతావరణాలు నన్ను రచయితగా మార్చాయి.
నా మొదటి కవితా సంకలనం ‘ఒకే ఒక్క సామూహిక స్వప్నావిష్కరణ’ 2000 సంత్సరంలో వెలువడింది. తరువాత వ్యక్తిగత జీవితంలో బిజీ అయిపోయి పుస్తకం తీసుకురాలేదు. కానీ, కవిత్వం రాస్తూనే వున్నా. అలా రాసిన కవిత్వం అంతా 2019లో ‘దుర్గాపురం రోడ్’గా వెలువడింది. 2021లో ‘బ్రేకింగ్ న్యూస్’ పేరిట తొలి కథా సంపుటి వెలువడింది. ఈ ఏడాది రెండో కథా సంపుటి ‘షేమ్.. షేమ్.. పప్పీ షేమ్!’ వచ్చింది.
2. కవిత్వం నుంచి కథ వైపు దృష్టిసారించడానికి కారణం ఏమిటి?
అసలు మొదట్లో నేను కథకుడినే. నా మొదటి కథ ‘వాన ముద్దు’ ఆంధ్రజ్యోతి వీక్లీలో 1991లోనే అచ్చయ్యింది. 1992లో ‘అన్నయ్య రావాలి’ అనే కథ ఆంధ్రజ్యోతిలో ఈవారం కథగా వచ్చింది. తరువాత కవిత్వంపై ఆసక్తి ఎక్కువ కావడం, అది నా స్వభావానికి చేరువగా వుండటం వలన పూర్తిగా కవిత్వంపైనే శ్రద్ధ పెట్టా. హైదరాబాద్ హడావిడి నగర జీవితంలో కథపై దృష్టిపెట్టే సమయం దొరకలేదు. అయినా, అప్పుడప్పుడు ఒకటీ అరా కథలు రాస్తూనే వున్నా. అయితే, కరోనా సమయంలో ఎక్కువ సమయం చిక్కడంతో కథల చిక్కుముడి విప్పడం ప్రారంభించా. మిత్రులు, సాహితీ ప్రియుల ప్రోత్సాహంతో విరివిగా కథలు రాస్తున్నా.
3. కవిత్వం, కథ రెండు ప్రక్రియల్లో మీకు ఏది ఇష్టం?
కవిత్వం, కథ, విమర్శ-ఎందులోనైనా దేనికి వుండే కష్టం దానికి వుంటుంది. నా వరకూ అయితే కవిత్వం హృదయ సంబంధమైతే, కథ బుద్ధికి సంబంధించినది. నాకు కవిత్వమంటేనే ఎక్కువ ఇష్టం. ఇక విమర్శ విషయానికి వస్తే.. ఆ వైపుగా నేనేమీ పెద్దగా కృషి చేయలేదు. మంచి పుస్తకాలు ఏమేమి అందుబాటులో వున్నాయో పాఠకులకు తెలియజేయడం కోసమే సమీక్షలు రాశా. ఆయా పుస్తకాలపై నా అభిప్రాయాలతోపాటు, పరిశీలనలు కూడా జోడించడంతో వాటిలోని కొత్త కోణాలు ఆవిష్కృతమై ఆలోచనలు రేకెత్తించి వుండవచ్చు.
4. నచ్చిన రచయితలు ఎవరు? నచ్చిన పుస్తకం ఏది?
ప్రత్యేకంగా ఒక్కరనో, ఇద్దరనో చెప్పలేను. చాలామంది రచయితల రచనలంటే ఇష్టం. పుస్తకం అయితే ‘త్రిపుర కథలు’ చాలా చాలా ఇష్టం. ఎందుకంటే, త్రిపుర గారి గురించి తెలిసాక ఆయన కథలు చదవాలని ప్రయత్నిస్తే ఎక్కడా పుస్తకం దొరకలేదు. ఆ పుస్తకాన్ని ప్రచురించిన అత్తలూరి నరసింహారావుగారి దగ్గర కూడా కాపీలు లేవు. ఆఖరికి త్రిపుర గారిని కలిస్తే ఆయనా లేవన్నారు. అనుకోకుండా ఒక రోజు స్థానిక లైబ్రరీలో దేనికోసమో దుమ్ముకొట్టుకుపోయిన పుస్తకాలు వెతుకుతుంటే ‘త్రిపుర కథలు’ పుస్తకం కనిపించింది. వెంటనే దాన్ని షర్ట్ లోపల పెట్టేసుకుని తీసుకువచ్చేశా. తర్వాత ఆ కథలు చదువుతుంటే అందులోని మొదటి కథ ‘పాము’లో ఛాసర్ మీద లెగూయీ రాసిన పుస్తకాన్ని నాలాగే కోటు చాటున దాచి లైబ్రరీ నుంచి తీసుకు వచ్చి, ఉమాకి ఇస్తాడు శేషాచలపతి రావ్. అలా ఆ పుస్తకం మీద ప్రత్యేక ఇష్టం.
5. మానసిక సంఘర్షణలలోనుంచి పుట్టిన కవిత్వం బలంగా ఉంటుందా లేక సంఘటలలోనుంచి పుట్టిన కవిత్వానికి పదును ఎక్కువగా ఉంటుందా?
బలం, పదును వేర్వేరు. మానసిక సంఘర్షణ లోంచి పుట్టిన కవిత్వమే బలంగా వుంటుంది. అది హృదయాలను కూడా తాకుతుంది. సంఘటనల్లోంచి పుట్టిన కవిత్వానికి పదును వుండి తీరాలి. ఎందుకంటే, ఆ పదును లేకపోతే ఆ సంఘటన కలిగించాల్సిన భావోద్వేగాన్ని అందివ్వలేదు. కవికి వ్యక్తిగత జీవితం, సామాజిక జీవితం రెండూ వుంటాయి కాబట్టి.. నా కవిత్వంలో రెండు తరహా కవితలూ ఉన్నాయి, ఉంటాయి.
6. దేశరాజు కవిత్వంలో నిజ జీవిత పాళ్ళెంత?
ఎంతోకొంత జీవితానుభవాలు చోటుచేసుకోకుండా కవిత్వం సృజన రాణించదు. వ్యక్తిగత అనుభవానికి ఊహ జతకడితేనే కవిత్వం పండుతుంది.
7 .ఈ బుక్ ఫెయిర్ లో మీ పుస్తకాలు ఏం ఉండబోతున్నాయి?
నా కవితా సంకలనం ‘దుర్గాపురం రోడ్’ (వెల: రూ.50), నా మొదటి కథా సంపుటి ‘బ్రేకింగ్ న్యూస్’ (వెల: రూ.100), నా కథా సంపుటి ‘షేమ్.. షేమ్.. పప్పీ షేమ్!’ (వెల: రూ.100) హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లోని ఛాయా స్టాల్ నెం. 159తో పాటు మరికొన్ని స్టాల్స్ లో కూడా అందుబాటులో వుంటాయి.
-శ్రీశాంతి మెహెర్.