Life After Death: కోట్లు ఖర్చు పెట్టి మరీ శవాలను దాచేస్తున్నారు.. చనిపోయిన వాళ్లను భవిష్యత్తులో బ్రతికించొచ్చట..
ABN , First Publish Date - 2022-12-01T11:54:05+05:30 IST
ఇలా చేస్తే చనిపోయినవారు మళ్ళీ తిరిగి బ్రతకచ్చట..
ఈజిప్ట్ మమ్మీల గురించి వినే ఉంటారు. నాటికాలం ఈజిప్టు పాలకులు చనిపోతే వారి మృతదేహానికి ఔషదాలు పూత పూసి జాగ్రత్తగా ప్యాక్ చేసి వారి మృతదేహాన్ని రసాయనాల మధ్య ఉంచి పెట్టెల్లో భద్రపరిచేవారు. వారు మళ్ళీ తిరిగి బ్రతుకుతారని వారి నమ్మకం. ఇప్పుడు మళ్ళీ అదే నమ్మకం ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నట్టుంది. అసలు విషయంలోకి వెళితే..
కోల్కతాలో జేమ్స్ లాంగ్ సరనీ కాలనీ లో నివసించే సుభభ్రత మంజుదార్ అనే మహిళ 2018 సంవత్సరంలో చనిపోయింది. అయితే ఆమె మృతదేహాన్ని ఖననం చేయకుండా ఆమె కొడుకు క్రయోనిక్స్ పద్దతిలో ఆమె మృతదేహాన్ని భద్రపరచాలని నిర్ణయించుకున్నాడు. దీనివల్ల ఆమె మళ్ళీ బ్రతుకుతుందనే నమ్మకం అతనిది. కేవలం అతను మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా సుమారు 600 మృతదేహాలను ఈ పద్దతిలో భద్రపరిచారట. అసలు చనిపోయిన వారిని తిరిగి బ్రతికించడం సాధ్యమేనా అనే ప్రశ్న అందరినీ చెదపురుగులా తొలిచేస్తోందిప్పుడు.
క్రయోనిక్స్ అంటే ఏమిటి..?
ఒక మనిషి చనిపోగానే ఆ శరీరాన్ని కొన్ని సంవత్సరాల పాటు భద్రపరచడాన్ని క్రయోనిక్స్ అని అంటారు. దీన్ని ఆరు దశలలో నిర్వహిస్తారు. క్రయోనిక్స్ కు ప్రత్యేక నిపుణులు ఉంటారు. మొదటి దశలో డాక్టర్ల పర్యవేక్షణలోకి మృతదేహాన్ని తీసుకెళ్తారు. రెండవ దశలో డాక్టర్ లు మృతదేహాలకు ఆక్సిజన్, రక్తం సరఫరా అయ్యేలా చేస్తారు. ఇలా చేయడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తారు. దీని తరువాత మూడవ దశలో శరీరాన్ని మంచులో భద్రపరుస్తారు. మనిషి శరీరంలో సాధారణంగా 35 నుండి 40 లీటర్ల నీరు ఉంటుంది. ఆ నీటిని శరీరంలో నుండి తొలగించి దాని స్థానంలో గ్లిసరాల్ తో తయారైన రసాయనాన్ని నాలుగవ దశలో నింపుతారు. అయిదవ దశలో ఈ శరీరాన్ని -130డిగ్రీల సెల్సియస్ దగ్గర చల్లబరిచి అదే ఉష్ణోగ్రత వద్ద దాన్ని ఉంచుతారు. దీని తరువాత ఆరవ దశలో నత్రజనితో నిండిన కంటైనర్ లో శరీరాన్ని తలక్రిందులుగా ఉంచుతారు. ఇలా చేయడం వల్ల నత్రజని కంటైనర్ లీక్ అయినా శరీరం తలక్రిందులు ఉంటుంది కాబట్టి శరీరంలో ముఖ్యమైన భాగమైన మెదడుకు రక్తప్రసరణ సజావుగా జరుగుతుంది.
నిజంగానే ఈ పద్దతి వల్ల శరీరం సురక్షితంగా ఉంటుందా దీనికి ఎంత ఖర్చవుతుంది వంటి వివరాల్లోకి వెళితే..
ఈ క్రయోనిక్స్ పద్దతిలో శరీరాన్ని భద్రపరచడానికి 2లక్షల అమెరికన్ డాలర్లు ఖర్చవుతాయి. భారతీయ కరెన్సీలో చెప్పాలంటే 1.60కోట్లు. ఇంత ఖర్చుపెట్టిన తరువాత ఇది సురక్షితంగా ఉండకపోవడం అంటుూ ఉండదని నిపుణులు చెబుతున్నారు. క్రయోనిక్స్ పద్దతిలో శరీరాన్ని భద్రపరచడానికి సంవత్సరానికి 705 అమెరికన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో 52,874రుపాయలు ఖర్చవుతాయట. అదే శరీరం మొత్తాన్ని కాకుండా కేవలం మెదడును మాత్రమే భద్రపరచాలని అనుకుంటే దానికి 65లక్షల రుపాయలు ఖర్చవుతాయట.
అయితే భారతదేశంలో ఈ పద్దతిలో మృతదేహాలను భద్రపరచడానికి ప్రభుత్వ అనుమతి దొరకడం చాలా కష్టమని చెబుతున్నారు. 2016 సంవత్సరంలో ఇంగ్లాండ్ దేశానికి చెందిన 14 సంవత్సరాల అమ్మాయి క్యాన్సర్ తో మరణించింది. ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించి తమ కూతురిని క్రయోనిక్స్ పద్దతిలో భద్రపరిచేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది. లండన్ కోర్టువారు సానుకూలంగా స్పందిస్తూ మృతదేహాన్ని 100సంవత్సరాల పాటు భద్రపరచవచ్చని తీర్పు ఇచ్చింది.
ఈ పద్దతిలో మృతదేహాన్నిభద్రపరచడం అనేది ఎప్పట్నుంచో ఉన్నదే..
1965 సంవత్సరంలో లైఫ్ ఎక్స్టెన్షన్ సొసైటీ వారు మరణించన తరువాత మృతదేహాన్ని భద్రపరచవచ్చని ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సంస్థ మరణించిన తరువాత తిరిగి బ్రతకడం అనే విషయం గురించి పరిశోధనలు చేసేది. వీరి ప్రకటన చూసిన జేమ్స్ బెడ్ఫోర్డ్ అనే అమెరికన్ ప్రొఫెసర్ వారిని ఆశ్రయించాడు. అతను కిడ్నీ క్యాన్సర్ తో బాధపడేవాడు. ఎంత ప్రయత్నించినా వైద్యులు అతనికి నయం చేయలేకపోయారు. ఈ నేపధ్యంలో అతను తన ఆస్థిని అమ్మేసి సామాజిక సేవా కార్యక్రమాలకు ఖర్చుచేసి తన శరీరాన్ని క్రయోనిక్స్ పద్దతిలో భద్రపరచమని అడిగాడు. అందుకు లైఫ్ ఎక్స్టెన్షన్ సంస్థ వారు ఒప్పుకోవడంతో 1967సంవత్సరంలో ఆయన శరీరాన్ని భద్రపరిచారు. ఇప్పటికీ ఆయనే మృతదేహం సురక్షితంగా ఉందట. అయితే ఈ పద్దతి ద్వారా మనిషి తిరిగి బ్రతకడం 100 సంవత్సరాలలో సాధ్యం కాకపోయినా కనీసం 1000 సంవత్సరాల తరువాత అయినా కచ్చితంగా సాధ్యమేనని శాస్త్రవేత్తలు అభిప్రాయ పడుతున్నారు. ఆ సమయం కోసం ప్రపంచం ఎదురుచూస్తోంది ఇప్పుడు.