Tamil Nadu: ప్రాణం మీదకు తెచ్చిన జ్యోతిష్యుడి సలహా.. పాముతో పెట్టుకుని నాలుక కోల్పోయిన రైతు!
ABN , First Publish Date - 2022-11-26T20:07:30+05:30 IST
జ్యోతిష్యుడి సలహా పాటించిన ఓ వ్యక్తి ఏకంగా తన నాలుకను కోల్పోయాడు. పాము కాటుకు గురై తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో ఈ ఆశ్చర్యకర ఘటన జరిగింది.
జ్యోతిష్యుడి సలహా పాటించిన ఓ వ్యక్తి ఏకంగా తన నాలుకను (Man loses tongue due to snake bite) కోల్పోయాడు. పాము కాటుకు గురై తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. తమిళనాడులోని (Tamil Nadu) ఈరోడ్ జిల్లాలో ఈ ఆశ్చర్యకర ఘటన జరిగింది. ఈరోడ్ జిల్లాలోని కోపిశెట్టిపాళయంకు చెందిన 54 ఏళ్ల రాజా వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొన్ని రోజులుగా పాము కాటుకు గురైనట్టుగా అతడికి తరచుగా కలలు వస్తున్నాయి. దీంతో రాజా ఒక జ్యోతిష్యుడ్ని (Astrologer) కలిసి తన కల గురించి చెప్పి పరిష్కారం సూచించాలని అడిగాడు.
రాజా చెప్పింది విన్న జ్యోతిష్యుడు నాగాలయానికి వెళ్లి పూజాలు చేయాలని సూచించాడు. పూజ పూర్తయిన తర్వాత పాము ముందు మూడు సార్లు నాలుకను బయట పెట్టాలని చెప్పాడు. జ్యోతిష్యుడి సలహా మేరకు రాజా నాగాలయానికి వెళ్లి వెళ్లి పూజలు చేశాడు. ప్రత్యేకంగా ఓ పామును కూడా తీసుకెళ్లి పూజ చివర్లో దాని ముందు తన నాలుకను మూడు సార్లు బయటకు చాచాడు. ఆ విష సర్పం రాజా నాలుకపై కాటు వేసింది. దీంతో రాజా వెంటనే కింద పడిపోయాడు. అక్కడే ఉన్న పూజారి రాజాను గమనించి వెంటనే రాజా నాలుకను కత్తితో కోశాడు. దీంతో విషం రాజా శరీరంలోకి వ్యాపించలేదు.
అనంతరం రాజాను ఈరోడ్ మానియన్ మెడికల్ సెంటర్‌కు తీసుకెళ్లాడు. విషయం తెలుసుకున్న వైద్యులు తెగిన రాజా నాలుకకు కుట్లు వేశారు. అలాగే విషానికి విరుగుడు ఇంజక్షన్ కూడా ఇచ్చారు. మొత్తానికి జ్యోతిష్యుడి సలహా పాటించిన ఆ రైతు తన నాలుకను కోల్పోయాడు.