Railway Passenger: ‘అపరిచితుడు’ సినిమా సీన్ రిపీట్.. కానీ ఈ ఘటనలో ఏం జరిగిందంటే..
ABN , First Publish Date - 2022-12-03T17:26:16+05:30 IST
భారత్‌లో ఒక అతిపెద్ద నెట్‌వర్క్ ఇండియన్ రైల్వేస్ (Indian Railways). 2016-17 గణాంకాల ప్రకారం భారతీయ రైల్వేలో దాదాపు 13 లక్షల మందికి పైగా పనిచేస్తున్నారు. దూర ప్రయాణాలకు..
భారత్‌లో ఒక అతిపెద్ద నెట్‌వర్క్ ఇండియన్ రైల్వేస్ (Indian Railways). 2016-17 గణాంకాల ప్రకారం భారతీయ రైల్వేలో దాదాపు 13 లక్షల మందికి పైగా పనిచేస్తున్నారు. దూర ప్రయాణాలకు మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా రైళ్లనే ఎంచుకుంటుంటారు. అలాంటి రైల్వేపై ప్రయాణికులకు సక్రమంగా సేవలందించే విషయంలో ఎప్పుడూ విమర్శలు వస్తూనే ఉండటం గమనార్హం. రైళ్లలో ప్రయాణికులకు అందించే భోజనం విషయంలో, టాయిలెట్ల శుభ్రత విషయంలో ఎప్పుడూ ఫిర్యాదులు అందుతూనే ఉంటాయి. తాజాగా.. అలాంటి ఒక ఫిర్యాదు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. భారతీయ రైల్వే సేవలను నిలదీసే విధంగా ఆ ట్వీట్ ఉండటం గమనార్హం. ప్రన్షూ అనే ఒక ప్రయాణికుడు రైల్వేలో రిజర్వేషన్ చేసుకుని ప్రయాణం చేశాడు.
PNR-2513578206, Trn:02570.. ఈ రైలులో టికెట్ బుక్ చేసుకుని ప్రయాణం చేసిన ప్రన్షూకు చేదు అనుభవం ఎదురైంది. బెడ్‌షీట్, పిల్లో కవర్ ఏమాత్రం శుభ్రంగా లేవని.. వీటిని శుభ్రం చేయకుండా పేపర్ బ్యాగ్‌లో ప్యాక్ చేసి తదుపరి ప్రయాణికుడికి అందుబాటులో ఉంచారని ఆ ఫొటోలతో సహా ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. తనతో పాటు అదే బెర్త్‌లో ప్రయాణం చేసిన మరికొందరు ప్రయాణికుల బెడ్‌షీట్లపై వెంట్రుకలు ఉన్నాయని, బెడ్‌షీట్లు దుర్వాసన వచ్చాయని వాపోయాడు. అంతకు ముందు ఉపయోగించిన వాటిని శుభ్రం చేయకుండా ఉంచడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని వివరించాడు. టికెట్‌పై బెడ్‌షీట్లతో కలిపి మరీ అధిక ధరలు వసూలు చేసి సర్వీస్ ఏమో ఇంత అధ్వానంగా ఉంటుందని ప్రన్షూ ట్విట్టర్ సాక్షిగా పెదవి విరిచాడు. ఈ ట్వీట్‌పై భారతీయ రైల్వే స్పందించింది. రైల్వేసేవ ట్విట్టర్ వేదికగా ఆ ప్రయాణ వివరాలను (PNR/UTS No.), మొబైల్ నంబర్‌తో పాటు తమకు అందించాల్సిందిగా సదరు ప్రయాణికుడిని అడిగింది. ప్రన్షూ కూడా రైల్వే శాఖ అడిగినట్టుగా వివరాలు అందించాడు.
ఈ సందర్భంగా దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ‘అపరిచితుడు’ సినిమాలోని ఒక సన్నివేశం గుర్తుచేసుకోక తప్పదు. హీరో తన కుటుంబంతో కలిసి రైలులో ప్రయాణిస్తుండగా భోజనం బాగోలేదని, టాయిలెట్ శుభ్రంగా లేదని, ఫ్యాన్ తిరగడం లేదని ట్రైన్‌లో ఉన్న అధికారికి ఫిర్యాదు చేస్తాడు. రైల్వే అనేది అతి పెద్ద నెట్‌వర్క్ అని, లక్షల మంది ప్రయాణం చేస్తుంటారని.. అలాంటప్పుడు సర్దుకుని పోవాలని ఆ అధికారి హీరోకు హితబోధ చేస్తాడు. టికెట్‌పై భోజనం, ఇతర సదుపాయాలకు కలిపే ఇండియన్ రైల్వే ఛార్జ్ వసూలు చేస్తోందని.. అలా సర్దుకుని పోమని చెప్పే హక్కు తమకు లేదని హీరో ఎదురు వాదిస్తాడు. కానీ.. అతని వాదనకు తోటి ప్రయాణికుల నుంచే మద్దతు దొరకదు. పెద్ద నసలా ఉన్నాడని, ఆయనను దించేయండని తోటి ప్రయాణికులు ఆ అధికారికి ఉచిత సలహా ఇస్తారు. సినిమాలో మాత్రమే కాదు వాస్తవ పరిస్థితులు కూడా అందుకు ఏమాత్రం తీసిపోవు. కొన్ని రైళ్లలోని జనరల్ బోగీల్లో టాయిలెట్లు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెన్నులతో ఫ్యాన్లను తిప్పుకునే దృశ్యాలు అడపాదడపా ఇప్పటికీ రైళ్లలో కనిపిస్తూనే ఉంటాయి. అయితే.. ఒకప్పటికీ, ఇప్పటికీ తేడా ఏంటంటే.. సామాజిక మాధ్యమాల పుణ్యమా అని ప్రయాణికులు నేరుగా ఫిర్యాదు చేయగలుగుతున్నారు.