Hyderabad Book Fair: కొనేవాళ్ల కంటే వీళ్లే ఎక్కువమంది..!

ABN , First Publish Date - 2022-12-23T14:21:36+05:30 IST

ఉద్యమాల బాటలో ఇవాళ రచయితలు లేరు.

Hyderabad Book Fair: కొనేవాళ్ల కంటే  వీళ్లే ఎక్కువమంది..!
Hyderabad Book Fair

పుస్తక ప్రచురణ రంగంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ, రాబోవు తరాలకు ఎటువంటి విజ్ఞానాన్ని అందివ్వాలి, రచయితలలో రావాల్సిన మార్పుల గురించి తన అనుభవాలను ఆంధ్రజ్యోతి వెబ్ తో పంచుకున్నారు పుస్తక ప్రచురణ కర్త ఆర్. కె (పర్ స్పె క్టివ్స్). హైదరాబాద్ బుక్ ఫెయిర్ సందర్భంగా ఆయనతో జరిపిన ఆత్మీయ సంభాషణ..

1. ఇప్పుడు వస్తున్న పుస్తకాల తీరు తెన్నులు ఎలా ఉన్నాయి?

మరీ ఉధృతంగా పుస్తకాలు రావటం లేదు. వస్తున్న వాటిలో అధిక శాతం కవిత్వం. పల్చని వచనమే కవిత్వంగా వస్తూ 'వచన కవిత్వం ' పేరును సార్థకం చేస్తోంది. వివిధ సామాజిక శాస్త్రాలలో ప్రామాణిక గ్రంథాలు రావటం లేదు. తెలుగులోకి రాని అంతర్జాతీయ సాహిత్యం ఎంతో ఉంది. ఒకప్పుడు'రాదుగా' సంస్థ ద్వారా అత్యుత్తమ రష్యన్ సాహిత్యం స్వల్ప ధరల్లో అందుబాటులో ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేదు. కొనుగోలుదారుల కన్నా పాఠకుల సంఖ్యే ఎక్కువగా ఉన్న విచిత్రమైన స్థితి ఉంది. కాంప్లిమెంటరీలు , పైరసీల పట్ల మోజు పెరిగింది. రచయితల్లో ' గుర్తింపు సంక్షోభం ' అనే మందులేని మాయరోగం దాపురించింది. దీనివల్ల మార్కెట్ మీద దృష్టి పెట్టకుండా పుస్తకాలు వస్తూనే ఉన్నాయి.

2. గ్రంథాలయాల పరిస్థితి ఎలా ఉంది, తెలుగు రాయడం, చదవడం తగ్గిందంటారా?

గ్రంథాలయాలు ఆధునీకరింప బడలేదు. ఊళ్లలో శిధిలావస్థలోనే ఉన్నాయి. గత పదేళ్లలో వచ్చిన బుక్స్ లో 95% గ్రంథాలయాలు కొనుగోలు చేయలేదు.ఆ కొనుగోళ్లలో అవినీతి పెరిగింది. డ్రైనేజ్ సెస్ వసూలు చేస్తారు. బురద రోడ్ల మీద, మన ఇళ్లలోకి. లైబ్రరీ సెస్ వసూలు చేస్తారు. కొనుగోళ్ళకు అనుమతులు ఇవ్వరు. ఇక రచయితలకు భాషా జ్ఞానం కొరవడుతోంది. మాండలిక పదకోశాలు ముద్రణ ప్రభుత్వాలు చేపట్టలేదు.

3. తెలుగు భాషను నేర్పించడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల్లో ఎవరి ప్రోత్సాహం ఎక్కువ అవసరం?

పిల్లలకు పుస్తకాలు చదివే అలవాటు స్కూల్స్ లో టీచర్లు చేయాలి. అది సిలబస్ లో భాగం కావాలి. వాటిని ఇంట్లో పేరెంట్స్ చదివించాలి. స్కూల్స్ లోనూ , ఇళ్లలోనూ పిల్లల లైబ్రరీలు ఉండాలి. 98% పేరెంట్స్ సాహిత్యం చదవరు. వాళ్లింకా కూటికా గుడ్డకా అనే దగ్గరే ఉన్నారు. ఇక హోమ్ వర్క్ గా టీచర్లు పిల్లలతో పుస్తకాలు చదివించడం ఊహకందని విషయం ( టింకిల్ , అమర్ చిత్ర కథ , పంచతంత్రం , చందమామ , బాలమిత్ర ..).

4. సాహిత్యం చదివేవారు తగ్గుతున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏమిటి?

పాఠకుల సంఖ్య నిష్పత్తిలో కొనుగోళ్ళదారుల సంఖ్య పెరగలేదు. అది ఇక్కడి ప్రత్యేకత.

r.k.gif

5. కోవిడ్ అనంతరం పుస్తక ప్రచురణ రంగంలో మార్పులేమైనా గమనించారా? పోస్ట్ కోవిడ్ ప్రభావం పుస్తక ఎగ్జిబిషన్ మీద ఎలా ఉంది ?

బుక్ మార్కెట్ భయంకరంగా పడిపోయింది. సామాజిక దూరం లాంటి తప్పుడు అవగాహనలను ప్రభుత్వమే ప్రచారం చేసింది. కోవిద్ అనంతరం జరుగుతున్న రెండవ పుస్తక ప్రదర్శన ఇది. దీనితో పబ్లిషింగ్ రంగం కొంత ఊపిరి పీల్చుకుంది. పాఠకులకు డిస్కౌంట్ ఇంకా ఎక్కువ ఇవ్వాలి. బుక్ ఫెయిర్ నిర్వహణ ఇంకా మెరుగుపడాలి. టాయిలెట్ సౌకర్యాలు పెరగాలి. సీనియర్ సిటిజన్స్ కి సీటింగ్ ఏర్పాట్లు తక్కువ. బయట ఫుడ్ మార్కెట్ హైజీనిక్ తక్కువ , రేట్లు ఎక్కువ. అన్నిచోట్ల నుంచి రవాణా సౌకర్యాలు ఉండవు. లోపల 45 నిముషాల వ్యవథిలో ముగించేలా ఆవిష్కరణలకు వేదిక ఇస్తారు. సుమారు 3000/- పైనే అందుకు వసూలు చేస్తారు.

6. పాఠకుల అభిరుచిని, రచయితలు గమనిస్తున్నారా ?

రచయితలు ఈ మార్పుని గుర్తించ నిరాకరిస్తున్నారు. ఉద్యమాల బాటలో ఇవాళ రచయితలు లేరు. ఉద్యమాలు బాగా జరిగిన రోజుల్లో సభలు సమావేశాలు బాగా జరిగి పుస్తకాలు రెండేళ్లలో వెయ్యి ప్రతులు అమ్ముడయ్యేవి. ఇప్పుడంతా అవార్డుల కోసం " క్యూ " కట్టే పాడు కాలం దాపురించింది.

7. డిజిటల్ ప్రభావంతో ప్రింట్ బుక్స్ కి ఆదరణ తగ్గిందంటారా?

కేరళలోలా రచయితల , ప్రచురణ కర్తల సహకార సంఘాలు ఏర్పడాలి. వినిమయ సంస్కృతి నుంచి బయట పడాలి. పాశ్చ్యాత్త దేశాల్లో టెక్నాలజీ ఎంత పెరిగినా , ప్రింట్ బుక్స్ కి ఆదరణ తగ్గలేదు. నా విదేశీ ప్రయాణాల్లో ఇది నేను గమనించాను. అలానే ప్రభుత్వాల పైన ఒత్తిడి పెంచి గ్రంథాలయాలచే బుక్స్ కొనుగోలు చేయించాలి. దీన్నే POD - print on demand అంటున్నారు. దీని వల్ల గోడౌన్ సమస్యలుండవు. 300 కాపీల వరకు POD ఫర్వాలేదు. ముద్రణలో కొన్ని ప్రత్యేకతలుండవు. వాటికోసం మళ్ళీ అచ్చు యంత్రాల వద్దకే వెళ్ళాలి.

_ శ్రీశాంతి మెహెర్

Updated Date - 2022-12-24T12:15:16+05:30 IST