Twitter layoffs: యువకుడి ఉదంతం వైరల్..! ట్విటర్‌లో ఉద్యోగం పోయాక..
ABN , First Publish Date - 2022-11-04T18:42:49+05:30 IST
ట్విటర్‌లో ఉద్యోగం కోల్పోయినా బెంబేలు పడక.. సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతున్న యువకుడిపై ప్రశంసల వర్షం.
ఇంటర్నెట్ డెస్క్: టెస్లా అధినేత ఎలాన్ మస్క్(Elon musk) ట్విటర్‌ను కొనుగోలు చేశాక ఉద్యోగుల తొలగింపునకు(Lay offs) శ్రీకారం చుట్టారు. సంస్థను అభివృద్ధి పథంలో నడిపించేందుకు కఠిన నిర్ణయాలు తప్పవని తేల్చి చెప్పారు. సంస్థలో ఒకప్పటి ఉన్నతోద్యోగులందరినీ తొలగించిన మస్క్.. ప్రస్తుతం అన్నీ తానై ట్విటర్‌ను(Twitter) ముందుకు నడిపిస్తున్నారు. ఇక దాదాపు 7500 మంది ట్విటర్ ఉద్యోగుల్లో ముప్పావు శాతం మంది తమ ఉద్యోగాలు కోల్పోతారన్న వార్తలు.. ప్రస్తుతం సంస్థ ఉద్యోగులను హడలెత్తిస్తున్నాయి. ఇప్పటికే చాలా మందికి ఉద్వాసన పత్రాలు అందాయి. అలా ఉద్యోగం పోగొట్టుకున్న ఓ యువకుడి వార్త ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ట్విటర్‌లో ఉద్యోగం కోల్పోయిన వారెవరైనా సాధారణంగా ఒక్కసారిగా నీరుగారిపోతారు. జీవితం తలకిందులైపోయిందని బాధపడతారు. ఇప్పటికే ఉద్యోగాలు కోల్పోయిన అనేక మంది సోషల్ మీడియాలో తమ ఆవేదనను పంచుకుంటున్నారు. కానీ.. వీరందరి కంటే భిన్నంగా ఓ యువకుడు పెట్టిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ట్విటర్ పబ్లిక్ పాలసీ విభాగంలో పనిచేసిన యశ్ అగర్వాల్(Yash Agarwal).. తన ఉద్యోగం కోల్పోయాక ట్విటర్‌లో పోస్ట్ పెట్టాడు. ట్విటర్‌లో పనిచేయడం, ఆ సంస్కృతిలో ఓ భాగం కావడం తనకు దక్కిన ఓ అమూల్య అవకాశమని చెప్పుకొచ్చాడు. ట్విటర్ ఉద్యోగి అవడం తనకు దక్కిన అరుదైన గౌరవమంటూ సంస్థపై ప్రశంసలు కురిపించాడు. ఉద్యోగం పోయినా కూడా సానుకూల దృక్పథంతో అతడు చేసిన ఈ పోస్ట్, ఫొటో ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతోంది. నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది. వేలల్లో లైక్స్, కామెంట్స్ వచ్చిపడుతున్నాయి. ‘‘నీకు నా సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది. చాలా స్ఫూర్తివంతంగా వ్యవహరించావు. భవిష్యత్తులో కూడా నువ్వు అద్భుతాలు సాధిస్తావని ఆశిస్తున్నా’’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ‘‘కష్టసమయాల్లో సానుకూల ధోరణితో ముందడుగు వేసేవారు చాలా అరుదుగా మాత్రమే మనకు తారసపడతారు. నీకు అన్నింటా విజయం, సంతోషం దక్కాలని కోరుకుంటున్నా’’ అంటూ మరొకరు ట్వీట్ చేశారు. ‘‘ఉద్యోగం పోగొట్టుకున్నోళ్లు ఇంత పాజిటివ్‌గా ఉండటం నేనెప్పుడూ చూడలా.. నువ్వు నిజంగా గ్రేట్’’ అని మరొకరు వ్యాఖ్యానించారు.