Viral Video: ఈ సైనికుడికి ఎన్ని సార్లు సెల్యూట్ చేసినా తక్కువే కదా...
ABN , First Publish Date - 2022-12-27T11:07:51+05:30 IST
ఓ సైనికుడి వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్
కొన్ని రంగాలను సాధారణ వృత్తుల్లా పరిగణలోకి తీసుకోలేం. వాటిలో వృత్తిపరమైన విషయం కంటే సమాజ సేవ అధికంగా ఉంటుంది. ఆ కోవలో మొదటి వరుసలో ఉండేది దేశ రక్షణ కోసం తమ సేవలు అందించే భారతీయ సైనిక దళం. వీరు ప్రాణాలకు తెగించి మరీ మన దేశాన్ని రక్షిస్తూ ఉంటారు. ఇలా తన విధులు నిర్వర్తిస్తున్న ఓ సైనికుడి వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. దీనికి సంబంధించిన వివరాలలోకి వెళ్తే..
మేజర్ జనరల్ రాజు చౌహాన్ ట్విట్టర్ వేదికగా ఒక వీడియోను షేర్ చేసారు. ఆ వీడియోలో మంచులో నడుస్తూ తొడలలోతు మంచులో కూరుకుపోయి బయటకు రావడానికి కాస్త ఇబ్బంది పడుతున్న ఓ భారత సైనికుడు కనిపిస్తాడు. చివరకు తన తుపాకీని ఇంకొకరికి ఇచ్చి మంచులో నుండి బయటపడి తన దారిలో సాగిపోయాడు. మంచులో ఇబ్బంది పడుతున్నంత సేపు అతనిలో ఎలాంటి చిరాకు, అసహనం, బాధ లాంటివి లేవు. చిరునవ్వుతోనే అతను ఆ మంచు నుండి బయటపడ్డాడు. మేజర్ జనరల్ రాజు చౌహాన్ వీడియో షేర్ చేసి ఆ సైనికుడి ముఖంలో చిరునవ్వు చూడండి అనే వాక్యాన్ని జతచేసారు.
Read Also- కూతురు పుట్టిందని ఇతడు చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోతున్నారు..
ఈ వీడియో చూసినవారందరూ మన దేశ సైనికుల కర్తవ్య దీక్ష చాలా గొప్పదని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఉదయాన్నే చలి ఎక్కువ ఉందని కొందరు, ఎండలో ఎలా వెళ్ళడం అని కొందరు, కాస్త నలతగా అనిపించగానే పనులన్నిటినీ వదిలిపెట్టేసేవారు కొందరు.. ఇలా మన చుట్టూ చాలామంది ఉంటారు. కానీ సైనికులు మాత్రం వీటన్నిటికీ అతీతంగా తమ విధులు నిర్వర్తించాలి. దానికి ఈ సైనికుడే ఉదాహరణ అని అంటున్నారు. కూరుకుపోయే చలిలో కూడా కర్తవ్యదీక్షగా సాగుతున్న ఈ సైనికుడికి ఒక్క సెల్యూట్ సరిపోతుందా..