BCCI: గొప్ప నిర్ణయం.. ఫుల్ ఖుషీలో టీమిండియా మహిళా క్రికెటర్లు..
ABN , First Publish Date - 2022-10-27T14:03:54+05:30 IST
బీసీసీఐ (BCCI) సెక్రటరీ జై షా (Jay Shah) గురువారం నాడు కీలక ప్రకటన చేశారు. పురుష క్రికెటర్లతో (Male Cricketers) సమానంగా మహిళా క్రికెటర్లకు (Team India Women Cricketers) కూడా వేతనాలు (Match Fees) చెల్లించాలని..
బీసీసీఐ (BCCI) సెక్రటరీ జై షా (Jay Shah) గురువారం నాడు కీలక ప్రకటన చేశారు. పురుష క్రికెటర్లతో (Male Cricketers) సమానంగా మహిళా క్రికెటర్లకు (Team India Women Cricketers) కూడా వేతనాలు (Match Fees) చెల్లించాలని అపెక్స్ బోర్డ్ (Apex Board) నిర్ణయించినట్లు ఆయన ప్రకటించారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ జై షా ట్విట్టర్‌లో ట్వీట్ (Jay Shah Tweet) చేశారు. సమాన వేతన విధానాన్ని (Equal Pay Policy) మహిళా క్రికెటర్ల విషయంలో అమలుచేయనున్నట్లు ప్రకటిస్తున్నందుకు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు జై షా ట్వీట్ చేశారు. భారతీయ క్రికెట్‌లో ఇదొక సరికొత్త అధ్యాయమని.. ఇకపై లింగ భేదం లేదని.. పురుష క్రికెటర్లు, మహిళా క్రికెటర్లు ఇద్దరూ సమానమేనని చాటి చెప్పేందుకు సమాన వేతనాన్ని ఇవ్వాలని నిర్ణయించినట్లు జై షా ట్వీట్ చేశారు. బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయంపై స్త్రీ అభ్యుదయ వాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. క్రికెటర్లకు టెస్ట్, వన్డే, టీ20 ఫార్మాట్లలో ఎంత చెల్లిస్తారని తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు.
టెస్ట్ క్రికెట్‌లో అయితే ఒక్కో క్రికెటర్‌కు రూ.15 లక్షల మ్యాచ్ ఫీజు చెల్లిస్తారు. అదే వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌కు అయితే ఒక్కో క్రికెటర్‌కు రూ.6 లక్షలు చెల్లిస్తారు. టీ20 మ్యాచ్‌లకు అయితే మ్యాచ్‌కు రూ.3 లక్షల చొప్పున చెల్లించడం జరుగుతుంది. ఇకపై.. ఈ వేతనాలు మహిళా క్రికెటర్లకు కూడా సమానంగా వర్తించనున్నాయి. బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయంపై టీమిండియా మహిళా జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ హర్షం వ్యక్తం చేసింది. టీమిండియా మహిళా జట్టు క్రికెట్‌లో ఇదొక చారిత్రక నిర్ణయం అని, ఈ కలను నిజం చేసినందుకు జై షాకు, బీసీసీఐకు కృతజ్ఞతలు తెలిపింది. ఈరోజు తనకు చాలా సంతోషంగా ఉందని ట్వీట్ చేసింది.