IND vs BAN: బంగ్లాదేశ్‌కు భారీ టార్గెట్ ఫిక్స్ చేసిన టీమిండియా.. బంగ్లా వల్ల అవుతుందా..?
ABN , First Publish Date - 2022-11-02T15:24:25+05:30 IST
టీమిండియా, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ కీలక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి..
అడిలైడ్: టీమిండియా, బంగ్లాదేశ్(IND vs BAN) మధ్య జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) కీలక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా (Team India) నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. 185 పరుగుల భారీ లక్ష్యాన్ని బంగ్లాదేశ్ (Bangladesh) ముందు నిలిపింది. టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) 64 పరుగులతో నాటౌట్‌గా నిలిచి అదరగొట్టగా, టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ (KL Rahul) వరుస వైఫల్యాల తర్వాత ఫామ్‌లోకొచ్చి హాఫ్ సెంచరీతో రాణించాడు. సూర్యకుమార్ యాదవ్ (Surya Kumar Yadav) 30 పరుగులు చేశాడు.
అత్యధిక పరుగులతో చరిత్ర తిరగరాసిన విరాట్ కోహ్లీ
పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అదరగొట్టి టీమిండియాను విజయ తీరాలకు చేర్చిన విరాట్ కోహ్లీ బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఈ కీలక మ్యాచ్‌లో కూడా అద్భుత ఆటతీరును కనబర్చాడు. 64 పరుగులతో నాటౌట్‌గా నిలిచి హాఫ్ సెంచరీతో రాణించడమే కాకుండా అప్పటివరకూ ఉన్న టీ20 వరల్డ్ కప్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించాడు. టీ20 వరల్డ్ కప్‌లో ఇన్నాళ్లూ అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా శ్రీలంక క్రికెటర్ మహేలా జయవర్ధనే పేరు మీద రికార్డు ఉండేది. జయవర్ధనే 1016 చేసి ఈ రికార్డు సాధించాడు. తాజాగా.. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ ఆడటంతో 1017 పరుగులతో జయవర్ధనే రికార్డును కోహ్లీ తిరగరాశాడు. కోహ్లీ 1017, జయవర్ధనే 1016, క్రిస్ గేల్ 965, రోహిత్ శర్మ 921, దిల్షాన్ 897 పరుగులతో ఈ రికార్డు సాధించిన జాబితాలో నిలిచారు.
Rohit Sharma: నిరాశపరిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ..
టీమిండియా గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ చేతులెత్తేశాడు. ఆది నుంచే తడబడుతూ బ్యాటింగ్ చేసిన రోహిత్ 2 పరుగులకే ఔట్‌గా వెనుదిరిగాడు. హసన్ మహ్ముద్ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించి యాసిర్ అలీకి రోహిత్ క్యాచ్‌గా చిక్కడంతో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్లు ఇద్దరూ నిలదొక్కుకుని మిడిలార్డర్‌పై భారం పడకుండా చూడాల్సిన మ్యాచ్‌లో రోహిత్ పేలవ ఆట తీరుతో టీమిండియా అభిమానులను నిరాశపరిచాడు.
KL Rahul: హమ్మయ్య.. కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ.. కానీ ఫామ్‌లోకొచ్చాడనుకునే లోపే..
టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ బంగ్లాదేశ్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో రాణించాడు. 32 బంతుల్లో నాలుగు సిక్స్‌లు, మూడు ఫోర్లతో 50 పరుగులు చేసి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అయితే.. హాఫ్ సెంచరీ చేసిన ఆనందం రాహుల్‌కు ఎక్కువ సేపు నిలవలేదు. ఆ తర్వాతి బంతికే క్యాచ్‌గా దొరికిపోయి పెవిలియన్ బాట పట్టాడు. గత మూడు మ్యాచ్‌ల్లో వరుసగా 4,9,9 పరుగులే చేసి దారుణంగా నిరాశపరిచిన కేఎల్ రాహుల్ బంగ్లాదేశ్ మ్యాచ్‌లో రాణించాడు. కోచ్ ద్రవిడ్ అతడిపై పెట్టుకున్న విశ్వాసాన్ని కొంత మేర నిలబెట్టుకున్నాడు.
మినిమమ్ గ్యారెంటీ అనిపించిన సూర్య..
ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న సూర్య కుమార్ యాదవ్ ఈ మ్యాచ్‌లోనూ పర్వాలేదనిపించాడు. 16 బంతుల్లో 30 పరుగులు చేసి ఫోర్ల మీద ఫోర్లు కొడుతూ దూకుడుగా ఆడుతున్న సూర్యను షకీబ్ అల్ హసన్ ఔట్ చేశాడు. బంగ్లా కెప్టెన్ బౌలింగ్‌లో సూర్య క్లీన్ బౌల్డ్‌గా వెనుదిరిగాడు. హార్థిక్ పాండ్యా కూడా 5 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద హసన్ మహ్మూద్ బౌలింగ్‌లో యాసిర్ అలీకి క్యాచ్‌గా చిక్కడంతో ఔట్‌గా వెనుదిరిగాడు.
టీమిండియా బ్యాడ్ లక్.. డీకే రనౌట్..
దినేష్ కార్తీక్ రనౌట్ టీమిండియా అభిమానులను తీవ్ర నిరాశపరిచింది. కోహ్లీ, దినేష్ కార్తీక్ మధ్య సమన్వయం లోపించడంతో దినేష్ కార్తీక్ 7 పరుగుల వ్యక్తిగత స్కోర్‌కే రనౌట్ అయి పెవిలియన్ బాట పట్టాల్సి వచ్చింది. రనౌట్ విషయంలో విరాట్, డీకే మధ్య అసంతృప్తితో కూడిన సంభాషణ నడిచింది. తీవ్ర నైరాశ్యంతో దినేష్ కార్తీక్ వెనుదిరిగాడు. దినేష్ కార్తీక్ రనౌట్ అవకుండా ఉండి ఉంటే భారీ షాట్లకు అవకాశం ఉండేదనడంలో సందేహమే లేదు