Bangladesh Vs India: చివర్లో విజృంభించిన బౌలర్లు.. విజయానికి చేరువలో భారత్
ABN , First Publish Date - 2022-12-17T16:59:00+05:30 IST
భారత్ బౌలర్లు చివర్లో విజృంభించారు. క్రీజులో పాతుకుపోయిన బంగ్లాదేశ్ (Bangladesh)
చాటోగ్రామ్: భారత్ బౌలర్లు చివర్లో విజృంభించారు. క్రీజులో పాతుకుపోయిన బంగ్లాదేశ్ (Bangladesh) బ్యాటర్లను ఒక్కొక్కరిగా పెవిలియన్ పంపుతూ జట్టును విజయం దిశగా నడిపించారు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ తన రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. ఈ టెస్టులో బంగ్లాదేశ్ విజయం సాధించాలంటే 241 పరుగులు అవసరం కాగా, చేతిలో నాలుగు వికెట్లు మాత్రమే ఉన్నాయి. భారత్ (Team India) విజయానికి నాలుగు వికెట్లు తీస్తే సరి. టీమిండియా బౌలర్లు ఇదే జోరు కొనసాగిస్తే ఆదివారం తొలి సెషన్‌లోనే విజయం భారత్ సొంతమవుతుంది.
అంతకుముందు ఓవర్ నైట్ స్కోరు 42/0తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ తొలుత గట్టిగానే పోరాడింది. ఓపెనర్లు నజ్ముల్ హొసైన్, జకీర్ హసన్‌లు ఫెవికాల్ పూసుకున్నట్టు క్రీజులో పాతుకుపోయారు. అయితే, ఉమేశ్ యాదవ్ మ్యాజిక్ బంతికి నజ్ముల్ (67) అవుట్ కావడంతో 124 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వెంటనే యాసిర్ అలీ (5)ని అక్షర్ పటేల్ పెవిలియన్ చేర్చారు.
అయితే, క్రీజులోపాతుకుపోయిన జకీర్ హసన్ (Zakir Hasan) మాత్రం సెంచరీ చేశాక కానీ క్రీజును వదల్లేదు. 224 బంతులు ఆడిన జకీర్ 12 ఫోర్లు, సిక్సర్‌తో సరిగ్గా సెంచరీ చేసి అశ్విన్ బౌలింగ్‌లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తర్వాత అక్షర్ పటేల్ మరో రెండు వికెట్లు పడగొట్టి బంగ్లాదేశ్‌కు భారీ షాకిచ్చాడు. ప్రస్తుతం కెప్టెన్ షకీబల్ హసన్ (40), మెహిదీ హసన్ మిరాజ్ (9) క్రీజులో ఉన్నారు. ఇండియా బౌలర్లలో అక్షర్ పటేల్ మూడు వికెట్లు పడగొట్టగా, ఉమేశ్ యాదవ్, అశ్విన్, కుల్దీప్ యాదవ్‌లకు చెరో వికెట్ దక్కింది.