Khammam to Vijayawada : హైవేకు గండి!
ABN , First Publish Date - 2022-11-26T03:21:14+05:30 IST
అది ఖమ్మం నుంచి విజయవాడకు నిర్మించనున్న జాతీయ రహదారి! ఖమ్మం కొత్త కలెక్టరేట్ సమీపం నుంచి నిర్మించనున్న ఈ హైవే ఆ జిల్లాలో 60 కిలోమీటర్లు ఉంటే.. ఏపీలో కేవలం 30 కిలోమీటర్లు ఉండనుంది! కేంద్రం దీనిని మంజూరు చేసింది!
ఖమ్మం-విజయవాడ జాతీయ రహదారికి అధికార పార్టీ కీలక నేత మోకాలడ్డు
ఖమ్మం శివారులో అలైన్‌మెంట్ మార్చాలంటూ అధికారులపై ఒత్తిళ్లు
ఆయన అనుయాయుల భూములు పోతుండడమే ఇందుకు కారణం
ఇప్పటికే ఓసారి రద్దయి మంజూరైన హైవే.. ఇప్పుడు మళ్లీ రద్దు ప్రమాదం
ఇప్పటికే నిలిచిన భూసేకరణ.. రూ.1,800 కోట్ల ప్రాజెక్టుపై నీలినీడలు
హైదరాబాద్, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): అది ఖమ్మం నుంచి విజయవాడకు నిర్మించనున్న జాతీయ రహదారి! ఖమ్మం కొత్త కలెక్టరేట్ సమీపం నుంచి నిర్మించనున్న ఈ హైవే ఆ జిల్లాలో 60 కిలోమీటర్లు ఉంటే.. ఏపీలో కేవలం 30 కిలోమీటర్లు ఉండనుంది! కేంద్రం దీనిని మంజూరు చేసింది! రూ.1,800 కోట్లతో కేంద్రమే నిర్మిస్తోంది! ఇది పూర్తయితే కేవలం 70-80 నిమిషాల్లోనే ఖమ్మం నుంచి విజయవాడ చేరుకోవచ్చు! ఇప్పటికే రెండు విడతల్లో భూ సేకరణ కూడా పూర్తయింది! మూడో విడత ఖమ్మం శివారులో భూ సేకరణకు ఆటంకాలు ఎదురవుతున్నాయి! మొత్తం హైవే నిర్మాణంలోనే ప్రతిష్టంభన నెలకొంది! పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి! ఇప్పటికే ఒకసారి రద్దయి వచ్చిన హైవే మళ్లీ రద్దవుతుందా!? అన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ఇందుకు కారణం.. జిల్లాలో చక్రం తిప్పుతున్న అధికార పార్టీకి చెందిన కీలక నేత భూ సేకరణకు అడ్డు పడుతుండడమే! తన, తన అనుయాయుల భూముల్లోంచి వెళ్లే హైవే అలైన్‌మెంట్‌ను మార్చాలంటూ అధికారులపై ఒత్తిడి చేస్తుండడమే! ప్రస్తుతం తెలంగాణలో ఎక్కడా లేని విధంగా ఖమ్మం మీదుగా ఐదు జాతీయ రహదారులు మంజూరయ్యాయి. అవి.. ఎన్‌హెచ్ 365 బిడి నంబర్‌తో సూర్యాపేట నుంచి ఖమ్మం వరకూ 60 కిలోమీటర్లు; ఖమ్మం నుంచి కోదాడ (ఎన్‌హెచ్ 365ఏ) వరకూ 40 కి.మీ; ఖమ్మం నుంచి దేవరపల్లికి (ఎన్‌హెచ్ 365 బిజి గ్రీన్‌ఫీల్డ్ హైవే) 168 కి.మీ; వరంగల్ టు ఖమ్మం (ఎన్‌హెచ్ 163జీ) 108 కిలోమీటర్లు; ఖమ్మం నుంచి విజయవాడ (ఎన్‌హెచ్ 163జీ) వరకూ 90 కిలోమీటర్లు. వీటిలో కొన్ని రహదారుల నిర్మాణ పనులు ఇప్పటికే కొనసాగుతున్నాయి.
అయితే, ఖమ్మం- విజయవాడ హైవేకు గతంలోనే కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ, వివిధ కారణాలతో అప్పట్లో అది కాస్తా రద్దయింది. జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి చొరవ తీసుకోవడంతో భారత్‌మాల ప్రాజెక్టులో భాగంగా కేంద్రం మళ్లీ అంగీకారం తెలిపింది. ఈ హైవే ఖమ్మం జిల్లాలోని రఘునాధపాలెం, చింతకాని, కొణిజర్ల, బోనకల్, మధిర, ఎర్రుపాలెం మండలాల మీదుగా ఏపీకి అనుసంధానం కానుంది. ఖమ్మం కొత్త కలెక్టరేట్ సమీపం నుంచే కొత్త హైవేను ప్రతిపాదించారు. దాంతో, హైవేకు, కలెక్టరేట్‌కు అనుసంధాన రోడ్డును నిర్మించాలని కూడా నేషనల్ హైవే నిర్ణయించింది. ఇప్పుడు ఈ జాతీయ రహదారి రాజకీయ చక్రబంధంలో చిక్కుకుంది. ఈ హైవే కారణంగా ఖమ్మం శివారులో అధికార పార్టీలో కీలక నేతకు చెందిన అనుయాయుల భూములు భూ సేకరణలో పోనున్నాయి. హైవే నిర్మాణానికి మొత్తం మూడు గెజిట్ నోటిఫికేషన్లు విడుదల చేయాల్సి ఉంది. ఇప్పటికే రెండు నోటిఫికేషన్లు విడుదల చేశారు. ఆ మేరకు భూ సేకరణ కూడా పూర్తయినట్లు సమాచారం. మూడో గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ఖమ్మం శివారులో భూమిని సేకరించాల్సి ఉంది. కీలక నేత మోకాలడ్డడంతో ఇక్కడ నోటిఫికేషన్, భూ సేకరణ నిలిచిపోయినట్లు తెలుస్తోంది. అలైన్‌మెంట్ మార్చాలంటూ సదరు నేత అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఫలితంగా హైవే పనుల్లో ప్రతిష్టంభన నెలకొంది. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించకపోతే మొత్తం ప్రాజెక్టే రద్దయ్యే అవకాశాలున్నాయన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇందుకు ఖమ్మం నుంచి కోదాడకు హైవే ఉండడం, కోదాడ నుంచి విజయవాడకు ఇప్పటికే నేషనల్ హైవే ఉండడమే కారణంగా చెబుతున్నారు.
రింగ్ రోడ్డు భారమూ కేంద్రానిదే!
ఖమ్మం చుట్టూ రింగ్ రోడ్డు నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. ఈ మేరకు ప్రత్యేకంగా జీవో కూడా జారీ చేసింది. ఇందుకు దాదాపు రూ.280 కోట్లు ఖర్చవుతుందని అంచనా కూడా వేసింది. ప్రస్తుత అంచనా ప్రకారం ఇందుకు రూ.800 కోట్ల నుంచి వెయ్యి కోట్ల వరకూ ఖర్చవుతుందని అంచనా. కానీ, ఖమ్మం మీదుగా కేంద్రం మంజూరు చేసిన ఐదు జాతీయ రహదారుల కారణంగా ఇక్కడ సహజంగానే రింగ్ రోడ్డు ఏర్పడుతోంది. ఖమ్మం-విజయవాడ, ఖమ్మం-దేవరపల్లి, వరంగల్-ఖమ్మం, సూర్యాపేట-ఖమ్మం రహదారులతోపాటు బైపాస్ రోడ్డును కూడా జాతీయ రహదారుల నిర్మాణంలో భాగంగానే చేపట్టనున్నారు. దాంతో, రాష్ట్ర ప్రభుత్వంపై ఎటువంటి భారం లేకుండానే ఇక్కడ రింగ్ రోడ్డు పూర్తి కానుంది. ఇన్ని రకాల ప్రయోజనాలున్న ఈ హైవే నిర్మాణానికి సహకరించాల్సిన స్థానిక ప్రజా ప్రతినిధి ఆటంకాలు కల్పించడం ఇప్పుడు తీవ్రస్థాయిలో చర్చనీయాంశమవుతోంది.