New Year celebrations: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికితే 6 నెలల జైలుశిక్ష
ABN , First Publish Date - 2022-12-18T18:38:16+05:30 IST
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికితే 10 వేల రూపాయల జరిమానాతో పాటు 6 నెలల జైలు శిక్ష తప్పదని హైదరాబాద్ పోలీసులు హెచ్చరించారు.
హైదరాబాద్: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వేళ హైదరాబాద్ పోలీసులు ఆంక్షలు విధించారు. అర్ధరాత్రి ఒంటిగంట వరకు మాత్రమే వేడుకలకు అనుమతినిచ్చారు. పబ్బుల్లో మైనర్లను అనుమతిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. ఎక్సైజ్ శాఖ నిర్దేశించిన సమయం వరకే మద్యం అమ్మకాలు చేయాలని, అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. న్యూ ఇయర్ ఈవెంట్స్ కోసం 10 రోజుల ముందే పోలీసుల అనుమతి తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. పబ్బుల్లో, ఈవెంట్స్ లో అశ్లీల నృత్యాలు, అధిక శబ్దాలు వస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈవెంట్స్ మొత్తం కవర్ అయ్యేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈవెంట్స్, పబ్బులలో 45 డేసిబుల్స్ కంటే ఎక్కువ శబ్దాలు రాకుండా చూసుకోవాలన్నారు.
సామర్థ్యం కంటే ఎక్కువగా ఈవెంట్స్ పాసులు ఇవ్వరాదని స్పష్టం చేశారు. న్యూ ఇయర్ వేడుకల్లో గంజాయి డ్రగ్స్, అమ్మకాలు చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. పబ్ ఈవెంట్స్ పార్కింగ్ ప్రదేశాల్లో డ్రగ్స్ అమ్మకాలు చేస్తే యాజమాన్యాలదే బాధ్యతని పోలీసులు తేల్చారు. ఈవెంట్స్ నుంచి, పబ్బుల నుంచి బయటకు వెళ్లే వారికి క్యాబ్‌లు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కూడా నిర్వాహకులదేనని పోలీసులు స్పష్టం చేశారు. స్టార్ హోటల్, పబ్స్, ఈవెంట్స్‌లలో మద్యం తాగి వాహనాలు నడపడం నేరమంటూ బోర్డులు ఏర్పాటు చేయాలని హైదరాబాద్ పోలీసులు చెప్పారు. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో మద్యం తాగి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని, డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికితే 10 వేల రూపాయల జరిమానాతో పాటు 6 నెలల జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. మైనర్లు వాహనం నడిపి పట్టుబడితే వాహన యజమానిపై చర్యలు తీసుకుంటామన్నారు. పబ్బులు, ఈవెంట్స్ స్టార్ హోటళ్ల వద్ద పార్కింగ్ యాజమాన్యాలే ఏర్పాటు చేసుకోవాలన్నారు. న్యూ ఇయర్ వేడుకల్లో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూసుకోవాలని హైదరాబాద్ పోలీసులు తేల్చి చెప్పారు.