Biryani : స్విగ్గీలో సెకనుకు 2.28 చికెన్‌ బిర్యానీ ఆర్డర్లు

ABN , First Publish Date - 2022-12-16T00:52:26+05:30 IST

భారతీయులు బిర్యానీ ప్రియులని మరోసారి రుజువైంది. ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థ స్విగ్గీ యాప్‌లో భారతీయులు ఈ ఏడాది అత్యధికంగా ఆర్డర్‌ చేసిన ఆహారంగా చికెన్‌

 Biryani : స్విగ్గీలో సెకనుకు 2.28 చికెన్‌ బిర్యానీ ఆర్డర్లు

స్విగ్గీలో సెకనుకు 2.28 చికెన్‌ బిర్యానీ ఆర్డర్లు

భారతీయులు అత్యధికంగా ఆర్డర్‌ ఇచ్చిన ఆహారంగా ఘనత

వరుసగా ఏడో సారి అగ్రస్థానం.. మసాలా దోశకు రెండో స్థానం

స్నాక్స్‌లో సమోసానే టాప్‌.. స్విగ్గీ వార్షిక నివేదికలో వెల్లడి

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): భారతీయులు బిర్యానీ ప్రియులని మరోసారి రుజువైంది. ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థ స్విగ్గీ యాప్‌లో భారతీయులు ఈ ఏడాది అత్యధికంగా ఆర్డర్‌ చేసిన ఆహారంగా చికెన్‌ బిర్యానీ నిలిచింది. 2022లో తమకు వచ్చిన ఆర్డర్లకు సంబంధించిన వార్షిక నివేదికను స్విగ్గీ విడుదల చేసింది. ఈ నివేదికలో బిర్యానీకి టాప్‌ ప్లేస్‌ దక్కడం వరుసగా ఇది ఏడోసారి. స్విగ్గీ-2022 నివేదిక ప్రకారం ఆ యాప్‌లో సెకనుకు 2.28 చికెన్‌ బిర్యానీ ఆర్డర్లు వచ్చాయి.

అంతేకాక నిమిషానికి 137 బిర్యానీ ప్యాకెట్లను స్విగ్గీ డెలివరీ చేసింది. ఇక, చికెన్‌ బిర్యానీ తర్వాత వరుసగా మసాలా దోశ, చికెన్‌ ఫ్రైడ్‌ రైస్‌, పన్నీర్‌ బటర్‌ మసాలా, బటర్‌ నాన్‌, వెజ్‌ఫ్రైడ్‌ రైస్‌, వెజ్‌ బిర్యానీ, తందూరి చికెన్‌కు ఎక్కువ ఆర్డర్లు వచ్చాయి. విదేశీ వంటకాల విషయానికొస్తే ఇటాలియన్‌ పాస్తా, పిజా, మెక్సికన్‌ బౌల్‌, స్పైసీ రొమెన్‌ను భారతీయులు అత్యధికంగా ఆర్డర్‌ చేశారు. చిరుతిండ్లు(స్నాక్స్‌) కేటగిరీలో సమోసా టాప్‌ ప్లేస్‌లో నిలిచింది. 2022లో సమోసాల కోసం స్విగ్గీకి 40 లక్షల ఆర్డర్లు వచ్చాయి. తర్వాతి స్థానాల్లో, పాప్‌కార్న్‌, పావ్‌ బాజీ, ఫ్రెంచ్‌ ఫ్రైస్‌, గార్లిక్‌ బ్రెడ్‌ స్టిక్స్‌ నిలిచాయి. అత్యధికంగా ఆర్డర్‌ చేసిన డిసర్ట్స్‌లో గులాబ్‌ జామూన్‌, రస్‌మలాయి, చాకోలావా కేక్‌, రసగుల్లా, చాకోచిప్స్‌ ఐస్‌క్రీమ్‌ వరుసగా టాప్‌-5లో నిలిచాయి.

Updated Date - 2022-12-16T11:24:29+05:30 IST