Vijayashanthi: పల్చగా రోడ్లు వేయిస్తూ కలరింగ్.. కేసీఆర్ నాసిరకం పాలనకు గోషామహల్ నాలా ఘటనే ఉదాహరణ
ABN , First Publish Date - 2022-12-24T21:44:58+05:30 IST
పైకి అందంగా కనిపించడానికి పల్చగా రోడ్లు వేయిస్తూ కలరింగ్ ఇస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR)పై బీజేపీ నాయకురాలు విజయశాంతి (Vijayashanthi)విమర్శలు గుప్పించారు.
హైదరాబాద్: పైకి అందంగా కనిపించడానికి పల్చగా రోడ్లు వేయిస్తూ కలరింగ్ ఇస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR)పై బీజేపీ నాయకురాలు విజయశాంతి (Vijayashanthi) విమర్శలు గుప్పించారు. నాణ్యత లేకుండా తూతూ మంత్రంగా పనులు చేస్తున్నారని, ఎనిమిదేళ్ల బీఆరెస్ (టీఆరెస్) నాసిరకం పాలనకు గోషామహల్ పరిధిలో నాలా కుంగిపోయి ఘటన ఉదాహరణ అని ఆమె అన్నారు. రాములమ్మ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు యథాతథంగా..
'ఇదీ కేసీఆర్ సారు కలలు గన్న విశ్వనగరం విశ్వరూపం... తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరం పరిస్థితి పైన పటారం లోన లొటారం అన్నట్టుంది. నగరంలో ప్రధాన ప్రాంతంగా... వాణిజ్యపరంగా... ఎంతో ప్రత్యేకత ఉన్న గోషామహల్ పరిధిలో శుక్రవారం నాలా కుంగిపోయి ఇలా తయారైంది. దేవుడి దయవల్ల ప్రాణనష్టం జరగలేదు. పైకి అందంగా కనిపించడానికి పల్చగా రోడ్లు వేయిస్తూ... కలరింగ్ ఇస్తున్నరు తప్ప నాలాలెక్కడున్నాయో... అక్కడి పరిస్థితేమిటో తెలుసుకోవడానికి నాణ్యతా సంబంధమైన పరిశీలన చెయ్యకుండానే తూతూ మంత్రంగా పనులు చేస్తున్నరు. ఎనిమిదేళ్ల బీఆరెస్ (టీఆరెస్) నాసిరకం పాలనకు నికార్సైన ఉదాహరణ ఇది. నగరంలో కనిపించకుండా పొంచి ఉన్న ఇలాంటి పరిస్థితులు గురించి తల్చుకుంటేనే భయమేస్తోంది.' అని విజయశాంతి అన్నారు.