కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి షోకాజ్‌

ABN , First Publish Date - 2022-10-24T05:10:18+05:30 IST

కాంగ్రెస్‌ ఎంపీ, టీపీసీసీ స్టార్‌ క్యాంపెయినర్‌ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఆ పార్టీ అధిష్ఠానం షోకాజ్‌ నోటీస్‌ ఇచ్చింది.

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి షోకాజ్‌

నోటీస్‌ జారీ చేసిన కాంగ్రెస్‌ హైకమాండ్‌

న్యూఢిల్లీ/నల్లగొండ/హైదరాబాద్‌, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ ఎంపీ, టీపీసీసీ స్టార్‌ క్యాంపెయినర్‌ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఆ పార్టీ అధిష్ఠానం షోకాజ్‌ నోటీస్‌ ఇచ్చింది. ఎన్నికల్లో తన సోదరుడు రాజగోపాల్‌రెడ్డికి మద్దతు ఇవ్వాలంటూ ఓ కాంగ్రెస్‌ నాయకుడికి వెంకట్‌రెడ్డి ఫోన్‌ చేసిన ఆడియో బయటికి వచ్చిన నేపథ్యంలో.. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌.. అధిష్ఠానానికి నివేదిక అందజేశారు. ఈ నివేదిక మేరకు ఏఐసీసీ క్రమశిక్షణ ఉల్లంఘన కమిటీ మెంబర్‌ సెక్రటరీ తారిఖ్‌ అన్వర్‌ నోటీస్‌ జారీ చేశారు. సొంత పార్టీ అభ్యర్థిని కాదని ప్రత్యర్థి పార్టీ అభ్యర్థికి మద్దతివ్వాలనడం పార్టీ లైన్‌ దాటడమేనని ఆ నోటీసులో పేర్కొన్నారు. వెంకట్‌రెడ్డి కాంగ్రెస్‌ కార్యకర్తతో ఫోన్‌లో మాట్లాడిన ఆడియో క్లిప్‌ ప్రింట్‌, ఎలకా్ట్రనిక్‌ మీడియాతోపాటు సామాజిక మాధ్యమాల్లో కూడా వైరల్‌ అయిందని తెలిపారు. క్రమశిక్షణ తప్పినట్లుగా తాము భావిస్తున్నందున తదుపరి చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలన్నారు. అయితే వెంకట్‌రెడ్డి ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. నవంబరు 2న స్వదేశానికి తిరిగి రానున్నారు. ఆయనకు కాంగ్రెస్‌ క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన గడువు నవంబరు 1తో ముగియనున్న నేపథ్యంలో ఆలోగానే తన వివరణను తెలపాల్సి ఉంటుంది.

వెంకట్‌రెడ్డి దారెటు?

షోకాజ్‌ నోటీసు నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఏం చేయబోతున్నారనే చర్చ కాంగ్రెస్‌ వర్గాల్లో జోరందుకుంది. షోకాజ్‌ నోటీసుకు వివరణ ఇస్తారా! లేదంటే అధిష్ఠానం తీసుకునే చర్యల కోసం వేచి చూస్తారా! అని కాంగ్రెస్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి. వాస్తవానికి తన సోదరుడు రాజగోపాల్‌రెడ్డితోపాటే వెంకట్‌రెడ్డి కూడా బీజేపీలో చేరబోతున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. తన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని మునుగోడు శాసనసభ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతున్నా ప్రచారానికి ఆయన దూరంగా ఉన్నారు. పైగా అక్కడ కాంగ్రెస్‌ పార్టీ గెలవదంటూ ఆస్ట్రేలియాలో వ్యాఖ్యలు చేశారు.

దీంతో అధిష్ఠానం ఆయనకు షోకాజ్‌ నోటీసు జారీ చేసి.. పార్టీకి వ్యతిరేకంగా ఎవరు చర్యలకు పాల్పడినా ఉపేక్షించేది లేదన్న సంకేతాన్నిచ్చింది. ఈ నేపథ్యంలో వెంకట్‌రెడ్డి బీజేపీలో చేరనున్నారన్న ప్రచారం నిజమే అయితే.. షోకాజ్‌ నోటీసును ఆయన వరంలా భావిస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నోటీసుకు వివరణ ఇవ్వకపోతే వెంకట్‌రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించాల్సి ఉంటుంది. అప్పుడు బీజేపీలో చేరి.. లోక్‌సభలో ఆ పార్టీ అసోసియేట్‌ సభ్యుడిగా వెంకట్‌రెడ్డి కొనసాగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఈ వ్యూహం మేరకే ఆయన పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తన వ్యాఖ్యల పట్ల ప్రకటన రూపంలో స్పందించే అవకాశం ఉన్నా.. వెంకట్‌రెడ్డి ఇంతవరకు స్పందించకపోవడాన్ని గుర్తు చేస్తున్నారు.

Updated Date - 2022-10-24T05:10:19+05:30 IST