KYC : కొంపముంచిన కేవైసీ
ABN , First Publish Date - 2022-11-27T03:18:18+05:30 IST
రైతు బంధు తరహాలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకానికి రాష్ట్రంలో ఈసారి (ఆగస్టు- నవంబరు నెలల్లో అందే 12వ విడత) 6.65 లక్షల మంది రైతులు దూరమయ్యారు.
ఆధార్, మొబైల్ నంబరు అనుసంధానం చేయకపోవడమే సమస్య
రాష్ట్రంలో 6,65,439 మంది రైతులకు అందని పీఎం కిసాన్ సాయం
ఆన్‌లైన్‌లో ఈ-కేవైసీకి చాన్స్..
లాగిన్ ఐడీ అధికారం మాత్రం ఏవోలకు
రైతులు కేవైసీ పూర్తి చేసినా దాన్ని ఆమోదించటంలో ఏవోల నిర్లక్ష్యం
కేవైసీ పూర్తి చేయడానికి రైతులు ముందుకు రాలేదంటూ కుంటిసాకులు
లబ్ధిదారుల సంఖ్య తగ్గుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే కారణం
వారసులకు ఓకే కానీ కొత్తగా భూమి కొనుక్కుంటే ‘కిసాన్’లో మొండిచేయి
హైదరాబాద్, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): రైతు బంధు తరహాలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకానికి రాష్ట్రంలో ఈసారి (ఆగస్టు- నవంబరు నెలల్లో అందే 12వ విడత) 6.65 లక్షల మంది రైతులు దూరమయ్యారు. వారంతా రూ.133 కోట్లపైచిలుకు కేంద్ర ప్రభుత్వ సాయాన్ని కోల్పోయారు. ఇందుకు కారణం.. ఆధార్ నంబరుతో వారి మొబైల్ నంబరును అనుసంధానం (ఈ-కేవైసీ) చేయకపోవడమే! ఇందుకు బాధ్యత మాత్రం వ్యవసాయ కమిషనరేట్‌లో ఉన్న ఐటీ విభాగానిదే! ‘లాగిన్ ఐడీ’ అధికారం కలిగిన మండల వ్యవసాయ అధికారులు కన్సెంట్ ఇవ్వకపోవడం, రైతుల నుంచి ఆధార్, మొబైల్ నంబర్లు సేకరించి అప్‌డేట్ చేయకపోవడంతో లక్షలాదిమంది పీఎం- కిసాన్ నగదు బదిలీ పథకానికి దూరమయ్యారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో లక్షలాదిమంది పీఎం కిసాన్ పథకానికి దూరమైన విషయం సమాచార హక్కు చట్టం ద్వారా బయటకు వచ్చింది. ఇదే అంశంపై రాష్ట్ర రైతుబంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా కేంద్రంపై దుమ్మెత్తిపోశారు.
ఈ నేపథ్యంలోనే, లక్షలాదిమంది రైతులకు పీఎం కిసాన్ పథకం అందకపోవడానికి కారణాలపై ‘ఆంధ్రజ్యోతి’ ఆరా తీయగా.. వ్యవసాయ శాఖ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. రాష్ట్రానికి చెందిన 39,38,432 మంది రైతులు పీఎం కిసాన్ పోర్టల్‌లో లబ్ధిదారులుగా నమోదై ఉన్నారు. వీరిలో 32,72,993 మందికి మాత్రమే ఆగస్టు-నవంబరుల్లో ఇచ్చిన 12వ విడత సాయం అందింది. 6,65,439 మంది రైతులు పథకానికి దూరమయ్యారు. నిజానికి, 12వ విడత నగదు బదిలీకి ముందు ‘కేవైసీ’ (నో యువర్ కస్టమర్) పూర్తి చేయాలని, ఆధార్ నంబరుతో మొబైల్ నంబరును అనుసంధానం చేయాలని, అప్పుడు మాత్రమే నగదు బదిలీ అవుతుందని కేంద్రం స్పష్టం చేసింది. రాష్ట్రాల్లో వ్యవసాయ శాఖాధికారులు బాధ్యత తీసుకొని కేవైసీ పూర్తి చేయించాలని నిర్దేశించింది.
వ్యవసాయాధికారుల నిర్లక్ష్యం
రైతులు స్వయంగా ఆన్‌లైన్లో కూడా ఈ-కేవైసీ పూర్తి చేయవచ్చు. తొలుత పీఎం కిసాన్ పోర్టల్ ఓపెన్ చేయాలి. ఈ-కేవైసీ ఆప్షన్ ఓపెన్ చేసి ఆధార్ నంబరును; దానికి అనుసంధానంగా ఉన్న మొబైల్ నంబరును ఎంటర్ చేయాలి. సంబంధిత నంబరుకు ‘మొబైల్ ఓటీపీ’ (వన్ టైమ్ పాస్‌వర్డ్) వస్తుంది. దానిని ఎంటర్ చేస్తే.. ‘ఆధార్ ఓటీపీ’ వస్తుంది. దానిని కూడా నమోదు చేస్తే.. ‘ఈ-కేవైసీ డన్ సక్సె్‌సఫుల్లీ’ అని డిస్‌ప్లే అవుతుంది. మెజారిటీ రైతులు ఈ ప్రక్రియను పూర్తి చేశారు. అయినా, వారిలో కొందరికి కేంద్ర ప్రభుత్వ సాయం అందలేదు. ఇందుకు కారణం.. మండల వ్యవసాయాధికారుల (ఏవో) నిర్లక్ష్యం. పీఎం కిసాన్ పోర్టల్‌కు సంబంధించిన ‘లాగిన్ ఐడీ’ అధికారాన్ని ఏవోకి అప్పగించారు. రైతులు ఆన్‌లైన్లో ఈ-కేవైసీ సమర్పించినా.. అందుకు ఏవోలు ఆమోదం (కన్సెంట్) తెలపాల్సి ఉంటుంది. కానీ, కొంతమంది రైతులకు ఏవోలు కన్సెంట్ ఇవ్వలేదు. ఫలితంగా, 2019 కటాఫ్ తేదీలోపు లబ్ధిదారుల జాబితాలో ఉన్న రైతులు కూడా ఈసారి ఆర్థిక సాయాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఇక, కేవైసీ పూర్తి చేయని రైతులు సుమారు 5 లక్షలకుపైగా ఉన్నారు. వీరికి వ్యవసాయ శాఖ అధికారులు సరిగా అవగాహన కల్పించలేదు. వారి మొబైల్ నంబరుకు మెసేజ్‌లు పంపించి వదిలేశారు. వారు కేవైసీ పూర్తి చేశారా లేదా అని పర్యవేక్షణ చేయలేదు. ఏవోలకు ఇటీవలి కాలంలో పెద్దగా పని కూడా లేదు. క్షేత్రస్థాయిలో అన్ని పనులు ఏఈవోలే (వ్యవసాయ విస్తరణాధికారులు) చేస్తున్నారు. రైతుబంధు, రైతు బీమా, పంటల నమోదు తదితర బాధ్యతలన్నీ వారికే ఉన్నాయి. పని ఒత్తిడి లేని ఏవోలకు పీఎం- కిసాన్ లాగిన్ బాధ్యతలు అప్పగిస్తే దానిని కూడా వాళ్లు చేయలేకపోయారు. డివిజన్ స్థాయిలో ఉన్న ఏడీఏలు కూడా పట్టించుకోలేదు.
మొద్దు నిద్రలో ఐటీ సెల్
వ్యవసాయ శాఖ కమిషనరేట్‌లో ప్రత్యేకంగా ‘ఐటీ సెల్’ ఉంది. అర్హులైన రైతుల వివరాలు పోర్టల్‌లో ఆమోదం పొందేలా.. వారికి నగదు బదిలీ జరిగేలా చూడాల్సిన బాధ్యత దీనిదే. ఇందులో డిప్యూటీ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, ఏడీఏ, ఏవో స్థాయి అధికారులు, కంప్యూటర్ ఆపరేటర్లు ఉన్నారు. లబ్ధిదారుల వివరాలు సరిగా ఉన్నాయా? బ్యాంకు అకౌంట్ నంబరు ఆధార్, మొబైల్ నంబరుతో అనుసంధానమైందా? అని పరిశీలించాల్సింది వీరే. జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులను పురమాయించి డేటా అప్‌లోడ్ చేయించాల్సి ఉంటుంది. కానీ, ఐటీ విభాగం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. లక్షలమంది కేవైసీ పూర్తి చేయకపోయినా నిమ్మకు నీరెత్తిన్నట్లు వ్యవహరించింది. ఇక్కడి ఉన్నతాధికారుల మధ్య సమన్వయం లేదు. రాష్ట్ర ప్రభుత్వమూ పట్టించుకోలేదు. కానీ, లబ్ధిదారుల సంఖ్యను కేంద్ర ప్రభుత్వం తగ్గించేసిందంటూ ఆరోపణలు చేయడం విమర్శలకు దారి తీస్తోంది.
రైతు బంధు లబ్ధిదారుల్లో సగం మందికే..
పీఎం కిసాన్ పథకం కింద కూడా అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వానికే అప్పగించారు. ఎటువంటి షరతులూ లేకుండా భూమి కలిగిన ప్రతి ఒక్కరికీ రైతు బంధు పథకం అమలవుతుంటే.. పీఎం కిసాన్ పథకానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించింది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నవారు, ఇనిస్టిట్యూషనల్ ల్యాండ్ హోల్డర్లు, మంత్రు లు, మాజీ మంత్రులు, ఎంపీలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు, మేయర్లు, మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైౖర్‌పర్సన్లు, మాజీ చైర్‌పర్సన్లు, కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత అధికారులు, రూ.10 వేల కంటే ఎక్కువ నెలవారీ పింఛను పొందేవారు, ఆదాయపన్ను చెల్లించేవారు, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయ ర్లు, చార్టెడ్ అకౌంటెంట్లు, ఆర్కిటెక్టులు.. ఇలా కొన్నివర్గాల వారిని ‘పీఎం- కిసాన్’ పథకం నుంచి మినహాయించారు. అందుకే, రైతుబంధు పథకం కింద రాష్ట్రంలో సుమారు 65 లక్షల మంది లబ్ధిదారులుండగా.. పీఎం- కిసాన్ పథకానికి వచ్చేసరికి 39,38,432 మంది లబ్ధిదారులే ఉన్నారు.
కొత్త వారికి కేంద్రం మొండిచేయి
పీఎం కిసాన్ పథకం కింద ఎప్పటికప్పుడు కొత్త లబ్ధిదారులు నమోదవుతున్నారు. మూడేళ్లలో దాదాపు ఆరు లక్షల మంది పెరిగారు కూడా. కానీ, వీరంతా వారసులు మాత్రమే! ఇప్పుడు కొత్తగా భూమి కొనుక్కున్న వారికి మొండి చేయి చూపిస్తున్నారు. ఇందుకు పీఎం కిసాన్‌లోని నిబంధన కారణం. నిజానికి, 2018-19 ఆర్థిక సంవత్సరం నుంచి పీఎం కిసాన్ పథకాన్ని అమలు చేస్తున్నారు. పథకాన్ని ప్రారంభించిన సమయంలో అప్పటికి పట్టాదారులుగా ఉన్న వారినే అర్హులుగా మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఒకవేళ, లబ్ధిదారుల్లో ఎవరైనా చనిపోతే తదనంతరం వారి వారసులకు లబ్ధి అందించేలా పథకంలోనే మార్గదర్శకాలున్నాయి. ఉదాహరణకు, అప్పటి వరకు పీఎం కిసాన్ కింద లబ్ధి పొందుతున్న రైతు చనిపోతే సదరు భూమిని వారసులు తమ పేర్ల మీదకు మార్చుకుని, వారికి పట్టాదారు పాస్ పుస్తకం వచ్చిన రోజు నుంచి వారికి కూడా ప్రభుత్వ సాయం అందుతుంది. వారసులు ఎంత మంది ఉన్నా.. ఆ భూమిని ఎంత మంది పంచుకున్నా అందరికీ పీఎం కిసాన్ వర్తిస్తుంది. అలాగే, 2019కి ముందు పీఎం కిసాన్‌లో నమోదై ఉన్న రైతుకు ఐదెక రాల భూమి ఉందనుకుందాం. ఆయన తనకున్న మొత్తం భూమిని వేరొకరికి అమ్మేశారనుకుందాం. మొత్తం భూమి అంతా అమ్మేయడంతో ఇక ఆయన రైతు కాదు. ఆయనకు లబ్ధి ఆపేస్తారు. కొత్తగా భూమి మొత్తాన్ని కొనుగోలు చేసిన వ్యక్తికి ఆ స్థానంలో లబ్ధి చేకూరుస్తున్నారు. కానీ, సదరు రైతు తనకున్న మొత్తం ఐదెకరాల భూమిలో రెండెకరాలను మాత్రం అమ్మేస్తే.. కొత్తగా ఆ రెండెకరాలను కొనుగోలు చేసిన వ్యక్తికి మాత్రం పీఎం కిసాన్ కింద లబ్ధి అందదు. 2019కి ముందు భూమి లేని వ్యక్తి ఇప్పుడు రైతుగా మారినా ఆయనకు పీఎం కిసాన్ వర్తించదు. ఇందుకు కారణం.. పాత రైతుకు, కొత్త రైతుకు కూడా పథకం కింద లబ్ధి చేకూర్చడమనే నిబంధన మార్గదర్శకాల్లో లేకపోవడమే. దాంతో, కొత్త రైతులకు పీఎం కిసాన్ పథకం అందడం లేదు. భూమి ఉంటే భరోసా ఉంటుందనే అభిప్రాయం, భూమిపై ఉన్న ప్రేమతో కష్టపడి ఎకరం, రెండెకరాలు కొనుగోలు చేసేవారు లక్షల్లోనే ఉంటారు. ఎంతో కొంత భూమిని కొనుగోలు చేసి తాము కూడా రైతుగా మారే వ్యవసాయ కూలీలు కూడా పెద్ద సంఖ్యలోనే ఉంటారు. ఇలా కొత్తగా భూమిని కొనుగోలు చేసిన వారందరికీ పథకంలో చేరే అర్హత లేదన్న నిబంధన పెట్టడం దారుణమని రైతు సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఏదైనా పథకాన్ని ప్రవేశపెడితే.. ఎప్పటికప్పుడు అర్హులను లబ్ధిదారులుగా చేర్చుకునేలా నిబంధనలు ఉండాలని, అంతే తప్ప, పథకానికి వారిని దూరం చేసేలా నిబంధనలు ఉండకూడదని వివరిస్తున్నారు. పీఎం కిసాన్ మార్గదర్శకాలు అనేకమంది కొత్త రైతులను పథకంలో చేరకుండా నిరోధిస్తోందని చెబుతున్నారు.