MLA Rohit Reddy : కేసీఆర్‌కు మొదటి రోజే ఉప్పందించిన రోహిత్‌

ABN , First Publish Date - 2022-10-30T06:07:59+05:30 IST

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది.

MLA Rohit Reddy : కేసీఆర్‌కు మొదటి రోజే ఉప్పందించిన రోహిత్‌
MLA Rohit Reddy

రాజకీయ కెరీర్‌కు ఆఫర్‌ను వాడుకున్న పైలట్‌

మొదట్లో తనతో వచ్చేవారి పేర్లుచెప్పని వైనం

సీఎం డైరెక్షన్‌లోనే తెరపైకి మరో ముగ్గురు

రోహిత్‌కు సహాయంగానే వారు వెళ్లినట్లు రిమాండ్‌ రిపోర్టులో వెల్లడించిన పోలీసులు

హైదరాబాద్‌, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. వికారాబాద్‌ జిల్లా తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌ రెడ్డికి నందకుమార్‌తో ముందునుంచే పరిచయం ఉంది. పార్టీ ఫిరాయింపు, ఫలితంగా చేకూరే లాభాల గురించి నందు తనకు వివరించిన సమయంలో దాన్ని తన రాజకీయ భవిష్యత్‌కు ఉపయోగించుకోవాలని రోహిత్‌ నిర్ణయించుకున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్‌, మంత్రి పదవి ఇలా అన్ని అంశాల్ని దూరదృష్టితో ఆలోచించిన రోహిత్‌ తన రాజకీయ భవిష్యత్తుకు నందు ప్రపోజల్‌ను ఉపయోగించుకున్నట్లు అతని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. మహేందర్‌ రెడ్డితో రోహిత్‌కు విభేదాలు ఉండటంతో అధిష్ఠానానికి మరింత దగ్గరయ్యేందుకు అందివచ్చిన అవకాశాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకున్నారు.

నందుతో జరుగుతున్న సంభాషణను పిన్‌ టు పిన్‌ ఎప్పటికప్పుడు సీఎం కేసీఆర్‌కు రోహిత్‌ చెప్పినట్లు తెలిసింది. రోహిత్‌ మునుగోడు ఎన్నికల ప్రచారంలో నామమాత్రంగా రోజుకు రెండు, మూడు గంటలు పాల్గొని అక్కడి నుంచి నేరుగా ప్రగతి భవన్‌కు చేరుకున్నట్లు తెలిసింది. ప్రగతి భవన్‌ నుంచే నందుతో కాన్ఫరెన్స్‌ కాల్స్‌ మాట్లాడినట్లు సమాచారం.

రామచంద్ర భారతి అలియాస్‌ సతీష్‌ శర్మతో నందు కాన్ఫరెన్స్‌ కాల్‌ మాట్లాడించిన సమయంలో తనతో పాటు ముగ్గురు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పిన రోహిత్‌... వారి పేర్లు చెప్పేందుకు మాత్రం నిరాకరించినట్లు ఆడియో టేపుల్లో స్పష్టంగా తెలుస్తోంది. జరిగిన పరిణామాల్ని బట్టి చూస్తుంటే సీఎం కేసీఆర్‌ డైరెక్షన్‌లోనే మిగతా ముగ్గురు ఎమ్మెల్యేల పేర్లు రోహిత్‌ నందు ద్వారా వారికి తెలియపరిచాడని తెలుస్తోంది. ఈ కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న రోహిత్‌కు సహకారం అందించేందుకే ముగ్గురు ఎమ్మెల్యేలు ఫాంహౌ్‌సకు వెళ్లారని పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో వెల్లడించారు.

ఘటన వెలుగులోకి వచ్చి, పోలీసులు ఎంటరై టాస్క్‌ పూర్తయిన వెంటనే ముగ్గురు ఎమ్మెల్యేలు అక్కడి నుంచి నేరుగా ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. ఫాంహౌస్‌ నుంచి బయటకు వచ్చే సమయంలో ఎమ్మెల్యే రేగా కాంతారావు సీఎం కేసీఆర్‌ తమకు అప్పగించిన టాస్క్‌ పూర్తి చేశామని చెప్పారు. పోలీసుల ప్రాథమిక విచారణ అనంతరం రోహిత్‌ ప్రగతి భవన్‌కు చేరారు. మొత్తం వ్యవహారంలో నందును రోహిత్‌ తన పొలిటికల్‌ కెరీర్‌కు పూర్తిస్థాయిలో వాడుకున్నారని, రోహిత్‌ రాజకీయంగా దూరదృష్టి కలిగిన వాడని అతని గురించి పూర్తిగా తెలిసిన వారు చెబుతున్నారు.

విషయం డైవర్ట్‌ కాకుండా జాగ్రత్త!

రామచంద్ర భారతితో కాన్ఫరెన్స్‌ కాల్‌ మాట్లాడిన సమయంలో నందు అరబిందో శరత్‌ గురించి ప్రస్తావన తీసుకొచ్చారు. అయితే విషయం డైవర్ట్‌ కాకుండా రోహిత్‌రెడ్డి అది తర్వాత మాట్లాడుకుందామని, ముందు మన పని పూర్తి కానివ్వండంటూ దాటవేసిన విషయం ఆడియో టేపుల్లో స్పష్టంగా ఉంది. బేరసారాల విషయం అత్యంత గోప్యంగా ఉంచాలని, విషయం సీఎం వరకు వెళ్తే పరిస్థితి మరోలా ఉంటుందని భయంగా మాట్లాడుతూనే పలుమార్లు రోహిత్‌ నవ్వడం ఆడియోలో రికార్డు అయింది.

రోహిత్‌ రెడ్డికి బుల్లెట్‌ ప్రూఫ్‌ కారు

తాండూరు/వికారాబాద్‌: ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డికి ప్రభుత్వం భద్రత పెంచింది. గతంలో 4 ప్లస్‌ 4 భద్రత కల్పించిన ప్రభుత్వం ప్రస్తుతం ఆయనకు బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనంతో పాటు ఎస్కార్ట్‌ను కేటాయించింది. ఇందులో ఎస్సై, హెడ్‌ కానిస్టేబుల్‌, ఇద్దరు కానిస్టేబుళ్లు, ఒక డ్రైవర్‌ ఉంటారు. ఇక ఆయన కదలికలపై కూడా ప్రభుత్వం నిఘా ముమ్మరం చేయనుంది. ఫాంహౌస్‌ ఘటన తర్వాత రహస్య ప్రదేశంలో ఉన్న రోహిత్‌ ఆదివారం మునుగోడులో జరగనున్న సభలో సీఎం కేసీఆర్‌తో పాటు పాల్గొననున్నట్లు సమాచారం.

Updated Date - 2022-10-30T08:21:30+05:30 IST