Secunderabad: ఆ రైలెక్కేందుకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లేవారికి ఇది బ్యాడ్‌న్యూసే..!
ABN , First Publish Date - 2022-12-13T19:47:09+05:30 IST
‘విజయవాడ (Vijayawada) నుంచి సికింద్రాబాద్‌కు (Secunderabad) రావాల్సిన శాతవాహన ఎక్స్‌ప్రెస్ (Satavahana Express) గంటన్నర ఆలస్యంగా..
హైదరాబాద్: ‘విజయవాడ (Vijayawada) నుంచి సికింద్రాబాద్‌కు (Secunderabad) రావాల్సిన శాతవాహన ఎక్స్‌ప్రెస్ (Satavahana Express) గంటన్నర ఆలస్యంగా నడుస్తున్నది! అసౌకర్యానికి చింతిస్తున్నాం..’ ఇదీ సికింద్రాబాద్ స్టేషన్‌లో (Secunderabad Railway Station) ప్రతి రోజూ వచ్చే అనౌన్స్‌మెంట్. అదంతే మరీ.. ఈ రైలు ప్రతిరోజూ ఆలస్యంగానే సికింద్రాబాద్ స్టేషన్‌కు చేరుకుంటోంది. ఇదొక్కటే కాదు. దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) పరిధిలో కొన్నాళ్లుగా పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ట్రాక్ మరమ్మతులు, రైళ్ల ట్రాఫిక్ కారణంగా కొన్ని లేటుగా నడుస్తుంటే.. మరికొన్ని ఎలాంటి అడ్డంకులు లేకున్నప్పటికీ గంటల కొద్దీ ఆలస్యంగా రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో ఆయా మార్గాల్లో వెళ్తున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సకాలంలో గమ్యస్థానాలకు చేరుకోవచ్చన్న ఉద్దేశంతో రైలెక్కుతున్న ప్రయాణికులు.. ఆగుతూ.. ఆగుతూ సాగుతున్న ప్రయాణంతో విసిగెత్తిపోతున్నారు.
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సికింద్రాబాద్ (Secunderabad), హైదరాబాద్ (Hyderabad), విజయవాడ (Vijayawada), గుంటూరు (Guntur), గుంతకల్లు (Guntakal), నాందేడ్ (Nanded) డివిజన్ల పరిధిలో రోజుకు సగటున 278 రైళ్లు రాకపోకలు సాగిస్తుండగా.. సుమారు 4.80 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. అయితే, ప్రారంభ స్టేషన్ల నుంచి సమయానికి బయలుదేరుతున్న రైళ్లు.. చివరి స్టేషన్‌కు మాత్రం ఆలస్యంగానే చేరుకుంటున్నాయి. సికింద్రాబాద్ నుంచి కాజీపేట (Sec to Kazipet Trains) మీదుగా విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, బల్లార్షా వైపు వెళ్తున్న రైళ్లు, ఆయా మార్గాల నుంచి సికింద్రాబాద్, కాచిగూడకు వస్తున్న రైళ్లు చాలా రోజులుగా లేటుగా నడుస్తున్నాయి. ఒక్కో రైలు శివారు వరకు సరిగ్గానే వస్తున్నా.. కొన్ని రైళ్లను అవుటర్ వద్ద అరగంట నుంచి గంట వరకు ఆపుతున్నట్లు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.
వేగం పెరిగినా ఆలస్యమేనా..!
కొవిడ్ తర్వాత దేశవ్యాప్తంగా రైళ్ల వేగాన్ని పెంచారు. ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వేలో గతంలో గరిష్ఠంగా గంటకు 80-110 కిలోమీటర్ల వేగంతో నడిచే రైళ్లు.. ప్రస్తుతం 130కేఎంపీహెచ్ వేగంతో నడుస్తున్నాయి. దీన్ని సాకుగా చూపుతూ పలు ప్యాసింజర్ రైళ్లను ఎక్స్‌ప్రెస్‌లుగా మార్చి అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని చిన్నస్టేషన్లలో రైళ్ల హాల్టింగ్‌లను ఎత్తివేశారు. అయినప్పటికీ నిర్ణీత సమయానికి రైళ్లు గమ్యస్థానానికి చేరుకోకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రైళ్ల ఆలస్యంపై దక్షిణ మధ్య రైల్వే కంట్రోల్‌రూమ్‌తో పాటు ట్విటర్ ఖాతాకు ఫిర్యాదులు వెళ్తున్నప్పటికీ సమస్యను పరిష్కరించే వారే కరువయ్యారని సబర్బన్ రైల్వే ప్రయాణికుల సంఘం నాయకులు వాపోతున్నారు. ఇప్పటికైనా రైల్వే జీఎం స్పందించి.. రైళ్ల ఆలస్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.