CM KCR: ఢిల్లీ ఎర్రకోటపై ఎగిరేది గులాబీ జెండానే
ABN , First Publish Date - 2022-12-09T14:51:53+05:30 IST
ఢిల్లీ ఎర్రకోటపై ఎగిరేది గులాబీ జెండానే అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.
హైదరాబాద్: ఢిల్లీ ఎర్రకోటపై ఎగిరేది గులాబీ జెండానే అని ముఖ్యమంత్రి కేసీఆర్ (Telagana CM KCR) స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ను ప్రారంభించిన కేసీఆర్ (Telangana CM KCR Launched BRS).. అనంతరం బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ఈనెల 14న ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్‌లో బీఆర్ఎస్ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ‘‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’’ (Ab Ki Bar Kisan Sarkar)ఇదే బీఆర్‌ఎస్ నినాదమన్నారు. దేశంలో రాబోయేది రైతు ప్రభుత్వమని అన్నారు. కర్ణాటక ఎన్నికల్లో జేడీఎస్‌కు బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందని తెలిపారు. త్వరలోనే బీఆర్ఎస్ జాతీయవిధాన ప్రకటన ఉంటుందని ముఖ్యమంత్రి అన్నారు.
దేశవ్యాప్తంగా జలవనరుల సమర్థవంత వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు. దేశ పరివర్తన కోసమే బీఆర్ఎస్ అని స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలవాల్సింది ప్రజలు, రాజకీయ పార్టీలు కాదన్నారు. దేశానికి ఇప్పటికిప్పుడు కొత్త ఆర్థిక విధానం అవసరమని చెప్పుకొచ్చారు. కుమారస్వామి కర్ణాటక ముఖ్యమంత్రి కావాలని అన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ కల్లా ఢిల్లీలో నిర్మాణంలో ఉన్న కొత్త కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు.