Mandamarri: సజీవ దహనం ఘటనలో కొత్త కోణం
ABN , First Publish Date - 2022-12-18T19:12:36+05:30 IST
మంచిర్యాల జిల్లా మందమర్రి (Mandamarri) మండలం వెంకటాపూర్ గ్రామపంచాయతీలోని గుడిపల్లి ఎమ్మెల్యే కాలనీలో ఆరుగురు సజీవ దహనం కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది.
మందమర్రి: మంచిర్యాల జిల్లా మందమర్రి (Mandamarri) మండలం వెంకటాపూర్ గ్రామపంచాయతీలోని గుడిపల్లి ఎమ్మెల్యే కాలనీలో ఆరుగురు సజీవ దహనం కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. లక్షెట్టిపేట మండలం ఉత్కూర్‌లో ఉంటున్న శాంతయ్య కుటుంబ సభ్యులే ఈ ఘటనకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. సింగరేణి కార్మికుడిగా పనిచేసే శాంతయ్యకు భార్య సృజన, కొడుకులు రాజ్‌కుమార్, దీపక్‌కుమార్, ఒక కూతురు ఉన్నారు. కొడుకుల్లో ఒకరు బీ.టెక్, మరొకరు డిగ్రీ చదివి నిరుద్యోగులుగా ఉంటున్నారు. శాంతయ్యకు గుడిపెల్లికి చెందిన శివయ్య భార్య పద్మతో వివాహేతర సంబంధం కొన్నేళ్ళుగా కొనసాగుతోంది. శివయ్యకు విషయం తెలిసినా ఒకే ఇంట్లో ఉంటున్నారు. శాంతయ్య.. భార్య, పిల్లల వద్దకు వెళ్లకుండా పద్మ ఇంట్లో ఉంటూ ఆమెకు జీతం డబ్బులు ఇచ్చేవాడు. ఈ క్రమంలో భూమి అమ్మగా వచ్చిన డబ్బులు కూడా పద్మకు ఇచ్చినట్లు సమాచారం.
ఆస్తి తగాదా, వివాహేతర సంబంధం విషయంలో శాంతయ్య అతడి భార్య సృజనల మధ్య గొడవలు జరుగుతున్నాయి. శాంతయ్య రిటైర్‌మెంట్‌కు రెండున్నర సంవత్సరాల గడువు ఉండడం, రెండేళ్ల ముందు ఉద్యోగం నుంచి దిగిపోయి కొడుకుకు ఉద్యోగం పెట్టించే విషయం, ఆస్తి తగాదా నేపథ్యంలో గతంలో రెండు సార్లు శాంతయ్యను హతమార్చేందుకు యత్నించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గతంలో లక్షెట్టిపేటలో ఒక హత్య కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురిని సృజన సంప్రదించినట్లు తెలుస్తోంది. వారికి సుపారీగా 15 లక్షల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకొని ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం. రెండు క్యాన్లలో పెట్రోల్ (Petrol) తీసుకొని ఆటోలో గుడిపెల్లికి వచ్చి శివయ్య-పద్మ ఇంట్లో పెట్రోల్ చల్లి నిప్పంటించినట్లు తెలిసింది. సీన్ రీకన్‌స్ట్రక్షన్ (Scene reconstruction) చేయాలని పోలీసులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. శాంతయ్య భార్య, కుమారులతోపాటు, మరో ముగ్గురు మొత్తం ఆరుగురు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.