Munugode By Election: ‘మునుగోడు’పై ఎన్నికల కమిషన్ నజర్
ABN , First Publish Date - 2022-10-28T19:56:28+05:30 IST
దేశంలోనే అత్యధిక ఖరీదైన ఎన్నికగా మునుగోడు ఉప ఎన్నిక (Munugode By Election) ఉండబోతుందని సర్వత్రా విస్తృత ప్రచారం జరిగింది. ఇప్పటికే మూడు ప్రధాన పార్టీలు సుమారు రూ.300 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు సమాచారం.
నల్లగొండ: దేశంలోనే అత్యధిక ఖరీదైన ఎన్నికగా మునుగోడు ఉప ఎన్నిక (Munugode By Election) ఉండబోతుందని సర్వత్రా విస్తృత ప్రచారం జరిగింది. ఇప్పటికే మూడు ప్రధాన పార్టీలు సుమారు రూ.300 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు సమాచారం. ఇక పోలింగ్ (Polling)కు ముందు రోజు ఓటు కొనుగోలుపై ఈ వ్యయం ఎక్కడికో వెళ్తుందనేది నిఘా వర్గాలకు స్పష్టమైన సమాచారం ఉంది. అంతా ఊహించినట్లుగానే అధికారులు అదృశ్యశక్తుల ఒత్తిడికి గురై కేటాయించిన గుర్తు మాయం చేయడం, కీలకమైన రిటర్నింగ్ అధికారి (Returning Officer) స్థానంలో మరొకరిని నియమించాల్సి రావడం చకచకా సాగిపోయాయి. ఈ నేపథ్యంలో మునుగోడు ఉపఎన్నికలో ప్రతి అంశంలోనూ రెట్టింపు స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
మునుగోడు దారులన్నీ చెక్‌పోస్టులతో దిగ్బంధం
మునుగోడు నియోజకవర్గంలోకి ప్రవేశించిన ఒక వాహనం బయటికి రావాలంటే కనీసం నాలుగు సార్లు పోలీసుల తనిఖీని ఎదుర్కోవాల్సి వస్తోంది. మునుగోడుకు వచ్చే దారులన్నింటినీ పోలీస్ చెక్‌పోస్టు (Police check post)లతో దిగ్బంధం చేశారు. నియోజకవర్గంలోకి ప్రవేశించే ప్రతీ వాహనం నెంబరు, యజమాని పేరు, ఏ అవసరం కోసం వచ్చారో నమోదు చేసుకుంటున్నారు. కార్లు మాత్రమే కాదు ఆర్టీసీ బస్సులు, గ్రామాల మధ్య తిరిగే ఆటోలను సైతం క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. నియోజకవర్గంలో ప్రచారం కోసం తిరిగే నేతలు ఈ చెకింగ్‌లతో విసుగెత్తిపోతున్నారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు సైతం పలుమార్లు వాహనం దిగి పక్కకు నిలబడటం అనివార్యమైంది. నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 84 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు.
కొన్ని ప్రధాన రహదారుల్లో కాగా మరికొన్ని గ్రామాల మధ్యలో సైతం ఏర్పాటు చేశారు. కేంద్ర బలగాలు, రాష్ట్ర బలగాలు, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా ఈ చెక్‌పోస్టుల తనిఖీల్లో పాలుపంచుకుంటున్నారు. ప్రతీ చెక్‌పోస్టులో ఒక ఎస్‌ఐ లేదా ఏఎ్‌సఐ నిరంతరం విధుల్లో ఉండేలా చూస్తున్నారు. గ్రామానికి ఎనిమిది మంది పోలీసులు ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. సాధారణంగా ఎన్నికల కమిషన్ ఒక సాధారణ పరిశీలకుడిని, మరో వ్యయ పరిశీలకుడిని నియమిస్తుంది. మునుగోడులో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఇటీవలే అదనంగా మరో వ్యయ పరిశీలకుడిని నియమించారు.